logo

YSRCP: చావగొట్టినా కళ్లకు గంతలేనా!.. రౌడీల్లా రెచ్చిపోయిన వైకాపా ప్రజాప్రతినిధులు

ఓట్ల లెక్కింపు అనంతరం హింసాత్మక చర్యల నియంత్రణపై ఈసీ సీరియస్‌గా దృష్టి సారించింది. పొరుగునే ఉన్న పల్నాడు జిల్లాలో పోలింగ్‌ అనంతరం చెలరేగిన హింస ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Updated : 24 May 2024 08:11 IST

ఏకంగా పోలింగ్‌ కేంద్రంలోనే పిడిగుద్దులు
వెంటాడి మరీ ఎన్నికల అధికారిణికి బెదిరింపులు
అయినా ప్రశాంతమంటూ ఎస్పీ ‘సుమిత’ భాషణలు

శతకోడు, వాదంపల్లెలో ఘటనలు మినహా జిల్లాలో ఎలాంటి ఘర్షణలు లేవు. ఎన్నికల సందర్భంగా జిల్లాలో 26 వేల మందిపై బైండోవర్‌ కేసులు నమోదు చేశాం’..

మాక్‌ డ్రిల్, రాజకీయ పార్టీల నాయకుల సదస్సు సందర్భంగా యర్రగొండపాలెంలో ఇవీ ఎస్పీ సుమిత్‌ సునీల్‌ చేసిన వ్యాఖ్యలు


  • జిల్లాలో ఎన్నికలకు ముందు, ఆ తర్వాత కొన్ని ప్రాంతాల్లో హింస చెలరేగింది. ఎన్నికలకు ముందే ఇరవై ఆరు వేల మందిని పోలీసులు బైండోవర్‌ చేసినా ఫలితం లేకపోయిందనేందుకు ఇదే నిదర్శనం. ప్రచార పర్వంలోనే ఒంగోలులో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. రోగులు చికిత్స పొందే రిమ్స్‌లో అల్లరిమూకలు రెచ్చిపోయాయి. వైకాపా నేతలు అర్ధరాత్రి వీరంగం సృష్టించారు. కనిపించిన తెదేపా కార్యకర్తలపై విరుచుకు పడి దాడులు చేశారు. అయినప్పటికీ కారకులపై పోలీసులు కనీసం దృష్టి సారించలేదు.
  • పోలింగ్‌ రోజు ఒంగోలు నగరంలోని వెంగుముక్కలపాలెంలోనూ ఘర్షణలు తలెత్తాయి. వైకాపా నేతలు, శ్రేణులు ఏకంగా పోలింగ్‌ బూత్‌లోకి దౌర్జన్యంగా వెళ్లి ప్రతిపక్షాలకు చెందినవారిపై దాడులకు తెగబడ్డారు. దొంగ ఓట్లను అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిపై పిడిగుద్దులు కురిపించారు. ఈ అరాచకాలను పోలీసులు అసలు పరిగణనలోకి తీసుకోలేదు.
  • వైకాపా ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పోలింగ్‌ రోజు యర్రగొండపాలెం నియోజకవర్గం వీరభద్రాపురంలో రెచ్చిపోయారు. రిటర్నింగ్‌ అధికారిణి డాక్టర్‌ శ్రీలేఖ పట్ల పోలింగ్‌ కేంద్రంలోనే దురుసుగా ప్రవర్తించారు. పోలీసుల దృష్టిలో అదీ చిన్న ఘటన మాత్రమే.
  • సంతనూతలపాడు వైకాపా ఎమ్మెల్యే సుధాకర్‌బాబు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారు. స్థానికుడు కాకున్నా.. యర్రగొండపాలెం నియోజకవర్గంలోని పలు పోలింగ్‌ బూత్‌లలో హల్‌చల్‌ చేశారు. ఆయన్ను కనీసం బయటికి పంపే ప్రయత్నం కూడా పోలీసులు చేయలేదు. ఇదీ పోలీసులకు లెక్కలోకి లేదు. కేవలం శతకోడు, వాదంపల్లి ఘటనలను మాత్రమే గుర్తిస్తున్న పోలీసులు.. అధికార పార్టీకి దాసోహం అన్నట్లు వ్యవహరిస్తున్నారు. వారి నేతృత్వంలో సాగిన అరాచకాలను అత్యంత తేలికగా తీసుకుంటున్నారు.

ఒంగోలు, న్యూస్‌టుడే: ఓట్ల లెక్కింపు అనంతరం హింసాత్మక చర్యల నియంత్రణపై ఈసీ సీరియస్‌గా దృష్టి సారించింది. పొరుగునే ఉన్న పల్నాడు జిల్లాలో పోలింగ్‌ అనంతరం చెలరేగిన హింస ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్న తిరుపతి, అనంతపురం జిల్లాల్లోనూ స్పెషల్‌బ్రాంచి వైఫల్యం కొట్టొచ్చినట్లు కనపడింది. జిల్లాలోనూ పోలింగ్‌కు ముందు, ఆ తర్వాత పలుచోట్ల ఘర్షణలు చోటుచేసుకున్నాయి. అయినా పోలీసులు మాత్రం అవేమంత పెద్దవి కాదంటూ కొట్టేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫలితాలు వెల్లడించే జూన్‌ 4కు పోలీసుల సన్నద్ధత ఎంత.? అల్లరిమూకలను పూర్తిస్థాయిలో నియంత్రిస్తారా..? ఉదాసీనంగానే వ్యవహరిస్తారా..? అనే సందేహలు తలెత్తుతున్నాయి.

ఒంగోలు అల్లర్లపై ఉదాసీనత..

ఎన్నికలకు ముందు ఒంగోలులో తీవ్రస్థాయి ఘర్షణాత్మక వాతావరణం నెలకొంది. సమతానగర్, జీజీహెచ్‌ వద్ద వైకాపా శ్రేణులు రణరంగం సృష్టించాయి. అర్ధరాత్రి వేళ వందలాది మంది అల్లరిమూకలు వీరంగం వేశాయి. ఘర్షణలో గాయపడిన తెదేపాకు చెందిన మేడికొండ మోహన్‌ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కనీసం కేసు నమోదు చేయలేదు. అతను పదేపదే స్టేషన్‌ చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో చివరకు న్యాయస్థానాన్ని ఆశ్రయించి ప్రైవేట్‌ కేసు దాఖలు చేయాల్సి వచ్చింది. ఇక్కడ పోలీసులు ఉద్దేశపూర్వకంగానే కేసు నమోదు చేయకపోయినా సంబంధిత అధికారులపై ఎటువంటి చర్యలు లేవు.


‘గంజాయి’ మూకపై దృష్టేదీ..!

జిల్లా కేంద్రంలో కొందరు వైకాపా నేతలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం గంజాయి మూకను పెంచి పోషిస్తోంది. ఒంగోలు నగరంలోని పలు డివిజన్లకు చెందిన యువకులతో ప్రత్యేక ప్రైవేట్‌ సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వీరిలో కొందరిని గంజాయి మత్తులోకి దించి నేతలు అల్లర్లకు ఎగదోస్తున్నారు. సమతానగర్, జీజీహెచ్‌ ఉదంతాలతో పాటు వెంగముక్కపాలెం ఘర్షణల్లోనూ వీరినే వినియోగించారు. ఈ ఘటనలో కేసులు నమోదైనా అధికార పార్టీకి చెందినవారిపై ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఆయా ఘటనల్లో నమోదైన వీడియోలను పరిశీలిస్తే.. ఎవరు పాల్గొన్నారు.. వారి నేరచరిత్ర.. నేపథ్యం అంతా తెలిసే అవకాశం ఉంది. అయినప్పటికీ పోలీసు యంత్రాంగం దృష్టి పెట్టలేదు. అల్లరిమూకల పట్ల కఠినవైఖరి అవలంబించాల్సిన పోలీసులు అధికారపార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి మెతక, ఉదారవాద ధోరణిని అవలంబిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే వైఖరి కొనసాగిస్తే.. అల్లరిమూకలను నియంత్రించకుండా, వారి పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తే కౌంటింగ్‌ అనంతరం ఘర్షణలను నిలువరించటం కష్టమేననే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని