logo

సంచలనాల వెంటే పరుగు... సామాన్యులంటే విసుగు

సంచలన కేసులు నమోదైతే ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి తక్షణ ఫలితాలు రాబడుతున్న జిల్లా పోలీసులు... సామాన్యుల కేసుల దర్యాప్తును మాత్రం సాగదీస్తున్నారు. మా విషయం కాస్త చూడండని బాధితులు కోరితే విసుగు ప్రదర్శిస్తున్నారు.

Published : 27 May 2024 03:12 IST

ఓట్ల లెక్కింపు విధులంటూ చిన్న కేసులు పట్టని వైనం
విమర్శలకు తావిస్తున్న జిల్లా పోలీసుల తీరు
న్యూస్‌టుడే, ఒంగోలు నేరవిభాగం

సంచలన కేసులు నమోదైతే ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి తక్షణ ఫలితాలు రాబడుతున్న జిల్లా పోలీసులు... సామాన్యుల కేసుల దర్యాప్తును మాత్రం సాగదీస్తున్నారు. మా విషయం కాస్త చూడండని బాధితులు కోరితే విసుగు ప్రదర్శిస్తున్నారు. పోలింగ్‌ ముగిసినా ఓట్ల లెక్కింపు బందోబస్తు పేరుతో పెండింగ్‌లో పెడుతున్నారు. కనీసం ఉన్నతాధికారులను కలిసి గోడు వెల్లబోసుకునే అవకాశమూ ఇవ్వక పోవడం విమర్శలకు తావిస్తోంది.


నాణేనికి మరోవైపు...

మొబైల్‌  దుకాణంలో చోరీకి పాల్పడిన అనుమానితులు (సీసీ కెమెరా దృశ్యాలు)

మార్చి 28 

జిల్లా పోలీసు కార్యాలయానికి కూతవేటు దూరంలో కర్నూలు రోడ్డు పైవంతెన సమీపంలోని అక్షిత్‌ మొబైల్స్‌లో దొంగలు పడ్డారు. గడ్డపారలతో షట్టర్లను పెకలించి... రూ.30 లక్షల విలువైన మొబైళ్లను అపహరించారు. క్లూస్‌ టీమ్, పోలీసులు నేరస్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. తరువాత కేసు దర్యాప్తును పట్టించుకోలేదు. గత కొన్ని రోజులుగా సదరు మొబైళ్లు యాక్టివేట్‌ అవుతున్నట్లుగా దుకాణదారుకు సందేశాలు వస్తున్నాయి. వాటి ఆధారంగా నిందితుల్ని పట్టుకుని రికవరీకి ప్రయత్నించవచ్చని తాలూకా స్టేషన్‌ చుట్టూ బాధితుడు ప్రదక్షిణలు చేస్తున్నారు. ఎన్నికల విధులు, అధికారులు లేరంటూ పోలీసులు అతడిని తిప్పుతున్నారు.


ఒంగోలు సంతపేటకు చెందిన వృద్ధురాలు... వైద్యం కోసం వేరే నగరానికి వెళ్లి మందులు, ఇతర సామగ్రితో అయిదురోజుల క్రితం వచ్చారు. ఆటోలో ఇంటికి వెళ్తూ... చిన్న పని నిమిత్తం మార్గం మధ్యలో ఓ దుకాణం వద్ద ఆగారు. కాస్త ముందు ఆపుతానని చెప్పిన ఆటో డ్రైవర్‌ సదరు సరకులతో ఉడాయించాడు. బాధితురాలు వెంటనే రెండో పట్టణ స్టేషన్‌కు వెళ్లారు. తమ పరిధి కాదని చెప్పడంతో ఒకటో పట్టణ స్టేషన్‌కు వచ్చారు. పోయిన సరకులు, మందుల విలువ రూ.15 వేల లోపే అయినా... వైద్య పరీక్షలు, ఇతర నివేదికలతో కూడిన ఫైల్‌ ఉన్నందున సీసీ కెమెరాల సాయంతో సదరు ఆటోను గుర్తించాలని కోరారు. అయిదు రోజులుగా స్టేషన్‌ చుట్టూ తిరుగుతున్నా స్పందన లేదు. 


ఈ స్పందన అనూహ్యం...

రికవరీ చేసిన నగదు వివరాలు వెల్లడిస్తున్న పోలీసులు

ఏప్రిల్‌ 19

కర్నూలు రోడ్డులోని ఇండియన్‌ ఆయిల్‌ పెట్రోల్‌ బంకు వద్ద నిలిపి ఉంచిన సీఎంఎస్‌ సెక్యూరిటీస్‌ వాహనంలోంచి రూ.64 లక్షలు అపహరణకు గురయ్యాయి. అప్రమత్తమైన పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేసి నిందితుల కోసం జల్లెడపట్టారు. చివరకు ఇద్దరిని పట్టుకుని... మర్రిచెట్టు తొర్రలో వారు దాచిన నగదును స్వాధీనం చేసుకున్నారు.


ఏప్రిల్‌ 26

మాజీ మంత్రి, వైకాపా నేత శిద్దా రాఘవరావు ఇంట్లోకి అర్ధరాత్రి వేళ ఆగంతకులు ప్రవేశించారు. కాపలాదారుపై కత్తులతో దాడికి యత్నించారు. గన్‌మెన్‌ అప్రమత్తం కావడంతో పరారయ్యారు. ఈ కేసు దర్యాప్తులో ఉండగానే... మరోసారి ఆయన ఇంట్లోకి బెదిరింపు లేఖ విసిరి పరారయ్యారు. ఈ ఉదంతాన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేసి నిందితులను పట్టుకున్నారు.


దహనం చేసిన కారును పరిశీలిస్తున్న అధికారులు

మే 24

అర్ధరాత్రి సమయంలో... సింగరాయకొండ మండలం మూలగుంటపాడులో లారీ యజమానుల సంఘం అధ్యక్షుడు, తెదేపా నేత చిగురుపాటి శేషగిరి ఇంటిముందు నిలిపి ఉంచిన కారును గుర్తు తెలియని వ్యక్తులు దహనం చేశారు. బాధితుడు తెదేపా నాయకుడు కావడం, ఎన్నికల సమయం కావడంతో పోలీసులు ఆగ మేఘాల మీద కదిలారు. గంటల వ్యవధిలోనే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.


బాధితుల  గోడు పట్టదు...

మాజీమంత్రి, అధికార పార్టీ నేత ఇంటిలో దోపిడీ యత్నం; ఏటీఎంల్లో నగదు నింపే వాహనంలో పట్టపగలే రూ.64 లక్షల అపహరణ ఘటనలు... జిల్లాలో సంచలనం సృష్టించినవే. తాజాగా సింగరాయకొండలో కారు దహనం కేసులో ఏమాత్రం ఆలస్యం జరిగినా... రాజకీయ అలజడులకు కారణమయ్యే అవకాశం ఉంది. ఈ మూడు కేసుల్లో బాధితులు ప్రముఖులు కావడంతో పోలీసులు తక్షణం స్పందించారు. నిందితుల కోసం జల్లెడపట్టారు. సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించారు. ఇతరత్రా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి... గంటల వ్యవధిలోనే నిందితులను అరెస్టు చేశారు. ఇక్కడి వరకు పోలీసుల పనితీరు ప్రశంసనీయమే. ఇదే వేగం సామాన్యుల కేసుల విషయంలో ప్రదర్శించడం లేదు. తమ దర్యాప్తు సామర్థ్యాన్ని వినియోగించడం లేదు. ఆధారాలకు ఆస్కారం ఉందని బాధితులు స్టేషన్ల చుట్టూ తిరిగి మొర పెట్టుకుంటున్నా... మీ కేసు తప్ప మరే పనీ లేదనుకుంటున్నారా..? అని విసుక్కుంటున్నారు. పోలీసులతో వ్యవహారం కావడంతో ఏం చేయాలో తెలియక బాధితులు తమలోతామే కుంగిపోతున్నారు.


అన్నిటికీ  ఎన్నికల సాకు..

ఒంగోలులో చోటుచేసుకున్న ఈ కేసులు మాత్రమే కాదు... జిల్లాలోని దాదాపు అన్ని స్టేషన్లలోనూ ఇదే పరిస్థితి. ప్రతి చోటా ఈ తరహా ఉదంతాలు నిత్యకృత్యంగా మారాయి. సంచలనాత్మక కేసుల్లో అసాధారణ స్థాయిలో స్పందించి అమోఘమైన ఫలితాలు సాధిస్తున్న పోలీసులు... సామాన్యుల కేసులను మాత్రం పట్టించుకోవటం లేదు. అంతా ఎన్నికల విధుల్లో ఉన్నాం, ఇప్పుడు కాదు, తర్వాత రండని వెనక్కు పంపుతున్నారు. కొందరు బాధితులు తమ సమస్యలు చెప్పేందుకు జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చినా ఇదే పరిస్థితి ఎదువుతోంది. కొందరిని ప్రధాన ద్వారం నుంచే వెనక్కు పంపిస్తుంటే... మరికొందరిని లోపలకు అనుమతించినా ఉన్నతాధికారులను కలిసే అవకాశం ఇవ్వడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని