logo

పోలీసుల వేధింపులే.. ప్రాణం తీశాయా!

సింగరాయకొండ మండలం కనుమళ్ల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది.

Published : 30 Nov 2022 02:07 IST

చికిత్స పొందుతున్న బాధితుడు మహేష్‌

ఈనాడు డిజిటల్‌, నెల్లూరు: సింగరాయకొండ మండలం కనుమళ్ల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఒంటరిగా మాట్లాడుకుంటున్న జంటను పోలీసులు నిలదీయడంతో పాటు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించేందుకు యత్నించడమే ప్రమాదానికి కారణమన్న మాట వినిపిస్తోంది. ఒంగోలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడి దగ్గరకు వెళ్లిన పోలీసులకు.. అదే విషయం తెలిపి.. గోడు వెల్లబోసుకున్నారు. బాధితుడి వివరాల ప్రకారం... ‘ఈ నెల 27వ తేదీ కందుకూరు పట్టణానికి చెందిన మహేష్‌ అనే వ్యక్తి... తన స్నేహితురాలితో కలిసి కారులో కందుకూరు నుంచి సింగరాయకొండ మార్గంలో వెళ్లారు. పలుకూరు అడ్డరోడ్డు దాటిన తర్వాత ఎల్‌వీ ప్రసాద్‌ కంటి ఆసుపత్రి సమీపంలో రోడ్డు పక్కన వాహనం ఆపి మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న కందుకూరు పోలీసులు వారిని విచారించారు. ఇక్కడేం చేస్తున్నారు? అని నిలదీశారు. దీంతో పాటు కానిస్టేబుళ్లను వీడియో తీయమని చెప్పడంతో.. కారు వెనుక సీటులో ఉన్న యువతి భయపడి బోరున విలపించింది. వెంటనే కారులో నుంచి కిందకు దిగిన మహేష్‌ వారిని వేడుకున్నారు. అయినా వినకపోవడంతో తమ పరువు పోతుందనే భయంతో.. కారులో అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయాడు. పోలీసులు వెంట పడుతుండటంతో.. కంగారు పడి చెట్టును ఢీకొట్టినట్లు’ బాధితుడు తెలిపాడు. ఈ ప్రమాదంలో యువతి మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై విచారణాధికారిణి సింగరాయకొండ ఎస్సై ఫిరోజ్‌ ఫాతిమాను ‘ఈనాడు’ వివరణ కోరగా... వాహన తనిఖీల్లో భాగంగా పోలీసులు వారితో మాట్లాడారు. యువతి కూడా ఉండడంతో ప్రశ్నించారు. దానిపై సమాధానం చెప్పలేక.. వెళ్లేక్రమంలో ప్రమాదానికి గురయ్యారని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని