logo

మిరప విత్తనం... దళారుల పెత్తనం

జిల్లాలో ఏటా ఏదో రూపంలో నకిలీ విత్తనాలతో రైతులు మోసపోతూనే ఉన్నారు. యంత్రాంగం పర్యవేక్షణ లోపం ఒక కారణమైతే... ఎక్కువ శాతం దళారులను నమ్మి నట్టేట మునుగుతున్నారు.

Published : 27 May 2024 02:59 IST

నకిలీలతో ఏటా నష్టపోతున్న రైతులు 
కానరాని యంత్రాంగం పర్యవేక్షణ
న్యూస్‌టుడే - మార్కాపురం

మార్కాపురం ఉప కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న నకిలీ విత్తన బాధిత రైతులు (పాత చిత్రం)

మార్కాపురం మండలం భూపతిపల్లె, మిట్టమీదపల్లె, చింతకుంట, కోలభీమునిపాడు గ్రామాల రైతులు... గత ఏడాది పట్టణంలోని ఓ విత్తన దుకాణంలో ఎస్‌డబ్ల్యూ 450 రకం మిరప విత్తనాలు తీసుకుని నాటారు. పైరు ఏపుగా పెరిగినా కాపు మాత్రం రాలేదు. చివరకు అవి నకిలీ విత్తనాలని తేలడంతో లబోదిబోమన్నారు. 


పెద్దారవీడు మండలంలోని బోడిరెడ్డిపల్లెకు చెందిన సుమారు 30 మంది రైతులు సైతం అవే రకం విత్తనాలు నాటి నష్టపోయారు. ఉప కలెక్టర్‌ కార్యాలయం వద్ద వారంతా నెల రోజుల పాటు ఆందోళనలు చేశారు. చివరకు కంపెనీ వారు నామమాత్రంగా పరిహారం చెల్లించి చేతులు దులుపుకొన్నారు.


జిల్లాలో ఏటా ఏదో రూపంలో నకిలీ విత్తనాలతో రైతులు మోసపోతూనే ఉన్నారు. యంత్రాంగం పర్యవేక్షణ లోపం ఒక కారణమైతే... ఎక్కువ శాతం దళారులను నమ్మి నట్టేట మునుగుతున్నారు. పశ్చిమ ప్రకాశంలోని మార్కాపురం, పెద్దారవీడు, పెద్దదోర్నాల, త్రిపురాంతకం, యర్రగొండపాలెం, కంభం, అర్థవీడు మండలాల్లోని చాలా మంది రైతులు గత ఏడాది ఇలా నష్టపోయారు. న్యాయం చేయాలంటూ ఉప కలెక్టర్‌ కార్యాలయం వద్ద రోజల తరబడి ఆందోళనలు చేపట్టారు.

అంతా మాయాజాలం...

మిరప, పత్తి విత్తనాల విషయంలోనే కర్షకులు ఎక్కువగా దగా పడుతున్నారు. పంట సీజన్‌ ఆరంభానికి ముందే... దళారులు ఆయా గ్రామాల్లో తిరుగుతూ నాణ్యమైన విత్తనాలంటూ రైతులను మభ్య పెడతున్నారు. ఏదైనా సమస్య తలెత్తితే తాము బాధ్యత వహిస్తామంటూ ఆ క్షణానికి భరోసా ఇచ్చి నకిలీ విత్తనాలు అంటగడుతున్నారు. ఒకరిని చూసి ఒకరుగా రైతులు వారి వద్ద కొనుగోలు చేస్తున్నారు. సమస్య తలెత్తాక సదరు దళారులు పత్తాలేకుండా పోతున్నారు. ఈ ఏడాది సైతం అప్పుడే గ్రామాల్లో దళారులు హడావుడి మొదలైంది. కొందరు దుకాణదారులు సైతం నాణ్యమైనవంటూ నాసిరకాలు అంటగడుతున్నారు. వాటికి రసీదులు ఇవ్వకపోవడంతో... నష్టపోయినా కర్షకులు చేసేదేమీ లేకపోతోంది.

పెద్దారవీడు మండలం బోడిరెడ్డి పల్లెలో ఏపుగా పెరిగినా కాపు రాని మిరప తోట (పాత చిత్రం)


జిల్లాలో ఖరీఫ్‌ సాగు విస్తీర్ణం 2,02,249 హెక్టార్లు. పత్తి, మిరపతో పాటు... పొగాకు, కంది, వరి తదితర పంటలు సాగు చేస్తుంటారు. ఇందుకోసం సుమారు 30 వేల క్వింటాళ్ల విత్తనాలు వినియోగిస్తున్నారు. వీటిలో మిరప, పత్తి విషయంలోనే ఎక్కువగా సమస్య తలెత్తుతోంది. రైతు సంఘాల నాయకుల అంచనా ప్రకారం... ఏటా పాతిక శాతం మంది రైతులు నకిలీ విత్తనాలతో నష్టపోతున్నారు. 


విత్తనాలు మొలకెత్తక పోవడం, మొలక శాతం తక్కువగా ఉండడం, పూత, పిందె రాకపోవడం; పత్తిలో గూడలు రాకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే రైతులు వెంటనే వ్యవసాయశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలి. వారు శాస్త్రవేత్తలతో పరిశీలన చేయించి... విత్తనం పరంగా సమస్య ఉంటే నష్ట పరిహారం వచ్చేలా సిఫారసు చేస్తారు. కంపెనీలు చెల్లించకుంటే వినియోగదారుల ఫోరం ద్వారా పరిహారం పొందే వీలుంది.


రూ.మూడు లక్షలు నష్టపోయా...
- సురవరం వీరారెడ్డి, బోడిరెడ్డిపల్లె, పెద్దారవీడు మండలం

గత ఏడాది మార్కాపురం పట్టణంలోని ఓ దుకాణంలో మిరప విత్తనాలు కొనుగోలు చేసి మూడు ఎకరాల్లో సాగు చేశాను. పైరు ఏపుగా పెరిగినా... పూత, పిందె రాలేదు. రూ.3 లక్షల మేర నష్టపోయాను. నాలానే మోసపోయిన మరికొందరితో కలిసి ఆందోళన చేస్తే కొద్ది పాటి పరిహారం ఇచ్చారు.


నేటికీ అప్పు తీరలేదు...
- గాలి చిన్న లక్ష్మీరెడ్డి, బోడిరెడ్డిపల్లె

కొత్తరకం విత్తనం ఎస్‌డబ్ల్యూ 450తో మంచి దిగుబడి వస్తుందంటే నమ్మి... గత ఏడాది రెండెకరాల్లో సాగు చేశాను. రూ.మూడు లక్షలు అప్పు తెచ్చి మరీ పెట్టుబడి పెట్టాను. అనుకున్నదానికి మించి మొక్కలు పెరిగినా కాపు రాలేదు. ఇప్పటికీ అప్పు తీరలేదు.


జాగ్రత్తలు పాటించాలి...
- శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయ అధికారి, ఒంగోలు 

విత్తనాల కొనుగోలు సమయంలో దుకాణం డీలరు వద్ద పూర్తి వివరాలు నమోదు చేయించడంతో పాటు... తప్పనిసరిగా రసీదు తీసుకోవాలి. విత్తన సంచులు, కొద్దిపాటి విత్తనాలు పంట చివరి వరకు దగ్గర పెట్టుకోవాలి. తద్వారా... ఏదైనా తేడా జరిగితే పరిహారం పొందేందుకు వీలుంటుంది. అనధికారికంగా ఎవరైనా విత్తనాలు విక్రయిస్తున్నట్లు తెలిస్తే వ్యవసాయ అధికారులకు వెంటనే సమాచారం ఇవ్వాలి. గ్రామాల్లో రాత్రి వేళల్లోనే ఎక్కువగా నకిలీ విత్తనాల విక్రయాలు జరుగుతున్నట్లు అధికారుల విచారణలో తేలింది. ఈ విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని