logo

ఆధార్‌ సంఖ్య.. రోగమున్నట్టు లెక్క

‘నాకు ఆరోగ్యం బాగానే ఉంది పరీక్షలు అవసరం లేదంటే కుదరదు. వైద్య సిబ్బంది లెక్కల కోసమైనా వచ్చి తీరాలి. లేకుంటే ఆధార్‌ సంఖ్య అయినా చెప్పాలి. ఇదీ క్షేత్రస్థాయిలో ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహణ తీరు.

Updated : 24 Feb 2024 05:48 IST

లక్ష్యాల కోసం బోగస్‌ పేర్ల నమోదు
మిథ్యగా ఆరోగ్య సురక్ష శిబిరాలు
24 పీహెచ్‌సీల డాక్టర్లకు తాఖీదులు

సింగరాయకొండలో ఆరోగ్య సురక్ష శిబిరం

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: ‘నాకు ఆరోగ్యం బాగానే ఉంది పరీక్షలు అవసరం లేదంటే కుదరదు. వైద్య సిబ్బంది లెక్కల కోసమైనా వచ్చి తీరాలి. లేకుంటే ఆధార్‌ సంఖ్య అయినా చెప్పాలి. ఇదీ క్షేత్రస్థాయిలో ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహణ తీరు. ప్రస్తుతం రెండోదశ సురక్ష శిబిరాలు గ్రామాల్లో నిర్వహిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రచారం కోసం శిబిరాలు పోలింగ్‌ వరకు కొనసాగించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ పథకం ప్రారంభంలో చెప్పిన అంశాలు ఏ ఒక్కటీ సక్రమంగా అమలు కావడం లేదు.

కనిపించని ప్రత్యేక నిపుణులు...: ఆరోగ్య సురక్ష శిబిరాలు వారంలో ఒక రోజు ప్రతీ గ్రామంలో నిర్వహించాలి. కనీసం 300 మందికి పరీక్షలు చేసి, మందులు ఇచ్చినట్లు వారి ఆధార్‌ సంఖ్యలతో సహా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. ప్రతి శిబిరం నుంచి కనీసం పది రిఫరల్‌ కేసులుండాలి. వారిని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రులు లేదా జిల్లా వైద్యశాలకు ఉన్నతస్థాయి వైద్యం కోసం పంపించాలి. ఇవీ లక్ష్యాలు. అలాగే ప్రతి శిబిరంలో ఒక వైద్యాధికారి, ప్రత్యేక నిపుణులు ఇద్దరు పాల్గొనేలా కార్యక్రమాన్ని రూపొందించారు. ప్రస్తుతం ప్రత్యేక నిపుణులు తమ వల్ల కాదని ముఖం చాటేస్తున్నారు. నెట్‌వర్క్‌ ఆసుపత్రుల నుంచి బయటికి రావడానికి వీలు కాదంటున్నారు. దీంతో శిబిరాల్లో వైద్య సేవలు సన్నగిల్లాయి. కేవలం మధుమేహం, రక్తపోటు, ఆర్‌బీఎస్‌, ఈసీజీ వంటి ఏడు పరీక్షలకే పరిమితమయ్యారు. మందులు కూడా పూర్తిస్థాయిలో లేవు.

లక్ష్యాల కోసం హెచ్చరికలు...: శిబిరాల్లో 300లకు తగ్గకుండా ఓపీ నమోదు చేయాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని ఉన్నతస్థాయి అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో చేసేదేమీ లేక గ్రామాల్లో ఆధార్‌ సంఖ్యలు సేకరించి వారికి వైద్య సేవలందించినట్లు నమోదు చేస్తున్నారు. దీనిపై ఒక సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ మాట్లాడుతూ.. రోగి ఇష్టపూర్వకంగా రావాలని, బలవంతంగా తీసుకొచ్చి చూడలేము కదా.. లక్ష్యాలు ఇచ్చి ఒత్తిడి చేస్తుండటంతో తాము తప్పక తప్పుడు నివేదికలు ఇస్తున్నామని అని వ్యాఖ్యానించడం గమనార్హం.

బిల్లులే కానీ నిధుల జమ ఏదీ..!: ప్రత్యేక నిపుణులు ఆరోగ్య శిబిరాలకు హాజరైతే వారికి రవాణా భత్యంగా రూ.500 వరకు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇంతవరకు ఎవరికీ డబ్బులు రాలేదని చెబుతున్నారు. అదే విధంగా రిఫరల్‌ కోసం ఇతర ఆసుపత్రులకు వెళ్లే రోగులకు ఛార్జీలు చెల్లిస్తామని చెప్పారు. బిల్లులు పెట్టడమే తప్ప ఖాతాల్లో డబ్బులు జమ కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అడ్డుకున్నా ఆగదు ‘చలో విజయవాడ’: యర్రగొండపాలెం పట్టణం, న్యూస్‌టుడే: ఉద్యోగులు ఉపాధ్యాయులు, పింఛనర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 27న చలో విజయవాడ కార్యక్రమం తలపెట్టినట్లు ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు కె.ఎర్రయ్య తెలిపారు. యర్రగొండపాలెం ఎస్టీ పాఠశాలలో ఆ సంఘ సమావేశం సామ్యేల్‌ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రయ్య మాట్లాడుతూ.. గత పీఆర్సీ బకాయిలు, దాచుకున్న పీఎఫ్‌, ఏపీజీఎల్‌ఐ తదితర ప్రయోజనాలు ఇవ్వాలని కోరుతూ తలపెట్టిన చలో విజయవాడను జయప్రదం చేయాలని కోరారు. ఎన్ని ఆటంకాలు కల్పించినా నిర్వహించి తీరుతామన్నారు.

ఆ ఆసుపత్రుల్లో సున్నా...

రిఫరల్‌ కేసులు లేనందుకు జిల్లాలోని 24 పీహెచ్‌సీల వైద్యాధికారులకు రెండు రోజుల క్రితం కమిషనర్‌ ఆదేశాల మేరకు తాఖీదులు జారీ చేశారు. ప్రతి శిబిరం నుంచి రిఫరల్‌ కేసులు ఉన్నతస్థాయి ఆసుపత్రులకు పంపాలనేది నిబంధన. దీనికి రోగులు ముందుకు రాకపోవడంతో కొన్ని పీహెచ్‌సీల్లో సున్నాగా నమోదైంది. ఇందులో మారెళ్ల, చందలూరు, చింతల, చెట్లమిట్ట, పెద్దారవీడు, కేఎస్‌.పల్లి, రాజుపాలెం, అనుమలవీడు, పొన్నలూరు, పీసీపల్లి, తిప్పాయిపాలెం, మద్దిపాడు, అమ్మనబ్రోలు, మర్రిపూడి, పాలుట్ల, వెంకటాద్రిపాలెం, దూపాడు, త్రిపురాంతకం, ఒంగోలు వెంకటేశ్వరకాలనీ, పాపా కాలనీ, గుడిమెళ్లపాడు, డీజీపేట, కొణిజేడు పీహెచ్‌సీలున్నాయి. ఆయా పీహెచ్‌సీల వైద్యాధికారులకు నోటీసులు జారీ అయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని