logo

ISRO: మిత్రో.. చూసొద్దామా ఇస్రో.. విద్యార్థులకు అరుదైన అవకాశం

చంద్రయాన్‌3 విజయవంతంతో భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో) ఖ్యాతి విశ్వవ్యాప్తమైంది.

Updated : 08 Dec 2023 09:33 IST


శ్రీహరికోటలోని షార్‌ కేంద్రం

పామూరు, న్యూస్‌టుడే: చంద్రయాన్‌3 విజయవంతంతో భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో) ఖ్యాతి విశ్వవ్యాప్తమైంది. త్వరలో మరిన్ని ప్రయోగాలకు శ్రీకారం చుడుతూ అగ్రరాజ్యాలతో పోటీపడుతోంది. ఇస్రోను వీక్షించాలది విజ్ఞానదారుల్లో నడిచే విద్యార్థుల బలమైన కోరిక. దీనికి మార్గమేంటి? ఎవర్ని సంప్రదించాలి.. ఏం చేయాలి... చిట్టి బుర్రల్లో బోలెడు ప్రశ్నలు. ఇక జిల్లాకు కూతవేటు దూరంలో నే శ్రీహరికోట ఉండడంతో ఇక్కడివారికి మరింత ఆసక్తి.  అలాంటి భావి పౌరుల కోసం ఈ వివరాలు..

దరఖాస్తు చేసుకోవాల్సిన వెబ్‌సైట్‌ ఇదే..

ఇస్రో చూడాలనుకునే వారు ముందుగా సంస్థకు చెందిన మెయిల్‌లో వివరాలు పొందుపర్చాల్సి ఉంటుంది. లేకుంటే ఎస్‌డీఎస్‌సీ-షార్‌ గ్రూప్‌ డైరెక్టర్ల మెయిల్స్‌కు సమాచారం అందించాల్సి ఉంటుంది. ఏదైనా స్కూల్‌, సంస్థకు సంబంధించి నేరుగా మెయిల్‌లో వివరాలు తెలియజేస్తే ప్రయోగాలు లేని సమయంలో అనుకూలతను బట్టి పంపించేందుకు అవకాశం ఉంటుంది. ఇందుకు సంబంధించి ముందుగా మెయిల్‌లోనే అనుమతులు ఇచ్చి, ఆహ్వానాన్ని తెలియజేస్తారు.

వెళ్లేది ఇలా..

అనుమతించిన రోజుల్లో ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఇస్రోను వీక్షించేందుకు అవకాశం కల్పిస్తారు. కార్యాలయం వద్ద ఉదయం అనుమతి పత్రాలు చూపిస్తే ప్రత్యేక పాస్‌లు మంజూరు చేస్తారు. మధ్యాహ్నం భోజనం ఇతర వాటికి ముందుగా నగదు చెల్లిస్తే ఏర్పాట్లు చేస్తారు. విద్యార్థులు బృందంగానే వెళ్లాలి. బస్సుల్లో వస్తే వీక్షించేందుకు వీలుగా ఉంటుంది. కార్లు, ద్విచక్ర వాహనాలకు అనుమతి ఉండదు. బస్సుల్లో బృందంగా వచ్చే విద్యార్థుల కోసం ఇస్రో సంస్థ ఓ గైడ్‌ను సైతం ఏర్పాటు చేస్తుంది.

 ఏం చూడొచ్చు..

ప్రధానంగా ఇస్రో విజయాలను తెలియజేసే మ్యూజియం ఆకట్టుకుంటుంది. ఇప్పటి వరకు సాధించిన ఘనత, చేసిన ప్రయోగాలు, వాటి ఫలితాలను విశ్లేషిస్తారు. తద్వారా భవిష్యత్తులో మానవ మనుగడకు కలిగే ప్రయోజనాలను వివరిస్తారు. ఇస్రోలో ప్రధానంగా మిషన్‌ కంట్రోల్‌ రూమ్‌ ఉంటుంది. రాకెట్‌ దిశను నియంత్రించే విధానం, ప్రయోగం, ఇతర అన్ని కార్యకలాపాలు ఇక్కడి నుంచే జరిగిపోతాయి. రాకెట్‌ను ప్రయోగించే రెండు లాంచింగ్‌ ప్యాడ్‌లను వీక్షించేందుకు పిల్లలకు అవకాశం కల్పిస్తారు.

నేరుగా వీక్షించేందుకు..

ఇస్రో ఏదైనా రాకెట్‌ను ప్రయోగిన్తే నేరుగా శ్రీహరికోట నుంచి వీక్షించేందుకు అవకాశం ఉంది. ప్రయోగానికి వారం ముందు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు కోరుతుంది. అలా దరఖాస్తు చేసిన వారిలో కొందరిని ఎంపిక చేసి ప్రత్యేక పాస్‌లు అందిస్తారు. ప్రయోగ సమయంలో అక్కడకు చేరుకోవడం ద్వారా దగ్గర నుంచి వీక్షించేందుకు అవకాశం ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని