logo

మోగని చప్పట్లు.. తప్పని అగచాట్లు

ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి తన ప్రసంగంలో తెదేపా అధినేత చంద్రబాబునుద్దేశించి వ్యంగ్యంగా మాట్లాడుతున్న సమయంలో పురపాలక శాఖ ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి ఆద్యంతం నవ్వుతూ కనిపించారు.

Published : 24 Feb 2024 04:16 IST

సభా ప్రాంగణంలో నిలిపి ఉంచిన మంచినీళ్ల ట్యాంకర్‌, ఓ ప్రైవేట్‌ బస్సు నీడన కూర్చుని భోజనాలు

  • ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి తన ప్రసంగంలో తెదేపా అధినేత చంద్రబాబునుద్దేశించి వ్యంగ్యంగా మాట్లాడుతున్న సమయంలో పురపాలక శాఖ ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి ఆద్యంతం నవ్వుతూ కనిపించారు. అదే సమయంలో జనం నుంచి మాత్రం పెద్దగా స్పందన లేదు.
  • సభలో కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి మాత్రమే ప్రసంగించారు. జగన్‌ మాట్లాడినంతసేపు బాలినేని, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆయన వెనుక నిల్చుని ఉన్నారు.
  • ఒంగోలు నగరానికి చెందిన ఇంటి పట్టాల లబ్ధిదారులు లలిత మౌనిక, శివపార్వతిలతో ముఖాముఖి మాట్లాడించారు. ప్రతి మాటకు జగనన్న అంటూ పొగడ్తలు కురిపించారు.
  • ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఎక్కువ మంది మహిళలు బస్సుల్లోనే ఉండిపోయారు. ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత కూడా సభా ప్రాంగణం దగ్గరకు బస్సులు రావడంతో వాటిలోనే కూర్చున్నారు.

ముఖ్యమంత్రి ప్రసంగిస్తుండగానే సభ నుంచి గుంపుగా బయటకి వెళ్లిపోతున్న మహిళలు

  • సభకు వచ్చిన స్వయం సహాయక సంఘాల మహిళలకు బస్సుల్లోనే భోజనం పార్శిళ్లు అందించారు. పులిహోర, పెరుగన్నం వాసన వస్తుండటంతో పలువురు తినకుండా వదిలేశారు.
  • ఇంటి పట్టాల లబ్ధిదారులతో పాటు, ఒంగోలు, సంతనూతలపాడు, కొండపి నియోజకవర్గాల నుంచి ఎక్కువ మంది మహిళలను బస్సుల్లో తరలించుకు వచ్చారు. తాత్కాలిక మరుగుదొడ్లు ఎక్కడ ఏర్పాటు చేసిందీ తెలియక చాలామంది మూత్ర విసర్జనకు వెళ్లేందుకు ఇబ్బంది పడ్డారు.
  • ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం.. నీడ సౌకర్యం లేకపోవడంతో మహిళా పోలీసు సిబ్బంది టెంట్‌ కింద పరిమితమయ్యారు. సభకు వచ్చిన మహిళలు నీళ్ల ట్యాంకర్ల కింద, ఐస్‌క్రీం బండ్ల వద్ద, స్వాగత ద్వారాలకు ఏర్పాటు చేసిన కర్రల నీడన సేదతీరుతూ కనిపించారు.‌
  • ఎండకు తాళలేక పలువురు సీఎం ప్రసంగిస్తుండగానే తిరుగుముఖం పట్టారు. బస్సుల్లో కూర్చుని సభ ఎప్పుడు ముగుస్తుందా అంటూ పడిగాపులు పడ్డారు.

న్యూస్‌టుడే, ఒంగోలు గ్రామీణం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని