logo

ప్చ్‌.. ఏం చేయాలన్నా డబ్బుల్లేవ్‌

జిల్లాలోని ఏకైక బోధనాసుపత్రిలో అన్నీ సమస్యలే. ఆవరణలోనే కుప్పలుగా వ్యర్థాలుంటాయి. వాటి తొలగింపు ఉండదు. వందల సంఖ్యలో వచ్చే రోగులకు తాగునీటి సౌకర్యం కూడా నామమాత్రం. మరుగుదొడ్ల వసతిదీ అదే దారి.

Published : 01 Dec 2023 03:35 IST

జీజీహెచ్‌ నిర్వహణపై ప్రజాప్రతినిధుల అసంతృప్తి

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: జిల్లాలోని ఏకైక బోధనాసుపత్రిలో అన్నీ సమస్యలే. ఆవరణలోనే కుప్పలుగా వ్యర్థాలుంటాయి. వాటి తొలగింపు ఉండదు. వందల సంఖ్యలో వచ్చే రోగులకు తాగునీటి సౌకర్యం కూడా నామమాత్రం. మరుగుదొడ్ల వసతిదీ అదే దారి. ఈ సమస్యలపై అడిగితే నిధులు లేవని.. అరకొర పనులతో సరిపెట్టుకోవాల్సి వస్తోందనే సమాధానాలే ఆసుపత్రి అధికారుల నుంచి ఎదురయ్యాయి. వేసవి చెరువు నుంచి కొత్త పైపులైన్‌ ఏర్పాటు, నూతన ఎక్స్‌రే యంత్రం కొనుగోలు, రోగుల సహాయకులకు మరుగుదొడ్లు నిర్మాణం, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, దాతలిచ్చిన అంబెలెన్స్‌లకు డ్రైవర్ల నియామకం వంటి పనులన్నీ నిధులతో కూడుకున్నవి కావడంతో జాప్యం చోటుచేసుకున్నట్లు వైద్యాధికారులు తెలిపారు.

ఒంగోలు సర్వజన ఆసపత్రి(జీజీహెచ్‌) అభివృద్ధి కమిటీ సమావేశం ఛైర్మన్‌, కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ అధ్యక్షతన గురువారం రాత్రి నిర్వహించారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అజెండాలోని అంశాలకన్నా ఇతర అంశాల పైనే ఎక్కువ సమయం చర్చ సాగింది.

ఆ అంబులెన్స్‌ ఇచ్చేయండి...: జీజీహెచ్‌కు ఎంపీ మాగుంట ఇటీవల అంబులెన్స్‌ను వితరణగా అందజేశారు. డ్రైవర్‌ లేనందున ఆ వాహనాన్ని వినియోగించడం లేదని తెలుసుకున్న ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మీకు అవసరం లేకుంటే వెనక్కి ఇచ్చేయండని కోరారు. దీనికి కలెక్టర్‌ మాట్లాడుతూ.. అవుట్‌సోర్సింగ్‌ పద్ధతిలో డ్రైవర్‌ని నియమించాలని సూచించారు. ఎమ్మెల్యే స్పందించి డ్రైవర్‌ నియామకానికి అయ్యే ఖర్చు తాను భరిస్తానని, వెంటనే వినియోగంలోకి తేవాలన్నారు. సమావేశం అనంతరం సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో రోగుల సహాయకుల కోసం రాత్రి పూట ఏర్పాటు చేసిన భోజన సౌకర్యాన్ని ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్‌ భగవాన్‌ నాయక్‌, మేయర్‌ సుజాత, కమిషనర్‌ ఎం.వెంకటేశ్వరరావు, సభ్యులు న్యామతుల్లాబాషా, డాక్టర్‌ మురళీధరరెడ్డి, ఆర్‌ఎంవో డాక్టర్‌ తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.

  • సమావేశంలో సభ్యుల ప్రశ్న: ఆసుపత్రికి వచ్చే రోగులకు సరిపడా నీరు అందుబాటులో ఉండటం లేదు.
  • సూపరింటెండెంట్‌: సమస్య ఉంది. పైపులైన్‌ మార్చడానికి రూ. 2 కోట్లతో అంచనాలు వేశారు. అంత మొత్తంలో నిధులు లేవు. అందుకే తాత్కాలికంగా రూ. 2 లక్షలతో మరమ్మతులు చేసి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాం.
  • సభ్యులు: ఆసుపత్రి ఆవరణలో ఎక్కడంటే అక్కడ వాహనాలు నిలపడంతో సమస్యలు తలెత్తుతున్నాయి.
  • ఆసుపత్రి అధికారులు: స్టాండ్‌ నిర్వహణకు టెండర్లు పిలుస్తాం.
  • సభ్యులు: ఆసుపత్రిలో ఎక్స్‌రే యంత్రం పనిచేయడం లేదు.
  • ఆసుపత్రి అధికారులు: ఇప్పటికి పలుమార్లు మరమ్మతులు చేసినా ఫలితం లేదు. కొత్తది కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందని ప్రతిపాదనలు పంపాం.
  • సభ్యులు: రోగులతో పాటు వచ్చే సహాయకులకు మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాలి.
  • ఆసుపత్రి అధికారులు: స్థల సమస్య ఉంది. (ప్రత్యామ్నాయంగా కొవిడ్‌ సమయంలో నిర్మించిన గదులను వినియోగించాలని కమిటీ సూచించింది.)
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని