logo

ఏ నిమిషానికి ఎవరు మారునో!

‘ఇప్పటి వరకు మా పార్టీ నియమించిన వాళ్లు కేవలం సమన్వయకర్తలు మాత్రమే. అభ్యర్థులు కాదు’.. వైకాపా సీనియర్‌ నేత, ఎంపీ, తితిదే మాజీ ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు.

Updated : 03 Mar 2024 08:18 IST

ఆశావహులతో వైకాపా బంతాట
అయోమయంలో సమన్వయకర్తలు

ఒంగోలు, న్యూస్‌టుడే: ‘ఇప్పటి వరకు మా పార్టీ నియమించిన వాళ్లు కేవలం సమన్వయకర్తలు మాత్రమే. అభ్యర్థులు కాదు’.. వైకాపా సీనియర్‌ నేత, ఎంపీ, తితిదే మాజీ ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు.

ఆ తర్వాత కొద్ది రోజుల వ్యవధిలోని పార్టీ శ్రేణులతో సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి విజయవాడలో సమావేశమయ్యారు. నేటి సమన్వయకర్తలే రేపటి అభ్యర్థులని ప్రకటించారు. దీంతో నూతన సమన్వయకర్తలు కాసింత స్థిమిత పడ్డారు. అయినా రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో తరచూ చేస్తున్న మార్పులు.. చోటుచేసుకుంటున్న పరిణామాలు వారిని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటి వరకు తొమ్మిది జాబితాల్లో నియోజకవర్గ సమన్వయకర్తలను అధికార వైకాపా ప్రకటించింది. పలు జిల్లాల్లో పదేపదే మార్పులు చేసింది. ఈ పరిస్థితులు ఆశావహుల్లో గుబులు రేకెత్తిస్తోంది. దీంతో ఎన్నికల షెడ్యూల్‌ సమయానికి బరిలో తామే ఉంటామా.. తమ స్థానాన్ని ఇంకెవరితోనైనా భర్తీ చేస్తారా అని పలువురు ఆందోళన చెందుతున్నారు.

స్థానాలు మార్చి.. డమ్మీలుగా చేసి...: సర్వేల పేరిట ఆశావహులతో వైకాపా అధిష్ఠానం ఆటాడుకుంటోంది. సిటింగ్‌ ఎమ్మెల్యేలను పక్కన పెట్టి డమ్మీలను చేసింది. వారి నియోజకవర్గాలను కూడా మార్చేసి ఆటాడిస్తోంది. తమకు ఇష్టం ఉన్నా లేకపోయినా సీఎం జగన్‌ ఆదేశాలతో మంత్రులు ఆదిమూలపు సురేష్‌, మేరుగు నాగార్జున తమ పాత స్థానాలను విడిచి కొండపి, సంతనూతలపాడు నియోజకవర్గ సమన్వయకర్తలుగా బాధ్యతలు చేపట్టారు. సిటింగులుగా ఉన్న బుర్రా మధుసూదన్‌ యాదవ్‌, మద్దిశెట్టి  వేణుగోపాల్‌, టీజేఆర్‌.సుధాకర్‌బాబులను పక్కనబెట్టినా కిమ్మనలేని పరిస్థితి. అక్కడ కాకున్నా మరెక్కడైనా అవకాశం ఇవ్వమని తాడేపల్లి ప్యాలెస్‌ చుట్టూ తిరుగుతున్నా స్పందించడం లేదు. వీరితో పాటు యర్రగొండపాలెం, కనిగిరి నియోజకవర్గాల్లో తాటిపర్తి చంద్రశేఖర్‌, దద్దాల నారాయణ యాదవ్‌ నూతనంగా నియమితులయ్యారు. మార్కాపురం, గిద్దలూరు నియోజకవర్గాల్లో సమన్వయకర్తలను పరస్పరం మార్చేశారు. దర్శి ఇన్‌ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డిని నియమించారు.

చేసేదేమీ లేక సర్దుకుపోతూ...: ఒక్క ఒంగోలు అసెంబ్లీ స్థానం తప్ప జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అధికార వైకాపా నూతన సమన్వయకర్తలను నియమించింది. రానున్న ఎన్నికల్లో వారే పార్టీ అభ్యర్థులుగా ఆయా స్థానాల్లో పోటీ చేస్తారని అంతా భావిస్తున్నారు. తదనుగుణంగానే మంత్రులు సురేష్‌, నాగార్జున సుమారు రెండు నెలలకు పైగా నూతన నియోజకవర్గాల్లో పరిస్థితిని చక్కబెట్టుకునే పనిలో ఉన్నారు. అసంతృప్తుల నుంచి ప్రతిఘటన ఎదురవుతున్నా భరిస్తున్నారు. తమ ప్రచార భారాన్ని కొందరు పోలీసు, ఇతర ప్రభుత్వ శాఖాధికారులపై వేసి ముందుకు సాగుతున్నారు. మరికొందరు పార్టీ టికెట్‌ తమదేననే భావనతో ఆస్తులను తెగనమ్మి కార్యక్రమాలు చేపడుతున్నారు. దద్దాల నారాయణ యాదవ్‌, తాటిపర్తి చంద్రశేఖర్‌ గత కొన్నాళ్లుగా ఆయా నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. వ్యక్తిగత కారణాలతో ఈ దఫా ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటానని ప్రకటించిన గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు కూడా.. సీటు మార్చేసరికి సరేనంటూ మార్కాపురంలో తాయిలాల పంపిణీకి తెర లేపారు. స్థానిక నేతల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నా తప్పనిసరి పరిస్థితుల్లో గిద్దలూరులో కుందురు నాగార్జునరెడ్డి సర్దుకుపోతున్నారు.

ఉంచుతారా.. వెళ్లగొడతారా..!

వైకాపా నూతన సమన్వయకర్తల నియామకం చేపట్టిన అన్నిచోట్లా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కొండపిలో మంత్రి సురేష్‌కు మాజీ ఇన్‌ఛార్జి మాదాసి వెంకయ్య వర్గం సహకరించడం లేదు. అక్కడ ఇతరత్రా స్థానిక సమస్యలు కూడా ఉన్నాయి. కనిగిరిలో దద్దాల నారాయణ యాదవ్‌కు సిట్టింగ్‌ ఎమ్మెల్యే బుర్రా, మాజీ ఎమ్మెల్యే కదిరి వర్గాలు దూరంగా ఉంటున్నాయి. గిద్దలూరులో కుందురుకు వ్యతిరేకంగా స్థానిక నాయకులు ఒంగోలు కేంద్రంగా మంత్రాంగం నడుపుతున్నారు. మార్కాపురంలో అన్నా రాంబాబుకు స్థానిక సంస్థల కుర్చీలాట తలనొప్పిగా మారింది. దర్శిలో బూచేపల్లికి సిటింగ్‌ ఎమ్మెల్యే మద్దిశెట్టి వర్గం దూరంగానే ఉండిపోయింది. సంతనూతలపాడులో మంత్రి నాగార్జున తమను పట్టించుకోలేదంటూ స్థానిక నేతలు అసమ్మతి గళం వినిపిస్తూనే ఉన్నారు. ఈ పరిస్థితులకు ఎదురొడ్డి పనిచేస్తున్న నేతలకు సమన్వయకర్తల మార్పు మింగుడు పడకుంది. వచ్చే ఎన్నికల్లో నిజంగా తమకే టికెట్‌ ఇస్తారా., సర్వేలు, సామాజిక సమీకరణాల పేరిట కొత్త వారిని తెర పైకి తీసుకొస్తారా.. అనే సందేహంలో కొట్టుమిట్టాడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు