logo

సభా పర్వం.. పరాభవం

ఇళ్లపట్టాల పంపిణీ నిమిత్తం ఒంగోలులో ఏర్పాటు చేసిన సభ అధికార పార్టీ వైకాపాకు పరాభవాన్నే మిగిల్చింది. అధినేత వస్తున్నా సిటింగ్‌ ప్రజాప్రతినిధులే కొందరు డుమ్మా కొట్టారు. అందుబాటులో ఉన్నప్పటికీ హాజరు కాలేదు.

Updated : 24 Feb 2024 05:47 IST

బాలినేని ఊసే ఎత్తని జగన్‌
కన్నెత్తి చూడని సిటింగ్‌లు
ముఖం చాటేసిన ఆశావహులు
సీఎం తీరుతో ‘కొత్త’ సందేహాలు

వేదికపై సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి.. చిత్రంలో మంత్రులు సురేష్‌, నాగార్జున, ధర్మాన, బాపట్ల ఎంపీ నందిగం, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి, బాలినేని, పురపాలకశాఖ ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ తదితరులు

ళ్లపట్టాల పంపిణీ నిమిత్తం ఒంగోలులో ఏర్పాటు చేసిన సభ అధికార పార్టీ వైకాపాకు పరాభవాన్నే మిగిల్చింది. అధినేత వస్తున్నా సిటింగ్‌ ప్రజాప్రతినిధులే కొందరు డుమ్మా కొట్టారు. అందుబాటులో ఉన్నప్పటికీ హాజరు కాలేదు. నిన్నటి వరకు తాడేపల్లి ప్యాలెస్‌ చుట్టూ ప్రదక్షిణలు చేసిన ఆశావహులు కూడా ముఖం చాటేశారు. అదే సమయంలో నిండుసభలో సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి వ్యవహరించిన తీరు సభికుల్లో అనేక ‘కొత్త’ అనుమానాలకు దారి తీసింది. సుమారు గంటకు పైగా ఉపన్యసించిన ఆయన.. మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పేరును ఎక్కడా ప్రస్తావించలేదు. ఈ పరిణామంపై ఆ పార్టీ శ్రేణులే విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. తన రాజకీయ భవిష్యత్తును పణంగా పెట్టి మరీ పేదలకు ఇళ్లస్థలాలు సాధించినట్లు బాలినేని పలు వేదికలపై పదేపదే ప్రకటించారు. అయినప్పటికీ సీఎం ఎక్కడా ఇళ్లపట్టాల విషయంలో ఆయన పాత్రను ప్రస్తావించకపోవడం గమనార్హం. వేల సంఖ్యలో బస్సులను ఏర్పాటు చేసి.. బలవంతంగా జనాన్ని సమీకరించి ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఈ సభ.. తరలివచ్చిన వారికి అవస్థలనే మిగిల్చింది. - న్యూస్‌టుడే, ఒంగోలు

ముఖ స్తుతి.. పర నిందలే తప్ప...: సీఎం జగన్‌ ఒంగోలు సభలో సుమారు గంటకు పైగా ఉపన్యసించారు. ముఖ స్తుతి.. పరనిందలే తప్ప ఎన్నికల వేళ కూడా జిల్లాకు ప్రత్యేకించి వరాలేవీ కురిపించలేదు. రాష్ట్రంలో గృహ నిర్మాణానికి తాము చేస్తున్న కృషి పైనే ఎక్కువగా మాట్లాడారు. ఆ తర్వాత ప్రత్యర్థి పార్టీలపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఒంగోలులో ఇళ్లపట్టాలకు రూ.201 కోట్లు ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించిన జగన్‌.. తన ఉపన్యాసంలో ఎక్కడా అందుకు బాలినేని కృషి చేశారని చెప్పకపోవడం చర్చకు దారి తీసింది. వచ్చే ఎన్నికల్లో ఒంగోలు నుంచి బాలినేని పోటీ చేస్తారనీ, ఆయన్ను ఆశీర్వదించాలంటూ ప్రజలకు సూచిస్తారని ఆయన అనుయాయులు భావించారు. సీఎం కనీసం బాలినేని మాట ఎత్తకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. సమస్య ఏదైనా ఉంటే, గృహ నిర్మాణంలో ఇబ్బందులు ఎదురైతే జిల్లా కలెక్టర్‌ను సంప్రదించాలని సూచించిన జగన్‌.. మాట వరసకైనా బాలినేని ప్రస్తావన తీసుకురాకపోవడం గమనార్హం. తాను పాల్గొంటున్న ప్రతిసభలోనూ పైన దేవుడ్ని, కింద ఉన్న మిమ్నల్నే నమ్ముకున్నానంటూ వల్లె వేస్తుంటారు. ఈసారి కూడా అదే మాటలంటూనే దళారులు, మధ్యవర్తులు, బ్రోకర్లను నమ్ముకోలేదనే కొత్త పదాలను జోడించారు. దీంతో వాళ్లెవరనే చర్చకు తెర లేపారు.

డీఎస్పీతో దురుసు ప్రవర్తన...: సభ ముగిసిన అనంతరం హెలీప్యాడ్‌కు చేరిన సీఎం జగన్‌ ద్వితీయశ్రేణి నాయకులతో సుమారు 1.50 గంటలు ముచ్చటించారు. ముందుగా నిర్ణయించిన మేరకు సీఎం జగన్‌ తిరుగు ప్రయాణంలో 466 మంది ద్వితీయశ్రేణి నాయకులను పలకరించేలా షెడ్యూల్‌ రూపొందించారు. చివరికి ఆ సంఖ్య 600 దాటిపోయింది. ఈ సమయంలో బాలినేని పీఏ వెంకట్‌ అక్కడికి వెళ్లే ప్రయత్నం చేయగా విధుల్లో ఉన్న డీఎస్పీ ఒకరు అడ్డుకున్నారు. ఈ సమయంలో ‘నేను బాలినేని పీఏని.. నన్నే అడ్డుకుంటావా’ అంటూ ఆయనకు వేలు చూపిస్తూ హెచ్చరించారు. దీంతో అక్కడే ఉన్న దర్శి డీఎస్పీ అశోక్‌వర్ధన్‌ సీరియస్‌గా స్పందించారు. పోలీసు అధికారులపై జులుం ప్రదర్శిస్తే బాగుండదని హెచ్చరించారు. ఈ క్రమంలోనే ఇతర పోలీసులు వెంకట్‌పై చేయి చేసుకోవడంతో అతని కళ్లజోడు విరిగిపోయినట్లు సమాచారం. ఈ విషయాన్ని గమనించిన పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి.. వెంకట్‌ను అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్లడంతో గొడవ సద్దుమణిగింది. పోలీసులు వ్యవహరించిన తీరుపై సీఎంవోకు ఫిర్యాదు చేశారు. ఇదిలాఉంటే సీఎం పర్యటన పూర్తయిన తర్వాత హెలీప్యాడ్‌ వద్ద విధి నిర్వహణలో అద్భుతమంటూ జిల్లా ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి సెట్‌లో దిశ డీఎస్పీ శ్రీనివాసులును ప్రశంసించడం గమనార్హం.

ఇళ్ల పట్టాల పంపిణీ సభకు హాజరైన లబ్ధిదారులు, ప్రజలు

కనిగిరిలో మార్పేమీ లేదు...: తిరుగు ప్రయాణ సమయంలో కలిసిన పలువురు ద్వితీయశ్రేణి నాయకులు జగన్‌ను కలిశారు. కనిగిరి అభ్యర్థిత్వం విషయంలో పునరాలోచించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావుకు అవకాశం ఇవ్వాలనగా.. దద్దాలను మార్చే యోచన లేదని వారికి స్పష్టం చేసినట్లు తెలిసింది. మార్కాపురం ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి కుటుంబంపై తీవ్ర అవినీతి ఆరోపణలు చేసి సస్పెన్షన్‌కు గురైన పెద్దిరెడ్డి సూర్యప్రకాష్‌రెడ్డిని సీఎం ఓదార్చారు. తనను అన్యాయంగా సస్పెండ్‌ చేశారంటూ పెద్దిరెడ్డి చెప్పగా.. నిన్నెవరు సస్పెండ్‌ చేశారు..? నాకు తెలియదంటూ వ్యాఖ్యానించినట్లు సమాచారం.

చెవిరెడ్డికి అంతకు మించి...: సీఎం ఒంగోలు పర్యటనలో సాంతం ప్రాంతీయ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నీ తానై వ్యవహరించారు. సీఎం వచ్చి వెళ్లిపోయే రెండు సందర్భాల్లోనూ చెవిరెడ్డికి అత్యంత ప్రాధాన్యమిచ్చారు. ప్రతి విషయంలోనూ చెవిరెడ్డి, జిల్లా కలెక్టర్‌లతోనే మాట్లాడుతూ కనిపించారు. స్థానిక ఎమ్మెల్యే బాలినేనికి ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ.. చెవిరెడ్డి విషయంలో అంతకుమించి అనేలా జగన్‌ వ్యవహరించారు. సీఎం తాడేపల్లి బయలుదేరగానే.. ఓ శుభకార్యంలో పాల్గొనేందుకు ఎమ్మెల్యే బాలినేని హెలీప్యాడ్‌ నుంచి నేరుగా హైదరాబాద్‌ ప్రయాణమై వెళ్లారు.


ఇటు గైర్హాజరు.. అటు మంతనాలు

మద్దిశెట్టి, మాగుంట, శిద్దా

పార్టీ అధిష్ఠానం గత కొన్నాళ్లుగా తనను దూరం పెడుతుండటంతో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి సభకు గైర్హాజరయ్యారు. హాజరై అవమానపడటం కంటే దూరంగా ఉండటమే ఉత్తమమని భావించి ఆయన ఒంగోలు రాలేదు. ‘తాను ఎంపీని ఆహ్వానించినా, సభా వేదికపై ఆయనకు సరైన గౌరవం దక్కకపోతే అది తన పైనా ప్రభావం చూపుతుందని.. అందుకే తాను మాగుంటను ఒంగోలు సభకు ఆహ్వానించలేదు’ అని ఎమ్మెల్యే బాలినేని సన్నిహితులతో వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఒంగోలులోనే ఉన్నప్పటికీ మాగుంట తనయుడు రాఘవ్‌రెడ్డి సీఎం సభ వైపు కన్నెత్తి చూడలేదు. శుక్రవారం సాయంత్రం ఆయన తన కుటుంబ అభిమానులను కలిశారు. దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ కూడా ఈ సభకు డుమ్మా కొట్టారు. ఒంగోలులోనే ఉన్నప్పటికీ మాజీ మంత్రి శిద్దా రాఘవరావు గైర్హాజరయ్యారు. ఆయన తనయుడు, తితిదే పాలకమండలి సభ్యుడు శిద్దా సుధీర్‌ మాత్రం హెలీప్యాడ్‌ వద్ద సీఎంను కలిసి వెంటనే వెనుదిరిగారు. కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు సైతం ముఖం చాటేశారు. అదే సమయంలో ఆయన తన స్వగ్రామంలో కార్యకర్తలతో సమావేశం కావడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని