logo

Donakonda: అబ్బో.. దొనకొండపై ప్రేమే!

వైకాపా ప్రభుత్వం కొలువుదీరాక దొనకొండ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామంటూ ప్రకటనలు గుప్పించారు. దీంతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయని స్థానికులు ఎంతో ఆశ పడ్డారు.

Updated : 06 Dec 2023 07:27 IST

ఎన్నికల వేళ మభ్య పెడుతున్న పాలకులు
పారిశ్రామిక పర్యటనలు షురూ

ఎంఎస్‌ఎంఈ పార్కు బోర్డు

న్యూస్‌టుడే, దొనకొండ : వైకాపా ప్రభుత్వం కొలువుదీరాక దొనకొండ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామంటూ ప్రకటనలు గుప్పించారు. దీంతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయని స్థానికులు ఎంతో ఆశ పడ్డారు. భూముల ధరలకు తాత్కాలికంగా రెక్కలొచ్చాయే తప్ప అంతకుమించి అడుగు పడింది లేదు. దొనకొండ మండలంలో 21 గ్రామాల్లోని 25 వేల ఎకరాల భూమిని కారిడార్‌గా 2016లో కేటాయించారు. 40 బృందాలతో ఆరు నెలలపాటు ప్రభుత్వం రూ.60 లక్షలు ఖర్చు పెట్టి దస్త్రాలు తయారు చేయించింది. 2019లో ఏపీఐఐసీ ఆధ్వర్యంలో కారిడార్‌ నిర్మాణానికి అప్పటి మంత్రి శిద్దా రాఘవరావు చేతుల మీదుగా శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. రాగమక్కపల్లెలో 43.79 ఎకరాల్లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు రూ.8 కోట్ల నిధులు మంజూరు చేశారు. ఆ తర్వాత వైకాపా ప్రభుత్వం కొలువు దీరడంతో వీటన్నింటికీ మంగళం పాడింది.

మూడేళ్లు దాటుతున్నా.. కదలిక ఏదీ

2020-2021లో విమానాల తయారీ విభాగాలకు 2600 ఎకరాల భూములు ఉక్రెయిన్‌ దేశానికి, గృహ నిర్మాణాలకు అవసరమైన పరికరాలు తయారు చేసే ఫ్రైడ్‌ కంపెనీకి 5వేల ఎకరాలు, దొనకొండలోని విమానాశ్రయం భూముల్లో ఎయిర్‌ఫోర్స్‌ వారు శిక్షణ కేంద్రం మరికొన్ని కంపెనీలకు భూములను కేటాయించారు. రుద్రసముద్రం, రామక్కపల్లి, భూమనపల్లి గ్రామాల్లో రెండు వేల ఎకరాల్లో సోలార్‌ ప్లాంటు ఏర్పాటు చేస్తామని అధికారులు, ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ గ్రామసభ నిర్వహించి చెప్పారు. భూములిస్తే ఎకరాకు ఏడాదికి రూ.25వేలు కౌలు ఇస్తామని, ముందుగా స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. మూడేళ్లు దాటుతున్నా దీనికి అతీగతీ లేదు.

నీటి వసతి సైతం లేక..

దొనకొండ పరిధిలోని భూముల్లో నీటి వసతి కనిపించకపోవటంతో వచ్చినవారు వెనక్కి వెళ్తున్నారు. మండలంలో సాగర్‌ కాలువ వెళ్తున్నా గ్రామాలకే నీరు లేదని, చెరువులు నిర్మించి నీరు నిల్వ ఉండేలా పనులు చేసి ఉంటే కంపెనీలు వచ్చేవని చెబుతున్నారు. ఈ భూములు పరిశీలించడానికి గత నెల 27న పరిశ్రమల కార్యదర్శి యువరాజ్‌, కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌, 28న ఏపీఐఐసీ ఎండీ ప్రవీణ్‌ కుమార్‌, భారత్‌ పెట్రోలియం లిమిటెడ్‌ కంపెనీ బృందం పరిశీలించింది. కంపెనీలు వస్తాయంటూ మళ్లీ చెప్పించే చెబుతుండటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా ఎన్నికల ముందు పాలకుల హంగామా అని చర్చించుకుంటున్నారు.

ఎన్నికలకు గడువు సమీపిస్తున్న వేళ.. పాలకులు కొత్త నాటకాలకు తెర లేపారు. నాలుగున్నరేళ్లుగా దొనకొండ ముఖం చూడని నేతలు, అధికారులు పారిశ్రామిక అభివృద్ధి అంటూ మళ్లీ హడావుడి చేస్తున్నారు. వరుస పర్యటనలు చేస్తూ మభ్య పెట్టే కార్యక్రమాలు చేపడుతుండటం విమర్శలకు తావిస్తోంది.

కారిడార్‌కు కేటాయించిన భూములివే!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు