logo

వీరి వీరి గుమ్మడి పండు ఏ స్థానం ఎవరిది?

అధికార పార్టీలో స్థానాల మార్పుపై ఇప్పుడు రసవత్తర చర్చ నడుస్తోంది. ప్రధానంగా రిజర్వ్‌డ్‌ నియోజకవర్గాల్లో చోటుచేసుకుంటున్న కీలక పరిణామాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

Updated : 01 Dec 2023 08:40 IST

సంతనూతలపాడుపై మేరుగు కన్ను
కొండపి వైపు ఆదిమూలపు చూపు
రిజర్వ్‌డ్‌ స్థానాల్లో కీలక పరిణామాలు
అధికార పార్టీలో మార్పుపై చర్చలు
న్యూస్‌టుడే, ఒంగోలు నేరవిభాగం

అధికార పార్టీలో స్థానాల మార్పుపై ఇప్పుడు రసవత్తర చర్చ నడుస్తోంది. ప్రధానంగా రిజర్వ్‌డ్‌ నియోజకవర్గాల్లో చోటుచేసుకుంటున్న కీలక పరిణామాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. రానున్న ఎన్నికల్లో పలు నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పులకు ఆస్కారం ఉందనే ప్రచారం సాగుతోంది. ప్రధానంగా కొండపి, సంతనూతలపాడుపై ఇద్దరు మంత్రులు దృష్టిసారించారనే విషయం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఇప్పటి వరకు అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న, బాధ్యతలు చూస్తున్న వారికి వీరు పొగబెట్టినట్లుండగా.. అదే సమయంలో తమ స్థానాలను నిలుపుకొనేందుకు ఓ ఎమ్మెల్యే నుంచి నిరసన సెగ కూడా ఎదురవుతుండటం గమనార్హం.

సమావేశాలు.. కలయికలు...: పురపాలక, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి ఆదిమూలపు సురేష్‌కు సొంత నియోజకవర్గం యర్రగొండపాలెంలో నిరసన సెగ గట్టిగానే తగులుతోంది. ఒక ప్రధాన సామాజికవర్గంతో పాటు, సొంత సామాజికవర్గానికి కూడా కనీస ప్రాధాన్యమివ్వకుండా నిర్లక్ష్యం చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏదైనా పనిపై ఎవరైనా తన వద్దకు వస్తే అదే గ్రామంలోని అధికార పార్టీకి చెందిన నాయకుడి సిఫారసు కావాలనే నిబంధన అక్కడి వాసులను ఇబ్బందులకు గురిచేస్తోంది. మంత్రివర్గ విసర్తణలో భాగంగా ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డిని తప్పించి సురేష్‌ను కొనసాగించారు. ఆ తర్వాత జిల్లాలో చోటుచేసుకున్న పరిణామాలు కూడా ఆదిమూలానికి మరింత క్లిష్ట పరిస్థితులను తెచ్చి పెట్టాయి. బాలినేని తన పదవిని త్యజిస్తేనే తాను మంత్రివర్గంలో కొనసాగుతున్నాంటూ ఆయన పదేపదే ప్రకటిస్తున్నా.. సొంత నియోజకవర్గంలో మాత్రం పదే పదే అదే సామాజికవర్గం నుంచి అసంతృప్తులు, నిరసన సెగలు ఎదురవుతూనే ఉన్నాయి. దీంతో నియోజకవర్గ మార్పుపై ఇప్పుడు తీవ్రస్థాయిలో చర్చ సాగుతోంది. కొండపి నియోజకవర్గానికి చెందిన కొందరు కీలక ద్వితీయశ్రేణి నాయకులతో ఒంగోలులోని ఒక ప్రైవేట్‌ హోటల్‌లో ఇటీవల సమావేశం కావడం.. అంతకుముందు మాజీ మంత్రి బాలినేనిని ఆయన కలవడం ఇందుకు బలం చేకూరుస్తోంది.

అందుతుందా సహకారం..!: కొండపి నియోజకవర్గంపై సీరియస్‌గా దృష్టిసారించాలని అధిష్ఠానం నుంచి మంత్రి సురేష్‌కు ఆదేశాలు అందినట్లు సమాచారం. దీంతో ఆయన ఇప్పటికే ఆ దిశగా తన ప్రయత్నాలు సాగిస్తున్నారు. అయితే ఇప్పటికే అక్కడి నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలైన పీడీసీసీ బ్యాంకు మాజీ అధ్యక్షుడు డాక్టర్‌ మాదాసి వెంకయ్యతో పాటు, గత ఎన్నికల్లో వైకాపా సీటు ఆశించి భంగపడి పార్టీ బాధ్యుడిగా వ్యవహరిస్తున్న వరికూటి అశోక్‌బాబు టిక్కెట్‌ ఆశిస్తున్నారు. సురేష్‌కు స్థానికంగా వీరెంత సహరిస్తారనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

మద్దతుదారులను కూడగట్టే యత్నాలు...: సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి మేరుగు నాగార్జున ప్రస్తుతం బాపట్ల జిల్లా వేమూరు నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అక్కడ నెలకొన్న సామాజిక, రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన కూడా నియోజకవర్గం మార్పుపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో జిల్లాలోని సంతనూతలపాడుపై సీరియస్‌గా దృష్టి సారించి క్యాంపు కార్యాలయం ఏర్పాటుకు కూడా ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నాలు ప్రస్తుతం అక్కడి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్యే టీజేఆర్‌.సుధాకర్‌బాబుకు మింగుడు పడటం లేదు. మేరుగు ప్రయత్నాలకు చెక్‌ పెట్టేలా నియోజకవర్గంలోని కొందరిని తనకు అనుకూలంగా ఏకీకరణ చేసే ప్రయత్నంలో ఆయన ఉన్నట్లు సమాచారం. ఇందుకుగాను గురువారం రాత్రి ఒంగోలులోని ఒక రెస్టారెంట్‌లో తన మద్దతుదారులతో ఆయన ప్రత్యేక సమావేశం కూడా నిర్వహించారు.

మంత్రి శ్రీ ఎంపీ...: జిల్లాలో మిగిలిన నియోజకవర్గాల పరిస్థితి ఎలా ఉన్నా.. రిజర్వ్‌డ్‌ స్థానాల్లోని పరిణామాలు మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. మంత్రి సురేష్‌ కొండపి నుంచి పోటీ చేస్తే బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌ను అక్కడికి పంపిస్తారనే ప్రచారం సాగుతోంది. అయితే ఎంపీ సురేష్‌ మాత్రం సంతనూతలపాడుపై ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. ఈ నియోజకవర్గం తాను ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్న పార్లమెంట్‌ స్థానం పరిధిలో ఉండటం అందుకు కారణంగా తెలుస్తోంది. ఇదే నియోజకవర్గంపై మంత్రి మేరుగు నాగార్జున ఇప్పటికే సీరియస్‌గా దృష్టిపెట్టారు. ఈ పరిణామాలతో సంతనూతలపాడు సిట్టింగ్‌ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు, కొండపిలో ఆశావహులైన వరికూటి అశోక్‌బాబు, మాదాసి వెంకయ్యల భవితవ్యం ఏంటనేది తేలాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని