logo

దర్జాగా దోపిడీ

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మట్టి, ఇసుక, గ్రావెల్‌, కలప తదితర అక్రమ రవాణాకు అడ్డుకట్టలేకుండా పోయింది. ఎక్కడ చూసినా కొందరు అధికారపార్టీ నేతలు వాగులు, కొండలు, చెరువులు, చెట్లు ఇలా దేన్నీ వదలకుండా ఇష్టానుసారంగా దోచుకుంటున్నారు.

Updated : 24 Feb 2024 05:48 IST

తరలిపోతున్న గ్రావెల్‌, కలప
వైకాపా నేతల కనుసన్నల్లో దందా

జరుగుమల్లి మండలం కె.బిట్రగుంట వద్ద పాలేరు వాగులో రాత్రి వేళ ఇసుక తరలింపు

న్యూస్‌టుడే, టంగుటూరు, కొండపి గ్రామీణం, సింగరాయకొండ గ్రామీణం: వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మట్టి, ఇసుక, గ్రావెల్‌, కలప తదితర అక్రమ రవాణాకు అడ్డుకట్టలేకుండా పోయింది. ఎక్కడ చూసినా కొందరు అధికారపార్టీ నేతలు వాగులు, కొండలు, చెరువులు, చెట్లు ఇలా దేన్నీ వదలకుండా ఇష్టానుసారంగా దోచుకుంటున్నారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా దర్జాగా రవాణా చేస్తూ లక్షల రూపాయలతో జేబుల్లో నింపుకొంటున్నారు. ఇంత పెద్ద ఎత్తున దందా సాగుతున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం గమన్హారం.

కొణిజేడు కొండలను కొల్లగొట్టి..: టంగుటూరు మండలంలోని కొణిజేడు, మర్లపాడు, కందులూరు, సర్వేరెడ్డిపాలెం గ్రామాల్లో విస్తరించిన కొండను అక్రమార్కులు తొలచి భారీ వాహనాలతో ఒంగోలులోని లేఅవుట్లకు తరలిస్తున్నారు. వేల టన్నుల ఇక్కడి గ్రావెల్‌ తరలిపోవడంతో కొండ చుట్టూ భారీ గుంతలు పడ్డాయి. జరుగుమల్లి మండలంలోని పాలేరు వాగులో అక్రమ ఇసుక తవ్వకాలు నిత్యకృత్యమయ్యాయి. దీంతో ఆ వాగు రూపురేఖలు కోల్పోయింది. చతుకుపాడు సమీపంలో ఓ వైకాపా నేత ఏకంగా వాగు మధ్యలో 4 కి.మీ మేర రోడ్డును నిర్మించి భారీ టిప్పర్లతో ఇసుకను తరలించేవాడు. ఓ నాయకుడి పీఏనంటూ తాజాగా ఓ అక్రమార్కుడు కె.బిట్రగుంట సమీపంలో పాలేరు వాగును ఆక్రమించి ఇసుకను ఇష్టానుసారంగా తవ్వేశాడు.

నామరూపాలు కోల్పోయిన వల్లూరు చెరువు

అడ్డుకున్న గ్రామస్థులపై కేసులు...: అక్రమార్కులు కొండపి చెరువులో మట్టిని తవ్వేసి ఇటుక బట్టీలు, ఇళ్ల స్థలాలకు తరలిస్తున్నారు. పొన్నలూరు పెద్ద చెరువులో తుమ్మ చెట్లను నెలల తరబడి అనధికారికంగా నరికి ఓ ప్రజాప్రతినిధి లక్షల నగదును సొమ్ము చేసుకున్నాడు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన శూన్యం. సింగరాయకొండ మండలంలో కనుమళ్ల పంట చెరువులో మట్టిని అనధికార లేవుట్లకు తరలిస్తూ లక్షల్లో దోచుకుంటున్నారు. స్థానిక వైకాపా నాయకులు నీటిపారుదల శాఖ అధికారులకు ముడుపులిచ్చి ఈ దందా నడిపిస్తున్నారని   గ్రామస్థులు వాపోతున్నారు. మన్నేరు నది నుంచి ఇసుక తరలిస్తున్న వాహనాలను  గ్రామస్థులు అడ్డుకుంటున్నా అధికారం అండతో వారిని బెదిరింపులకు గురిచేసి అక్రమ కేసులు బనాయిస్తున్నట్లు సమాచారం. ఇంత జరుగుతున్నా గనులు, రెవెన్యూ, పోలీసు అధికారులు చర్యలు చేపట్టకపోవడానికి రాజకీయ ఒత్తిడులే కారణమని స్థానికులు విమర్శిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని