logo

దద్దాలకే వైకాపా మొగ్గు.. త్వరలోనే నా భవిష్యత్తు

కనిగిరి వైకాపాలో అసంతృప్తి స్వరాలు పెరుగుతున్నాయి. అధిష్ఠానం ఏకపక్ష నిర్ణయాలకు నిరసనగా పలువురు తమ నిరసనను బాహాటంగానే వెల్లడిస్తున్నారు. కనిగిరి సిటింగ్‌ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ను కాదని.

Published : 24 Feb 2024 04:06 IST

ఆత్మీయులతో మాజీ ఎమ్మెల్యే బాబూరావు

సమావేశంలో మాట్లాడుతున్న కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు

సి.ఎస్‌.పురం, న్యూస్‌టుడే: కనిగిరి వైకాపాలో అసంతృప్తి స్వరాలు పెరుగుతున్నాయి. అధిష్ఠానం ఏకపక్ష నిర్ణయాలకు నిరసనగా పలువురు తమ నిరసనను బాహాటంగానే వెల్లడిస్తున్నారు. కనిగిరి సిటింగ్‌ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ను కాదని.. హనుమంతునిపాడు జడ్పీటీసీ సభ్యుడు దద్దాల నారాయణ యాదవ్‌ను నియోజకవర్గ సమన్వయకర్తగా ఆ పార్టీ అధిష్ఠానం ఇప్పటికే ప్రకటించింది. అప్పటి నుంచి ఎమ్మెల్యే మధుసూదన్‌ యాదవ్‌ నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. తాడేపల్లి ప్యాలెస్‌ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంతకాలం టికెట్‌ ఆశిస్తూ వచ్చిన మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు సీఎస్‌పురం మండలం శీలంవారిపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం అనుచరులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కనిగిరి అభ్యర్థి దద్దాల నారాయణే అని వైకాపా పెద్దలు చెబుతున్నారని, అతన్ని మార్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయన్నారు. ప్రస్తుతం రాజకీయ పార్టీలు కులాలను చూసి సీట్లు కేటాయిస్తున్నాయని వ్యాఖ్యానించారు. వైకాపా అధిష్ఠానం తనకు సీటు కేటాయిస్తానని గతంలో హామీ ఇచ్చిందని.. అందుకే తాను గత నాలుగేళ్లుగా పార్టీకి సేవలు చేశానని తెలిపారు. త్వరలో తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించనున్నట్లు చెప్పారు. ఇదిలా ఉండగా సమావేశానికి హాజరైన వారిలో అత్యధిక మంది స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలని కదిరిని కోరడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని