logo

CM Jagan : నమస్కారం.. ప్రతిగా అవమానం : సీనియర్‌ ఎంపీని పట్టించుకోని జగన్‌

పార్లమెంట్‌ సాక్షిగా ఒంగోలు సీనియర్‌ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఘోర అవమానం చోటుచేసుకుంది. జూనియర్‌లకు ఇచ్చిన గౌరవం కూడా ఆయనకు దక్కకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసేందుకు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డితో కలిసి వెళ్తున్న బృందంలోనూ స్థానం లభించకుంది.

Updated : 10 Feb 2024 09:05 IST

జగన్‌ తీరుకు ఖిన్నుడైన మాగుంట

బృందంతో పార్లమెంట్‌ భవనంలోకి వెళ్తుండగా ముఖ్యమంత్రి జగన్‌కు ఎదురుగా వచ్చి నమస్కరిస్తున్న శ్రీనివాసులురెడ్డి

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: పార్లమెంట్‌ సాక్షిగా ఒంగోలు సీనియర్‌ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఘోర అవమానం చోటుచేసుకుంది. జూనియర్‌లకు ఇచ్చిన గౌరవం కూడా ఆయనకు దక్కకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసేందుకు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డితో కలిసి వెళ్తున్న బృందంలోనూ స్థానం లభించకుంది. ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి నమస్కారం చేసినప్పటికీ నిర్లక్ష్యమే ఎదురైంది. ఈ అనూహ్య పరిణామానికి ఖిన్నుడైన మాగుంట.. చివరికి ఏకాకిగా మిగిలి.. అవమానకర స్థితిలో వెనుదిరగాల్సి వచ్చింది. జిల్లా రాజకీయాల్లో మూడున్నర దశాబ్దాలుగా ఒక వెలుగు వెలిగిన మాగుంట కుటుంబానికి దేశ రాజధాని దిల్లీలో సీఎం సాక్షిగా ఎదురైన పరాభవం ఇది.

మెట్ల వద్ద ఏకాకిగా మిగిలి: రాష్ట్రానికి సంబంధించిన కీలకాంశాలు, రాజకీయ పరిస్థితులపై ప్రధానమంత్రి మోదీకి విన్నవించేందుకు ముఖ్యమంత్రి జగన్‌ శుక్రవారం దేశ రాజధాని దిల్లీ వెళ్లారు. ప్రస్తుతం పార్లమెంట్‌ సమావేశాలు సాగుతున్న నేపథ్యంలో మోదీని కలిసేందుకు పార్లమెంట్‌ హౌస్‌కు చేరుకున్నారు. ఈ సమయంలో ఒంగోలు ఎంపీ మాగుంట పార్లమెంట్‌ హౌస్‌ ఎదుట జగన్‌కు నమస్కారం చేస్తూ ఎదురొచ్చారు. ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డిలతో పాటు సీనియర్‌ అధికారులతో మాట్లాడుతూ వెళ్తున్న సీఎంకు అత్యంత చేరువగా వచ్చి పలకరించేందుకు మాగుంట ప్రయత్నించారు. అయినప్పటికీ జగన్‌ ఆయన్ను ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకు సాగిపోయారు. మిగిలినవారు కూడా ఆయన్ను తమ బృందంలో కలుపుకొనేందుకు చొరవ చూపలేదు. దీంతో క్షణాల వ్యవధిలోనే మాగుంట చివరి వరుసలోకి రావాల్సి వచ్చింది. మర్యాదపూర్వకంగా కలవడానికి వచ్చిన తనతో వ్యవహహరించిన ఈ తీరుకు మాగుంట ఖిన్నుడయ్యారు. సీఎం బృందంతో కలిసి పార్లమెంట్‌లోకి వెళ్లకుండా దిక్కులు చూస్తూ మెట్ల కిందే నిల్చుండిపోయారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లారు. సామాజిక మాధ్యమాల్లో ఈ దృశ్యాలు ప్రసారమయ్యాయి.

జిల్లా రాజకీయాల్లో చర్చ: సీఎం జగన్‌ దిల్లీ పర్యటనలో మాగుంటతో పోలిస్తే జూనియర్లు అయిన ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, నందిగం సురేష్‌, గోరంట్ల మాధవ్‌లకే ప్రాధాన్యం దక్కింది. జగన్‌తో కలిసి వారంతా పార్లమెంట్‌ హౌస్‌లో ప్రధాని కార్యాలయం వరకు వెళ్లారు. మాగుంట మాత్రం మెట్ల వద్దనే నిలిచిపోవాల్సి వచ్చింది. జగన్‌ వ్యవహరించిన తీరు ఇప్పుడు జిల్లా రాజకీయవర్గాల్లో చర్చకు దారి తీసింది. మాగుంట కుటుంబానికి ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మరోసారి అవకాశం ఇచ్చేందుకు జగన్‌ సిద్ధంగా లేరు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చినా ఫలితం లేకపోయింది. చివరికి దిల్లీ పర్యటనకు వచ్చిన సీఎంను మర్యాదపూర్వకంగా పలకరించడానికి ప్రయత్నించినా పట్టించుకోకుండా ముందుకు సాగిపోవడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని