logo

ఎస్పీ ‘చెవి’ మెలిపెట్టిన ఈసీ

జిల్లా ఎస్పీ పి.పరమేశ్వర్‌రెడ్డిపై వేటు పడింది. ఆయన్ను జిల్లా ఎస్పీ బాధ్యతల నుంచి తప్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన్ను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని అందులో పేర్కొంది.

Updated : 03 Apr 2024 05:55 IST

ఎన్నికల విధులకు వద్దు
పరమేశ్వర్‌రెడ్డిపై సీఈసీ వేటు
ఇన్‌ఛార్జిగా నాగేశ్వరరావు
ఒంగోలు, న్యూస్‌టుడే

పరమేశ్వర్‌రెడ్డి

జిల్లా ఎస్పీ పి.పరమేశ్వర్‌రెడ్డిపై వేటు పడింది. ఆయన్ను జిల్లా ఎస్పీ బాధ్యతల నుంచి తప్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన్ను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని అందులో పేర్కొంది. ఆ స్థానంలో నియామకానికి ముగ్గురేసి అధికారులతో ప్యానల్‌ రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ఎస్పీని తక్షణం విధుల నుంచి వైదొలిగి అదనపు ఎస్పీకి బాధ్యతలు అప్పగించాలని సూచించింది. దీంతో పరమేశ్వర్‌రెడ్డి తన బాధ్యతల నుంచి వైదొలిగారు. ఆ వెంటనే అదనపు ఎస్పీ(అడ్మిన్‌) నాగేశ్వరరావుకు ఇన్‌ఛార్జి ఎస్పీగా బాధ్యతలు అప్పగించారు.

ప్రలోభాలకు వేయలేదు అడ్డుకట్ట...: పరమేశ్వర్‌రెడ్డి తిరుపతి ఎస్పీగా పనిచేస్తూ బదిలీపై జిల్లాకు వచ్చారు. అప్పటి వరకు పనిచేసిన ఎస్పీ మలికా గార్గ్‌ ఫిబ్రవరి 12న విధుల నుంచి రిలీవ్‌కాగా, అదేరోజు సాయంత్రం పరమేశ్వర్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఇన్ని రోజులు కేవలం అధికారిక సమావేశాలకు మాత్రమే హాజరవుతూ వచ్చారు. ఈసీ ఆదేశాల మేరకు ఏర్పాటుచేసిన చెక్‌పోస్టుల్లోనూ తగినంత మంది సిబ్బందిని నియమించలేదు. జిల్లావ్యాప్తంగా ప్రలోభాల ఎరవేస్తున్నా, తాయిలాలు పంపిణీ చేస్తున్నా జిల్లా పోలీసుల నుంచి కనీస స్పందన కూడా కరవైందనే ఆరోపణలున్నాయి. ఇంతలోనే సీఈసీ ఆదేశాలతో ఆయన బదిలీ అయ్యారు. 2019 ఎన్నికల సమయంలోనూ అప్పటి జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్‌ను ఎన్నికల కమిషన్‌ విధుల నుంచి తప్పించి సిద్ధార్థ్‌ కౌశల్‌ను నియమించింది. ఈ దఫా బాధ్యతలు చేపట్టిన 50 రోజుల్లోనే పరమేశ్వర్‌రెడ్డిపై బదిలీ వేటు పడింది.

రావడమే వివాదాస్పదం...: వాస్తవానికి జిల్లా ఎస్పీ మార్పు అనూహ్యంగా సాగింది. చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని ప్రాంతీయ సమన్వయకర్తగా వైకాపా ప్రకటించింది. ఒంగోలు ఎంపీ అభ్యర్థిగానూ ఆయనే పోటీ చేస్తారని సూత్రప్రాయంగా తెలిపింది. ఆ వెంటనే అప్పటి వరకు జిల్లా ఎస్పీగా పనిచేసిన మలికా గార్గ్‌పై వేటు పడింది. తిరుపతి ఎస్పీగా పనిచేస్తున్న పరమేశ్వర్‌రెడ్డిని జిల్లా ఎస్పీగా నియమించారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో లబ్ధి కోసమే ఈ బదిలీ సాగిందనే విమర్శలు అప్పట్లో జోరుగా వినిపించాయి. తిరుపతి ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన కేవలం ఇరవై రోజుల్లోనే మలికా గార్గ్‌ను అక్కడి నుంచి తప్పించి సీఐడీకి బదిలీ చేయడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది.

హత్యోదంతంలో ఈసీ ఎదుట హాజరు...: తిరుపతి ఎస్పీగా ఉన్న రోజుల నుంచీ అధికార పార్టీకి అంటకాగుతున్నారనే విమర్శలున్నాయి. దీంతోపాటు మార్చి 17న ప్రధానమంత్రి నరేంద్రమోదీ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడి వద్ద నిర్వహించిన భాజపా, తెదేపా, జనసేన కూటమి సభకు హాజరయ్యారు. ఆ సభకు భద్రతతో పాటు ట్రాఫిక్‌ నియంత్రణలోనూ పోలీసులు ఘోరంగా విఫలమయ్యారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇదే సమయంలో గిద్దలూరు మండలంలో తెదేపా నాయకుడు మునయ్య హత్య విషయంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఎస్పీని తన ముంగిట హాజరుకావాలని ఆదేశించింది. ఈ వివాదాల నేపథ్యంలో పరమేశ్వర్‌రెడ్డిపై వేటు పడింది. ఒకటీ రెండ్రోజుల్లో జిల్లాకు నూతన ఎస్పీని నియమించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని