logo

కొండలు కరుగుతున్నాయ్‌

కనిగిరి మండలం యడవల్లి, నందనమారెళ్ల సమీపంలో ఊరకొండ, యడవల్లి కొండలు దాదాపు వెయ్యి ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి.

Published : 02 Dec 2022 03:00 IST

యడవల్లి, నందనమారెళ్లలో దందా
80 ఎకరాల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు

యడవల్లి ప్రాంతంలో కొండను తవ్వి జేసీబీతో
లారీలోకి మట్టి నింపుతున్న దృశ్యం

జిల్లాలోని కనిగిరి ప్రాంతంలో అరుదుగా దొరికే ఎర్రమట్టి, మరస, గులక మట్టిపై అక్రమార్కుల కన్నుపడింది. రాజకీయ పలుకుబడి ఉపయోగించి యథేచ్ఛగా తవ్వి తరలిస్తున్నారు. ఇందుకు కొండలనూ వదలడంలేదు. అయినా రెవెన్యూ, మైనింగ్‌, అటవీశాఖ అధికారులు కన్నెత్తి చూడటంలేదు.

కనిగిరి, న్యూస్‌టుడే: కనిగిరి మండలం యడవల్లి, నందనమారెళ్ల సమీపంలో ఊరకొండ, యడవల్లి కొండలు దాదాపు వెయ్యి ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. ఇటు మున్సిపాలిటీ పరిధిలో.. అటు కొనకనమిట్ల మండలంలోని పెదారికట్ల, చినారికట్లలో భూముల ధరలు పెరిగిపోవడంతో ఎడాపెడా వెంచర్లు వెలిశాయి. వీటిని చదును చేసేందుకు పటిష్టమైన మట్టి కావాలి. అంతే ఈ కొండలపై అక్రమార్కులు దృష్టిసారించారు. పదుల సంఖ్యలో టిప్పర్లు పెట్టి వెంచర్లకు తరలిస్తున్నారు. ఒక్కో టిప్పర్‌ మట్టి గ్రామీణ ప్రాంతాల్లో రూ.6 వేలు, పట్టణాల్లో రూ.10 వేలకు విక్రయిస్తున్నారు. గత వారం రోజులుగా ఈ దందా కొనసాగుతోంది.


పూర్తిగా పిండిచేస్తూ..

ఊరకొండ, యడవల్లి కొండల మద్యలో సుమారు 80 ఎకరాల విస్తీర్ణంలో ప్రస్తుతం మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. రవాణాకు సౌలభ్యంగా ఏకంగా దారిని కూడా ఏర్పాటుచేసుకోవడం విశేషం. తాము అడ్డుకుంటుండగా అధికారులతో మాట్లాడి తరలిస్తున్నామంటూ దళారులు చెబుతున్నారని స్థానికులు వాపోయారు. పైగా వారికి కొందరు నేతల అండదండలు ఉండటంతో నిస్సహాయ స్థితిలో వీరున్నారు. వందల ఏళ్లుగా ఈ కొండలు సమీప ప్రాంతాలకు రక్షణ కవచంగా ఉన్నాయి. ఏ కాలంలోనైనా పచ్చదనంతో కళకళలాడుతూ ఉండటంతో పశువులు, మేకలు, గొర్రెల కాపరులు మేత కోసం వీటి వద్దకు జీవాలను తీసుకువెళ్తుంటారు. చూస్తుండగానే కొండలను పిండి చేస్తుండటంతో వారంతా తల్లడిల్లుతున్నారు. తక్షణం మట్టి తవ్వకాలను నిలిపివేయాలని కోరుతున్నారు. కనిగిరి అటవీశాఖ అధికారి రామిరెడ్డిని వివరణ కోరగా అది రెవెన్యూ పరిధిలోకి వస్తుందని, వారి దృష్టికి తీసుకెళ్తానన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని