logo

వైకాపాలో కథ ముగిసింది

ఆ పార్టీ అధిష్ఠానంపై ఒక్క విమర్శా చేయలేదు. పదునైన ఆరోపణాస్త్రాలూ సంధించలేదు. వికృత క్రీడలో ఇమడలేక.. ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా అడుగడుగునా ఎదురైన అవమానాలు భరించలేక తనదైన శైలిలో జెండా పీకేశారు.

Updated : 01 Mar 2024 08:26 IST

అడుగడుగునా అవమానాలు
ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఘటనలు
గుంభనంగానే ఎంపీ మాగుంట భరింపు
జెండా పీకేసి ఆపై వీడ్కోలు
ఈనాడు, ఒంగోలు- ఒంగోలు, న్యూస్‌టుడే

ఆ పార్టీ అధిష్ఠానంపై ఒక్క విమర్శా చేయలేదు. పదునైన ఆరోపణాస్త్రాలూ సంధించలేదు. వికృత క్రీడలో ఇమడలేక.. ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా అడుగడుగునా ఎదురైన అవమానాలు భరించలేక తనదైన శైలిలో జెండా పీకేశారు. సీఎం జగన్‌ నుంచి తనకు నియోజకవర్గంలో సహకరించిన స్థానిక ప్రజాప్రతినిధుల వరకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. వైకాపాను వీడనున్నట్లు గత రెండు నెలలుగా సాగుతున్న ప్రచారానికి ఎట్టకేలకు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి బుధవారం ముగింపు పలికారు. ఆత్మగౌరవాన్ని చంపుకోలేను.. ఇక నేను ఉండలేనంటూ ఆ పార్టీని వీడారు. తన కుమారుడు మాగుంట రాఘవ్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ చేస్తారని ప్రకటించినా.. ఏ పార్టీ అనేది ఇంకా బహిర్గతం చేయలేదు.

ఆది నుంచీ అందని మద్దతు...: దిల్లీ లిక్కర్‌ కుంభకోణంలో ఎంపీ మాగుంట తనయుడు రాఘవ్‌రెడ్డి అరెస్టై సుమారు ఆరు నెలలపాటు తిహార్‌ జైలులో ఉన్నారు. ఆ సమయంలో బెయిల్‌పై బయటికి తీసుకొచ్చేందుకు మాగుంట పడరాని పాట్లు పడ్డారు. ముప్ఫై మూడేళ్ల రాజకీయ జీవితంలో తాను ఎన్నడూ ఎదుర్కోని కష్టకాలాన్ని.. గడ్డు పరిస్థితులను అనుభవించారు. అటువంటి సమయంలోనూ ఆయనకు వైకాపా నుంచి నైతిక మద్దతు లభించలేదు. కనీసం పరామర్శ కూడా దక్కలేదు. పార్టీ అధిష్ఠానం, పెద్దలు ఈ విషయాన్ని అస్సలు పట్టించుకోలేదు. రాష్ట్రంలో నూతన మద్యం విధానం పేరుతో కుటుంబ వ్యాపారాన్ని వైకాపా దెబ్బతీసింది. సింగరాయకొండలోని సొంత డిస్టిలరీని మూసేసే పరిస్థితులు కల్పించింది.

గడప తొక్కనీయని తాడేపల్లి...: ఒంగోలు ఎంపీగా మాగుంట, ఎమ్మెల్యేగా తాను కలిసే పోటీ చేస్తామంటూ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పలు వేదికలపై ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌లను తిట్టాలని తాడేపల్లి ప్యాలెస్‌ సూచించినప్పటికీ మాగుంట తిరస్కరించారు. తిట్టుడు రాజకీయం ఏంటో అంతుచిక్కడం లేదంటూ అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల నుంచి వైదొలుగుతాను కానీ దూషణపర్వం తన వల్ల కాదని తేల్చి చెప్పారు. ఆ తర్వాత పరిణామాలు వేగంగా మారాయి. తాడేపల్లి ప్యాలెస్‌ వ్యవహార తీరు పూర్తిగా మారిపోయింది. ఎన్నికల ప్రక్రియ ఊపందుకున్న తరుణంలో వైకాపా అధిష్ఠానం మాగుంటను పూర్తిగా పక్కన పెట్టేసింది. టికెట్‌ ఇచ్చే అవకాశమే లేదని తేల్చి చెప్పేసింది. తమను కలిసేందుకు కూడా నిరాకరించింది. ఈ క్రమంలోనే మాగుంట జిల్లాలో ఎక్కడ పోటీ చేసినా ఓడిస్తామంటూ గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబుతో ప్రకటన చేయించింది. చివరికి ఒంగోలు పార్లమెంట్‌ సమన్వయకర్తగా తిరుపతి జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని నియమించింది. ఈ నెల 23న ఒంగోలు సభకు సీఎం జగన్‌ వచ్చినా ప్రొటోకాల్‌ ప్రకారం సిటింగ్‌ ఎంపీ హోదాలోనూ మాగుంటకు ఆహ్వానం అందించకుండా అగౌరవపరిచింది.

పార్లమెంట్‌ సాక్షిగానూ పరాభవం...: పార్టీ తనకు టికెట్‌ లేదన్నా మాగుంట పట్టించుకోలేదు. తాడేపల్లి ప్యాలెస్‌ గడప తొక్కొద్దని చెప్పినా తూలనాడలేదు. అన్నింటినీ మౌనంగానే భరిస్తూ గుంభనంగా ఉండిపోయారు. అదే సమయంలో దేశ రాజధాని దిల్లీ నడిబొడ్డున పార్లమెంట్‌ భవన్‌ సాక్షిగా ఘోర పరాభవానికి కూడా గురయ్యారు. ప్రధాని నరేంద్రమోదీని కలిసేందుకు సీఎం జగన్‌ దిల్లీ వెళ్లారు. ఈ సమయంలో ఆయనకు మాగుంట ఎదురేగి నమస్కరించినా కనీసం పట్టించుకోలేదు. అదే సమయంలో జూనియర్లు, తొలిసారి పార్లమెంట్‌కు ఎంపికైన మిథున్‌రెడ్డి, నందిగం సురేష్‌, గోరంట్ల మాధవ్‌ వంటి వారితో కలిసి ప్రధాని వద్దకు జగన్‌ వెళ్లారు. చేసేదేమీ లేక ఒంటరిగా మెట్ల వద్దనే మాగుంట నిల్చుండిపోయారు.


పొమ్మనకుండానే పొగబెట్టి...

రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థుల మార్పుపై దృష్టి పెట్టిన వైకాపా ఇప్పటికే ఎనిమిది జాబితాలు విడుదల చేసింది. పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలను ఇతర నియోజకవర్గాలకు బదిలీ చేసింది. ఈ క్రమంలో మాగుంట విషయం తేల్చలేదు. ఆయన్ను కనీసం పట్టించుకోలేదు. పైగా ఒంగోలు పార్లమెంట్‌ సమన్వయకర్తగా తిరుపతి జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని నియమించింది. తద్వారా పొమ్మనకుండానే మాగుంటకు పొగపెట్టింది. ఈ పరిణామాల నేపథ్యంలో కుటుంబ సభ్యులు, అనుచరగణంతో చర్చించారు. తెదేపా అగ్రనేతలతోనూ ఆయన మంతనాలు సాగించారు. గతంలో తనకు తెదేపాలో లభించిన గౌరవమర్యాదులు, వైకాపాలో ఎదురైన అవమానాలు, ఛీత్కారాలను బేరీజు వేసుకుని చివరికి వైకాపా జెండా పీకేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఒంగోలు పార్లమెంట్‌ స్థానం నుంచి తన కుమారుడు రాఘవ్‌రెడ్డి పోటీ చేస్తారని చెప్పినా.. తదుపరి రాజకీయ భవిష్యత్తును త్వరలో ప్రకటిస్తానంటూ వైకాపా నుంచి నిష్క్రమించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు