logo

జనాన్ని విస్మరించి.. జగన్‌ సేవలో తరించి..

 ప్రయాణికులను విస్మరించి..పాలకుల సేవలో తరిస్తూ ఆర్టీసీ ప్ర‘గతి తప్పుతోంది. ఫలితంగా బస్సులు లేక వేలాదిమంది మండుటెండల్లో మగ్గిపోయారు.

Published : 24 Feb 2024 04:13 IST

ప్ర‘గతి’ తప్పిన ఆర్టీసీ
బస్సుల్లేక అవస్థలు

ఒంగోలులో జనాన్ని తరలించేందుకు బారులు తీరిన బస్సులు

ఒంగోలు అర్బన్‌, ఒంగోలు నగరం: ప్రయాణికులను విస్మరించి..పాలకుల సేవలో తరిస్తూ ఆర్టీసీ ప్ర‘గతి తప్పుతోంది. ఫలితంగా బస్సులు లేక వేలాదిమంది మండుటెండల్లో మగ్గిపోయారు. శుక్రవారం వందలాది బస్సులను ముఖ్యమంత్రి సభలకు కేటాయించడంతో ఒంగోలు, కనిగిరి, కొండపి, కంభం, పొదిలి తదితర డిపోల్లో వృద్ధులు, చిన్నారులు విలవిల్లాడారు. జిల్లా రీజియన్‌ పరిధిలో 151 బస్సులను దీనికి కేటాయించారు. వీటిలో ఒంగోలు డిపో నుంచి 45, పొదిలి నుంచి 25, కనిగిరి 20, మార్కాపురం 36, గిద్దలూరు నుంచి 25 బస్సులను జగన్‌ సభకు మళ్లించారు.

ఒంగోలు డిపోలో బస్సులు లేక మధ్యాహ్నం వేళ ఎదురుచూపులు

కనిగిరి ప్రాంతంలో గంటల తరబడి బస్సుల కోసం వేచి చూసి విసుగు చెందారు. డిపోలో బస్సులు లేక ఆటోలు, ప్రైవేటు వాహన చోదకులకు అదనంగా చెల్లించి గమ్య స్థానాలకు చేరుకున్నారు.

అద్దంకి నుంచి కశ్యాపురం అలవలపాడు, తక్కెళ్లపాడు, చందలూరు, కొణికి మీదుగా ఇంకొల్లుకు ప్రతిరోజూ రెండు బస్సులు అయిదు ట్రిప్పులు తిరుగుతాయి. చివరి ట్రిప్పు రాత్రి 8.30కు అద్దంకి నుంచి ఇంకొల్లు వెళుతుంది. ఆ డిపో నుంచి 20 బస్సులు గురువారం రాత్రికే ఒంగోలుకు రప్పించారు. దీంతో చివరి ట్రిప్పు రద్దయి రాత్రివేళ స్వగ్రామాలకు చేరుకోలేక నానా అవస్థలు పడ్డారు. శుక్రవారం ఆ మార్గంలో పూర్తిగా సర్వీసులు నిలిచిపోయాయి. కొందరు బస్సులు లేక పనులు వాయిదా వేసుకున్నారు.

ఎండ వేడికి విలవిల్లాడుతున్న చిన్నారికి మంచినీళ్లు తాగిస్తున్న కుటుంబీకులు


నరకం తప్పడం లేదు
-సుబ్బయ్య,  చిరు వ్యాపారి, తక్కెళ్లపాడు, జె.పంగులూరు మండలం

ఈ వారంలో ఒక్కరోజు మాత్రమే అద్దంకి - ఇంకొల్లు మార్గంలో బస్సు నడిచింది. మొన్న రాప్తాడు సభ కోసం, శుక్రవారం ఒంగోలు సభ కోసం బస్సుల్ని పెద్దఎత్తున పంపేశారు. డ్రైవర్లు అక్కడి విధులకు హాజరై విశ్రాంతి తీసుకుని వస్తుండటంతో బస్సులు అందుబాటులో ఉండటం లేదు. బస్సులు మా కోసం నడుపుతున్నారనిపించడం లేదు. నిత్యం నరకం తప్పడం లేదు.

నిర్మానుష్యంగా కనిగిరి ఆర్టీసీ డిపో

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని