logo

IIIT Ongole: ‘ఆకలవుతోంది నాన్నా.. అన్నం పంపమని చెప్పవా!’

ఒంగోలు నగరంలోని ట్రిపుల్‌ ఐటీలో చదివే విద్యార్థిని ఒకరు ఇటీవల తన తండ్రికి ఫోన్‌ చేశారు. ‘వండిన అన్నం అయిపోయింది. మావంతు వరకు కూడా రాలేదు. తినడానికి ఏమీ లేదు. బాగా ఆకలిగా ఉంది. ఒంగోలులో తెలిసిన వారు ఎవరైనా ఉంటే నాతో పాటు మరో ఇద్దరు స్నేహితులకు అన్నం

Updated : 06 Dec 2023 08:13 IST

తల్లిదండ్రులకు విద్యార్థుల ఫోన్లు
ప్రాంగణంలో మోటార్ల మొరాయింపు
ట్రిపుల్‌ఐటీలో నీళ్లు లేవు.. ఆకలి

ఒంగోలు నగరంలోని ట్రిపుల్‌ ఐటీ ప్రాంగణం

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: ఒంగోలు నగరంలోని ట్రిపుల్‌ ఐటీలో(IIIT Ongole) చదివే విద్యార్థిని ఒకరు ఇటీవల తన తండ్రికి ఫోన్‌ చేశారు. ‘వండిన అన్నం అయిపోయింది. మావంతు వరకు కూడా రాలేదు. తినడానికి ఏమీ లేదు. బాగా ఆకలిగా ఉంది. ఒంగోలులో తెలిసిన వారు ఎవరైనా ఉంటే నాతో పాటు మరో ఇద్దరు స్నేహితులకు అన్నం, నీళ్ల సీసాలు పంపించే ఏర్పాటు చేయగలవా నాన్నా’ అని కోరింది. ట్రిపుల్‌ఐటీలో దుర్భర పరిస్థితికి ఈ ఉదంతం ఓ నిదర్శనం. భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో సుదూర ప్రాంతాల నుంచి చదువుకునేందుకు వచ్చిన వేల మంది విద్యార్థులకు ఇక్కడ నిత్యం వెతలు తప్పడం లేదు. కనీస సౌకర్యాలు కరవయ్యాయి. ట్రిపుల్‌ఐటీ సీటు లభిస్తే బంగారు భవిష్యత్తు ఉంటుందని ఆశించి వస్తే యాతనకు గురవుతున్నారు. ఇక్కడ వసతులేమీ లేకపోవడాన్ని చూసి బెంబేలెత్తుతున్నారు. తినడానికి సరిగా తిండి లేక పస్తులుంటున్నారు. వాడుకకూ నీరు లేక మానసిక వేదన అనుభవిస్తున్నారు.

👉 Follow EENADU WhatsApp Channel

అన్నీ అరకొర వసతులే...: 2019 ముందు వరకు ఒంగోలు ట్రిపుల్‌ఐటీ కడప జిల్లా ఇడుపలపాయలో కొనసాగింది. అక్కడ పిల్లల సంఖ్య పెరగడంతో ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ఒంగోలులోనే తరగతులు నిర్వహించాలని నిర్ణయించారు. ఆ మేరకు మూతపడిన రావ్‌ అండ్‌ నాయుడు కళాశాల భవనాన్ని ముందుగా అద్దెకు తీసుకొని తరగతులు ప్రారంభించారు. ఏటా కొత్త బ్యాచ్‌లు రావడంతో అది సరిపోక మరుసటి ఏడాది కర్నూలు రోడ్డులోని ఎస్‌ఎస్‌ఎన్‌ ఇంజినీరింగ్‌ కళాశాలను అద్దెకు తీసుకున్నారు. రావ్‌ అండ్‌ నాయుడు కళాశాలలో 1,400 మంది, ఎస్‌ఎస్‌ఎన్‌లో 3,000 మంది విద్యార్థులుంటున్నారు. ఇంజినీరింగ్‌ కళాశాలకు అనువుగా నిర్మించిన భవనాలు కావడంతో వసతికి అనువైన సౌకర్యాలు ఆయా చోట్ల లేవు. తగినన్ని మరుగుదొడ్లు.. దుస్తులు శుభ్రం చేసుకునేందుకు, ఆరబెట్టుకోడానికి తగిన జాగా లేదు. కిటికీలకు మెష్‌లూ కనిపించవు. దీంతో దోమల బెడదతో విద్యార్థులు అల్లాడుతున్నారు. వీటన్నింటికంటే నీరు, భోజనం సమస్య వారిని నిత్యం వేదనకు గురిచేస్తోంది.

రెండు మోటార్లూ మూలకు.. : రెండు ట్రిపుల్‌ ఐటీ ప్రాంగణాల్లో మూడు చొప్పున మోటార్లుండగా.. రెండు చోట్ల ఒకే సమయంలో మొరాయించాయి. స్టాండ్‌బై మోటారు బిగించే ప్రయత్నంలో అది కూడా గొయ్యిలో కూరుకుపోయింది. వర్షం వల్ల బయటికి తీయడం సమస్యగా మారింది. దీంతో గత అయిదు రోజులుగా కొన్ని బ్లాక్‌లోని బాలబాలికల అవస్థలు వర్ణణాతీతం. ఇదిలా ఉంటే మెస్‌లో భోజనం సరిపోకుండా చేస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు తమ తల్లిదండ్రులకు ఫోన్లు చేసి సమస్య చెబుతున్నారు. అన్నం, కూరలు ప్రతిరోజూ కొరవపడుతున్నాయని, కొంతమందికి అందటం లేదని కన్నీటి పర్యంతమవుతున్నారు.


సమస్యల పరిష్కారానికి చర్యలు

మోటార్లు పనిచేయడం లేదు. దీంతో తాత్కాలికంగా నీటి సమస్య తలెత్తింది. యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయిస్తాం. వర్షం వల్ల పనుల్లో కొంత జాప్యం చోటుచేసుకుంది. నేను బాధ్యతలు స్వీకరించి రెండు వారాలే అయ్యింది.  భోజన సమస్యను ఎవరూ నా దృష్టికి తేలేదు. తక్షణం పరిశీలించి ఎలాంటి ఇబ్బంది లేకుండా అవసరమైన చర్యలు తీసుకుంటాను.

భాస్కర్‌ పటేల్‌, ఒంగోలు ట్రిపుల్‌ఐటీ డైరెక్టర్‌


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని