logo

నేటి నుంచి పెళ్లి సందడి

మూడు నెలల పది రోజుల విరామం అనంతరం వివాహ శుభకార్యాలకు మంచి రోజులు వచ్చాయి.

Published : 02 Dec 2022 03:00 IST

జిల్లా వ్యాప్తంగా ఈ నెలలో వెయ్యి వివాహాలు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: మూడు నెలల పది రోజుల విరామం అనంతరం వివాహ శుభకార్యాలకు మంచి రోజులు వచ్చాయి. అది కూడా ఈ నెల 18వ తేదీ వరకు మాత్రమే ముహూర్తాలు ఉండటంతో జిల్లా వ్యాప్తంగా సుమారు 1,000 వరకు పెళ్లిళ్లు జరగనున్నాయి. వాటితోపాటు గృహ ప్రవేశాలు, కొత్త ఇళ్లకు భూమి పూజలు చేయనున్నారు. ఇక ఈ మూడు వారాలు ఎటుచూసినా సందడే. ఏర్పాట్లకు సంబంధించి వధూవరుల కుటుంబ సభ్యులు నెల రోజుల ముందునుంచే బిజీగా ఉన్నారు. కల్యాణ మండపాలు మొదలు వివిధ రంగాలకు పని పెరిగింది. తద్వారా పెళ్లి బడ్జెట్‌ 30 నుంచి 50 శాతం వరకు పెరగనుంది.

ఆ తేదీల్లోనే అధికంగా..

మార్గశిర మాసాన్ని పురస్కరించుకుని డిసెంబర్‌ 2, 3, 4, 7, 8, 9, 14, 16, 17, 18 ముహూర్తాలు ఉన్నాయి. అందులోనూ 2, 3, 4, 17, 18 తేదీల్లో ఎక్కువగా జరగనున్నాయి. ప్రస్తుత సీజన్‌లో జిల్లా కేంద్రమైన ఒంగోలు నగరంలోనే సుమారు 500 పెళ్లిళ్లు ఉండనున్నాయి. పుష్యమాసం డిసెంబర్‌ 24 నుంచి జనవరి 21 వరకు ఉండనుంది. ఆ సమయంలో ఎలాంటి శుభాకార్యాలు జరగవు. మాఘ మాసం దృష్ట్యా జనవరి 26 నుంచి మళ్లీ ముహూర్తాలు ఉన్నాయని పురోహితులు చెబుతున్నారు. జిల్లాలో సుమారు 200 కల్యాణ మండపాలు ఉండగా;  ఒంగోలులోనే 36 వరకు కనిపిస్తాయి. శుభ కార్యం నిర్వాహకుల ఆర్థిక స్థోమతను బట్టి మండపాన్ని పూల అలంకరణ చేయిస్తారు. తద్వారా ఒక్కో పెళ్లి నిర్వహణ నిమిత్తం కల్యాణ మండపానికే రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఖర్చవుతున్న దాఖలాలు ఉన్నాయి. అనేక మండపాలు ఇప్పటికే ఖరారు కావడంతో అవి దొరకనివారు ఇళ్లవద్దనే కార్యక్రమాలు నిర్వహించుకొనేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.


ఒంగోలుకు చెందిన వేద పురోహితులు మఠంపల్లి దక్షిణామూర్తి మాట్లాడుతూ ‘‘డిసెంబర్‌ 2 నుంచి 18వ తేదీ రాత్రి వరకు జిల్లా వ్యాప్తంగా వెయ్యి పెళ్లిళ్లు జరగనున్నాయి. అందులో 10 రోజులు మాత్రమే మంచి ముహూర్తాలున్నాయి. పురోహితుల దగ్గర నుంచి అనుబంధ రంగాలన్నింటికి మంచి డిమాండ్‌ ఉంది.’’ అని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని