logo

బెదిరించినా బస్సులెక్కలేదు

ముఖ్యమంత్రి జగన్‌ సభ అంటే సామాన్య ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. మొన్న రాప్తాడు, ఇప్పుడు ఒంగోలులో ఇదే పరిస్థితి. నగరంలో పేదలకు పట్టాల పంపిణీ కార్యక్రమంలో శుక్రవారం ముఖ్యమంత్రి పాల్గొన్నారు.

Published : 24 Feb 2024 04:19 IST

రహదారులపై ఖాళీగానే వాహనాలు

లెక్క కోసం తీసుకురావడంతో బస్సుల్లోనే ఉండిపోయిన వృద్ధులు

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి జగన్‌ సభ అంటే సామాన్య ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. మొన్న రాప్తాడు, ఇప్పుడు ఒంగోలులో ఇదే పరిస్థితి. నగరంలో పేదలకు పట్టాల పంపిణీ కార్యక్రమంలో శుక్రవారం ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సభకు లబ్ధిదారులు, ఇతర జనాన్ని తరలించడం కోసం ప్రకాశం జిల్లా రీజియన్‌తో పాటు పక్క జిల్లాలైన నెల్లూరు, బాపట్ల, పల్నాడు, గుంటూరు జిల్లాల రీజియన్ల నుంచి కూడా బస్సులను కేటాయించారు. ప్రకాశం నుంచి 151, నెల్లూరు నుంచి 110, బాపట్ల నుంచి 54, పల్నాడు నుంచి 88, గుంటూరు నుంచి 97 బస్సులు ఇందులో ఉన్నాయి. జిల్లాకు సంబంధించి ఒంగోలు డిపో నుంచి 45, పొదిలి నుంచి 25, కనిగిరి నుంచి 20, మార్కాపురం నుంచి 36, గిద్దలూరు నంచి 25 బస్సులను కేటాయించారు. సభకు ముందురోజే ఆయా రూట్లలో నిలిపేసి ఒంగోలుకు రప్పించారు. మహిళా లబ్ధిదారులు, పొదుపు సంఘాల మహిళలను తీసుకొచ్చే బాధ్యత మెప్మా రిసోర్స్‌ పర్సన్లు, యానిమేటర్లు, వాలంటీర్లకు అప్పగించారు. నగరంలో 50 డివిజన్లుండగా.. ఒక్కో డివిజన్‌కు ఏడు నుంచి 15 వరకు బస్సులు ఏర్పాటు చేశారు. అంతమంది రాకపోవడంతో కొన్ని బస్సులు రహదార్లపై సాయంత్రం వరకు ఖాళీగా నిలిపి ఉంచాల్సి వచ్చింది. దీనివల్ల రెండు రోజులుగా గ్రామీణ ప్రాంతాలకు బస్సుల్లేక ప్రయాణికులు ఇక్కట్లు ఎదుర్కొన్నారు.

జనం లేక మంగమూరు రోడ్డులో ఖాళీగా నిలిపి ఉంచిన బస్సులు

పథకాలు రావంటూ హెచ్చరికలు...: నగరంతో పాటు, నియోజకవర్గంలోని ఒంగోలు, కొత్తపట్నం మండలాలతో పాటు, పొరుగు నియోజకవర్గాలైన సంతనూతలపాడు, కొండపి నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల నుంచి డీఆర్డీఏ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల మహిళలను సభకు తరలించేందుకు ఏపీఎం, సీసీలు, గ్రామ సమాఖ్య ప్రతినిధులు, యానిమేటర్లు ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. ‘శుక్రవారం ఉదయం 6 గంటలకల్లా బస్సు మీ గ్రామానికి వస్తుంది. అందులో ఎక్కాల్సిందే. లేకుంటే వైఎస్సార్‌ ఆసరాతో పాటు, వచ్చే నెలలో ఇవ్వనున్న చేయూత, ఇతర సంక్షేమ పథకాలు రావు’ అని హెచ్చరించారు. మండలాల వారీగా సభలకు మహిళలను తీసుకొచ్చేలా లక్ష్యాలిచ్చారు. అయినప్పటికీ పూర్తిస్థాయిలో జనాన్ని సమీకరించలేపోయారు. బస్సులు ఎక్కే వారు లేక పలుచోట్ల ఖాళీగా దర్శనమిచ్చాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు