logo

నగదు అందక... గృహం దక్కక

పేదలకు గూడు కల్పించాలన్న ఉద్దేశంతో గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన టిడ్కో ఇళ్ల నిర్మాణాల్లో తీవ్ర జాప్యం నెలకొంది. వైకాపా అధికారంలోకి రాగానే అప్పటి వరకు జరుగుతున్న పనులను ఆపి రివర్స్‌ టెండరింగ్‌ పిలుస్తామని ప్రకటించడంతో ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.

Published : 01 Dec 2022 03:06 IST

నత్తనడకన సాగుతున్న టిడ్కో ఇళ్ల నిర్మాణ పనులు

లబ్ధిదారుల ఎదురుచూపులు

టిడ్కో ఇళ్ల నిర్మాణ పనులు చేస్తున్న కార్మికులు

పేదలకు గూడు కల్పించాలన్న ఉద్దేశంతో గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన టిడ్కో ఇళ్ల నిర్మాణాల్లో తీవ్ర జాప్యం నెలకొంది. వైకాపా అధికారంలోకి రాగానే అప్పటి వరకు జరుగుతున్న పనులను ఆపి రివర్స్‌ టెండరింగ్‌ పిలుస్తామని ప్రకటించడంతో ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో సొంత ఇల్లు వస్తుందన్న ఆశతో డబ్బులు చెల్లించినవారు ఆర్థిక ఇబ్బందులతో విలవిల్లాడారు.  అటు నగదు రాక.. ఇటు గృహం దక్కక అయోమయంలో పడ్డారు. ఇటీవల ప్రభుత్వ నిర్ణయంతో పనులు ఎట్టకేలకు మళ్లీ ప్రారంభమైనా తమకు ఇళ్లు ఎప్పుడు దక్కుతాయోనన్న సంశయం లబ్ధిదారుల్లో నెలకొంది.

మార్కాపురం అర్బన్‌ న్యూస్‌టుడే : గత ప్రభుత్వ హయాంలో టిడ్కో ఇళ్లకు టెండర్లను పిలిచి పనులను ప్రారంభించగా, మార్కాపురం పురపాలక సంఘం పరిధిలో వందల సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారు. అందులో మొదటి విడతలో 1020 మంది, మూడో విడతలో 3600 మంది లబ్ధిదారులను అధికారులు ఎంపిక చేశారు. పట్టణ శివారులో పెద్దనాగులవరం దగ్గర స్థలాన్ని ఎంపిక చేసి అక్కడ గృహ నిర్మాణాల పనులను అప్పటి ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ చేతుల మీదుగా  2018 నవంబరు 29న ప్రారంభించారు. 4380 మంది లబ్ధిదారులు 2018 అక్టోబరు 31 నాటికి మున్సిపాలిటీకి రూ.81,90,000ను చెల్లించారు.      
3468 మందికి తొలగింపు....: మార్కాపురం మున్సిపాలిటీ పరిధిలో రెండు విడతల్లో 4380 మంది రూ.500 చొప్పున రూ.21,90,000 లక్షలు డీడీ రూపంలో నగదు చెల్లించారు. అందులో నూతన ప్రభుత్వం కేవలం 912 మంది లబ్ధిదారులకు మాత్రమే టిడ్కో ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు అంగీకరించింది. మిగిలిన 3468 మంది లబ్ధిదారులకు మాత్రం జగనన్న కాలనీ కింద లేఅవుట్లు వేసి అందులో ప్లాట్లు కేటాయించింది. వారు 2018లో డీడీల రూపంలో చెల్లించిన రూ.17,34,000  నగదు సైతం ఇంకా చెల్లించలేదు. వారితో పాటు రెండు పడకల ఇళ్ల నిర్మాణం కోసం రూ.25 వేలు చెల్లించిన 240 మంది లబ్ధిదారులకు రావాల్సిన రూ.81,90,000 కూడా ఇంకా లబ్ధిదారులకు అందలేదు. అటు చెల్లించిన నగదు అందక...ఇళ్లు దక్కక లబ్ధిదారులు అల్లాడిపోతున్నారు. నగదు అంతా టిడ్కో ఖాతాలోనే ఉందని ప్రభుత్వం నుంచి దానిపై స్పష్టత వచ్చిన వెంటనే లబ్ధిదారులు చెల్లించిన నగదును తిరిగి చెల్లిస్తామని అధికారులు పేర్కొంటున్నారు.  

కేవలం 912 గృహాలతో సరి...: ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న వారికి నిర్మించి ఇచ్చే విధంగా స్థానిక పెద్దనాగులవరం సమీపంలో రూ.9 కోట్లు వెచ్చించి మొత్తం 18 ఎకరాల భూమిని గత ప్రభుత్వంలో కొనుగోలు చేశారు. కానీ నూతన ప్రభుత్వం అందులో 9 ఎకరాల్లో మాత్రమే 912 మందికి ఇళ్లు నిర్మించి మిగిలిన 9 ఎకరాల్లో జగనన్న లేఅవుట్లు  వేసి మిగిలిన 3468 మంది లబ్ధిదారులకు కేటాయించాలని నిర్ణయించింది. ఆ మేరకు పనులు దక్కించుకున్న ఇంద్రజిత్‌ మెహతా కన్‌స్ట్రక్షన్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ (ఐజేఎంసీపీఎల్‌) వారు టిడ్కో ఇళ్ల నిర్మాణం ప్రారంభించారు. సముదాయంలో మొత్తం 19 బ్లాక్‌లు కాగా ఒక్కో బ్లాకులో 48 గృహాల చొప్పున 912 గృహాల నిర్మాణాల పనులు సాగుతున్నాయి. అందులో ఇప్పటి వరకు 8 బ్లాకుల్లో 384 గృహాలు పూర్తి కాగా 528 గృహాలు పూర్తి కావాల్సి ఉంది. పూర్తయిన వాటిల్లో 254 ఇళ్లకు లబ్ధిదారుల పేరు మీద రిజిస్ట్రేషన్‌ పక్రియ పూర్తయింది. మరో 238 మందికి రిజిస్ట్రేషన్‌ కోసం ఏర్పాటు చేస్తున్నట్లు పుర అధికారులు పేర్కొంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని