logo

‘రూ.లక్ష ఇవ్వు.. లేదంటే కేసు’

న్యాయ అన్యాయాలు విచారించి బాధితుల తరఫున నిలవాల్సిన ఎస్సై.. అక్రమాలకు పాల్పడుతున్న వారికి వత్తాసు పలికారు. దారికి రాకుంటే ఇబ్బందులు పడతారంటూ ఫిర్యాదుదారుల పైనే కేసు నమోదుకు సిద్ధమయ్యారు.

Updated : 03 Apr 2024 06:09 IST

అక్రమార్కులకు వత్తాసు
బాధితుల పైనే బెదిరింపులు

ఏసీబీకి చిక్కిన ఎస్సై నాగేశ్వరరావు.. చిత్రంలో స్వాధీనం చేసుకున్న నగదు

టంగుటూరు, న్యూస్‌టుడే: న్యాయ అన్యాయాలు విచారించి బాధితుల తరఫున నిలవాల్సిన ఎస్సై.. అక్రమాలకు పాల్పడుతున్న వారికి వత్తాసు పలికారు. దారికి రాకుంటే ఇబ్బందులు పడతారంటూ ఫిర్యాదుదారుల పైనే కేసు నమోదుకు సిద్ధమయ్యారు. మీపై ఎలాంటి కేసు కాకుండా ఉండాలంటే రూ.లక్ష నగదు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. చివరికి అవినీతి నిరోధక శాఖ(అనిశా) అధికారుల వలకు చిక్కారు. అనిశా డీఎస్పీ వి.శ్రీనివాసరావు తెలిపిన వివరాల మేరకు.. టంగుటూరు మండలం కాకుటూరివారిపాలెంలో అక్రమంగా బ్యారన్ల నిర్మాణం చేస్తున్నారని, పనులు నిలుపుదల చేయాలంటూ ఆ గ్రామ సర్పంచి కొమ్మినేని రమణమ్మ కుమారులు శ్రీనివాసులు, వెంకటరావు టంగుటూరు ఎస్సై నాగేశ్వరరావుకి ఇటీవల ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు తీసుకుపోగా వారిని తీవ్ర దుర్భాషలాడి పంపించేశారు. అనంతరం సర్పంచి కుమారులు తనను బెదిరిస్తున్నారంటూ బ్యారన్లు నిర్మిస్తున్న వ్యక్తి ఎస్సైకు ఫిర్యాదు చేశారు.

ఈ క్రమంలో వారిపై కేసు నమోదు చేయకుండా, కేవలం 41ఏ కింద నోటీసు ఇచ్చి వదిలేయాలంటే రూ.లక్ష నగదు లంచంగా ఇవ్వాలని ఎస్సై వారిని డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో గత నెల 29న మేదరమెట్ల వద్ద ఓ హోటల్‌లో రూ.30 వేలు ఇప్పటికే ఇచ్చారు. అనంతరం ఏసీబీ అధికారులను బాధితులు ఆశ్రయించారు. వారి సూచనల మేరకు బాధితుడు కొమ్మినేని శ్రీనివాస్‌ టంగుటూరులోని చెల్లెమ్మతోటలో ఎస్సై నివాసం ఉంటున్న ప్రాంతానికి వెళ్లారు. అక్కడ ఇంటి బయట వేచి ఉండగా.. ఎస్సై తన కారులో వచ్చి రూ.70 వేలు తీసుకున్నారు. ఆ డబ్బును కారులో దాచి పెట్టగా, అప్పటికే మాటు వేసి ఉన్న ఏసీబీ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడుల్లో ఏసీబీ ఇన్‌స్పెక్టర్లు ఎన్‌ఎస్‌ఎస్‌.అపర్ణ, సీహెచ్‌ శేషు, ఎస్సైలు జేబీఎన్‌ ప్రసాద్‌, మస్తాన్‌ షరీఫ్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని