logo

కమిషనర్‌ క్షమాపణ చెప్పాల్సిందే

కౌన్సిలర్‌ను అవమానించిన కమిషనర్‌ క్షమాపణ చెప్పాలంటూ... ఆయనను లోపల ఉంచి కార్యాలయానికి తాళం వేసిన సంఘటన దర్శి నగర పంచాయతీలో సోమవారం చోటుచేసుకుంది.

Published : 29 Nov 2022 02:17 IST

దర్శి నగర పంచాయతీకి తాళం వేసిన సభ్యులు

కౌన్సిల్‌ సమావేశం రసాభాస

కమిషనర్‌ను లోపల ఉంచి నగర పంచాయతీ కార్యాలయానికి
తాళం వేసి నిరసన తెలుపుతున్న సభ్యులు

దర్శి, న్యూస్‌టుడే: కౌన్సిలర్‌ను అవమానించిన కమిషనర్‌ క్షమాపణ చెప్పాలంటూ... ఆయనను లోపల ఉంచి కార్యాలయానికి తాళం వేసిన సంఘటన దర్శి నగర పంచాయతీలో సోమవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. ఛైర్మన్‌ నారపుశెట్టి పిచ్చయ్య అధ్యక్షతన కౌన్సిల్‌ సమావేశం ఏర్పాటుచేశారు. వివిధ పనుల విషయంలో కమిషనర్‌ మంజునాథ్‌ గౌడ్‌ తీరుపై తెదేపా, వైకాపా కౌన్సిలర్లు ప్రశ్నించారు. లంచాలు తీసుకుని అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. వైస్‌ ఛైర్మన్‌ కోటయ్య అజెండా కాగితాలను చించి నిరసన తెలిపారు. తమ వార్డులో చేసిన పనులకు బిల్లులు ఇవ్వకపోవడం,  ప్రతిపాదించినవి అజెండాలో చేర్చకపోవడంపై ప్రశ్నించగా... ఛాంబర్‌ నుంచి బయటకు వెళ్లాలంటూ తనతో కమిషనర్‌ పరుషంగా మాట్లాడారని వైకాపా రెండో వార్డు కౌన్సిలర్‌ వీసీ రెడ్డి ఆరోపించారు. మరో కౌన్సిలర్‌ మోహన్‌ రెడ్డి సైతం కమిషనర్‌ను నిలదీశారు. సభ్యులు అడిగిన వాటికి సమాధానం చెప్పాలే తప్ప బయటకు వెళ్లమనే హక్కు కమిషనర్‌కు లేదని పేర్కొన్నారు. ఉక్కిరిబిక్కిరైన కమిషనర్‌... సమావేశం నుంచి అర్ధంతరంగా లేచి ఛాంబర్‌కు వెళ్లిపోయారు. దీంతో ఛైర్మన్‌ సహా సభ్యులంతా కార్యాలయం బయటకు వచ్చి... అధికారులు, సిబ్బందిని లోపల ఉంచి కార్యాలయానికి తాళం వేశారు. కౌన్సిలర్‌కు కమిషనర్‌ క్షమాపణ చెప్పాలని నిరసనకు దిగారు. దీంతో కమిషనర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు అక్కడకు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చివరకు కమిషనర్‌ వచ్చి... భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూస్తానని క్షమాపణ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. తాళం తీయడంతో ఆయన బయటకు వెళ్లిపోయారు. వైస్‌ ఛైర్మన్లు స్టీవెన్‌, కోటయ్య, కౌన్సిలర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

సమస్యలు లేవనెత్తి

పొదిలి రోడ్డులో డీఎస్పీ కార్యాలయం ముందు అనుమతులు లేకుండా బహుళ అంతస్తుల భవనం కడుతున్నారని.. చర్యలు తీసుకుని ఉంటే పనులు ఎందుకు జరుగుతాయని కౌన్సిలర్లు నిలదీశారు.

14 వ వార్డులోని డీకే స్థలంలో ఓ నివాసానికి సంబంధించి డబ్బులు తీసుకుని ఆన్‌లైన్‌లో పేరు మార్చారంటూ వైస్‌ ఛైౖర్మన్‌ కోటయ్య ఆరోపించారు. ‌్ర మొత్తం 20 మంది సభ్యులకు ఇరు పార్టీల నుంచి 10 మంది మాత్రమే హాజరయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని