logo

ఇంకా వారం కాలేదా జగన్‌?

మాటలతో గారడీ చేయడం సీఎం జగన్‌కు వెన్నతో పెట్టిన విద్య. 2019లో ఎన్నికల ముందు ఆయన చేసిన శుష్క వాగ్దానాల బుట్టలో పడినవారిలో ప్రభుత్వ ఉద్యోగులు మొదటి వరుసలో ఉన్నారు. సీపీఎస్‌ రద్దు చేస్తామని హామీ ఇచ్చి.. ఓట్లు వేయించుకున్న జగన్‌ అధికారంలోకి రాగానే మొండిచేయి చూపారు.

Published : 17 Apr 2024 05:05 IST

అయిదేళ్లు గడిచినా నెరవేర్చని సీపీఎస్‌ రద్దు హామీ
రోడ్డెక్కినా పట్టించుకోని వైకాపా ప్రభుత్వం
న్యూస్‌టుడే, పాతశ్రీకాకుళం

‘చంద్రబాబు సీపీఎస్‌ విషయంలో కమిటీలు వేసి కాలయాపన చేయడం తప్ప ఏమీ చేయలేదు. సీపీఎస్‌ కింద అన్ని వర్గాల ఉద్యోగులున్నారు. సరిగ్గా మూడు నెలల తరువాత అన్న అధికారంలోకి వస్తాడని చెప్పండి. వచ్చిన వారం రోజుల్లోనే సీపీఎస్‌ రద్దు చేసేస్తామని కూడా గట్టిగా చెప్పండి.’

ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి చెప్పిన మాటలివి..

మాటలతో గారడీ చేయడం సీఎం జగన్‌కు వెన్నతో పెట్టిన విద్య. 2019లో ఎన్నికల ముందు ఆయన చేసిన శుష్క వాగ్దానాల బుట్టలో పడినవారిలో ప్రభుత్వ ఉద్యోగులు మొదటి వరుసలో ఉన్నారు. సీపీఎస్‌ రద్దు చేస్తామని హామీ ఇచ్చి.. ఓట్లు వేయించుకున్న జగన్‌ అధికారంలోకి రాగానే మొండిచేయి చూపారు. గద్దెనెక్కిన వారంలో సీపీఎస్‌ తీసేద్దామని చెప్పి.. అయిదేళ్లు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నా ఆ విషయం కొలిక్కితీసుకురాలేదు. ఎన్నికల ముంగిట మరోసారి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనుదారులను మోసం చేసేందుకు ‘సిద్ధం’ అవుతున్నారు.
జిల్లాలో ఆర్టీసీ మినహా వివిధ ప్రభుత్వ శాఖల్లో మొత్తం 25,752 మంది ఉద్యోగులు ఉన్నారు. వారిలో 15,796 మంది కాంట్రిబ్యూటరీ పింఛను పథకం (సీపీఎస్‌) ఉద్యోగులు. 2004 తరువాత ఏదైనా ప్రభుత్వశాఖలో కొలువు సాధించిన వారందరినీ సీపీఎస్‌ పరిధిలో చేర్చారు. వీరందరికీ అంతకుముందు ఉద్యోగులు మాదిరిగా మూల వేతనంలో సగం పింఛనుగా మంజూరు చేయరు. సీపీఎస్‌ నిబంధనలకు లోబడి మాత్రమే పింఛను ఇస్తారు. జిల్లావాప్తంగా సుమారు 60 శాతానికి పైగా సీపీఎస్‌ ఉద్యోగులే ఉన్నారు.

అడిగితే అణచివేత...

జిల్లాలోనూ వైకాపా అభ్యర్థులను గెలిపించడంలో సీపీఎస్‌ ఉద్యోగులు కీలకపాత్ర పోషించారు. ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తర్వాత జగన్‌ వారం కాదు కదా.. 52 వారాలు గడిపేశారు. ఏడాది దాటినా అడిగితే స్పందన లేదు. నాటి నుంచి సీపీఎస్‌ ఉద్యోగులు ధర్నాలు, నిరసనలు చేపట్టారు. హామీ నెరవేర్చలేదని ప్రశ్నిస్తే.. గట్టిగా అడిగితే అణచివేతకు దిగారు. పోలీసుల సహకారంతో గృహనిర్బంధాలు, అరెస్టుల పేరుతో అడ్డుకునేవారు. కరోనా తర్వాత 2022 నుంచి జిల్లాస్థాయిలో పెద్ద ఎత్తున ఉద్యమాలు మొదలుపెట్టారు. వాటికి సైతం ప్రభుత్వం స్పందించలేదు.

తెరపైకి జీపీఎస్‌..

గతేడాది రాష్ట్రస్థాయి ఉద్యమం చేపట్టిన సమయంలో ప్రభుత్వ పెద్దలు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపారు. జీపీఎస్‌ అనే కొత్త నాటకాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ‘దాన్ని మాత్రమే అమలు చేయగలం.. సీపీఎస్‌ రద్దు చేయలేం..’ అని చేతులెత్తేశారు. వైకాపాను నమ్మి దగా పడ్డామని ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడంతో ఉద్యోగ విరమణ అనంతరం జీవనంపై దిగులుతో ముందుకు సాగాల్సిన పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. జీపీఎస్‌ విధానాన్ని తాము అంగీకరించేది లేదని.. సీపీఎస్‌ రద్దు మాత్రమే కావాలని.. ఓపీఎస్‌ పునరుద్ధరించాల్సిందేనని  ఉద్యోగ వర్గాలు ఇప్పటికీ స్పష్టం చేస్తున్నాయి.


పింఛను విధానాల గురించి క్లుప్తంగా ఇలా..

 • పాత పింఛను పథకం(ఓపీఎస్‌)లో ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ నాటికి మూల వేతనంలో సగం వరకు నగదు కచ్చితంగా పింఛనుగా ప్రతి నెలా ఖాతాలో జమ చేస్తారు.
 • కాంట్రిబ్యూటరీ పింఛను పథకం(సీపీఎస్‌)లో ఉద్యోగుల మూల వేతనంతో సంబంధం లేకుండా వారు ఏళ్ల తరబడి పొదుపు చేసుకున్న నగదును పెట్టుబడిగా ఉంచుతారు. అందులో 60 శాతం ఉద్యోగ విరమణ ప్రయోజనాలుగా, 40 శాతం స్టాక్‌ మార్కెట్ తరహాలో ప్రభుత్వం పొదుపు చేస్తుంది. ఆ మేరకు వచ్చిన ఆదాయాన్ని లెక్కగట్టి పింఛనుగా అందజేస్తారు. ఈ విధానంలో ఇంత మొత్తం వస్తుందని గ్యారెంటీ ఉండదు.
 • గ్యారెంటీడ్‌ పింఛను పథకం(జీపీఎస్‌)లో దాచుకున్న మొత్తంలో 60 శాతం ఉద్యోగ విరమణ మొత్తంగా ఇస్తారు. మిగిలిన 40 శాతాన్ని లెక్క గట్టి విభజించి పింఛను కింద ఇస్తామని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విధానంపై ఉద్యోగులకు ఎన్నో అపోహలు ఉన్నప్పటికీ వాటిని నివృతి చేసుకునే అవకాశం ఇవ్వలేదు.

ఇంకెన్నాళ్లు జాప్యం చేస్తారు..

- చౌదరి పురుషోత్తమనాయుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ ఎన్జీవో సంఘం

అయిదేళ్లు గడిచినా సీపీఎస్‌ రద్దు హామీ ఊసెత్త కుండా ప్రత్యామ్నాయాలు చూపిస్తూ కాలయాపన చేశారు. ఇంకెన్నాళ్లు ఇలా జాప్యం చేస్తారు. కుదరదన్నప్పుడు వారం రోజుల్లో చేసేస్తామని ఉద్యోగులకు ఎందుకు ఆశ కల్పించారు. ఉద్యోగులపై ఎందుకీ వివక్ష. ప్రభుత్వ పథకాల అమలు, సంక్షేమం, అభివృద్ధిని క్షేత్రస్థాయిలో అమలు, ఆచరణలోకి తీసుకొచ్చేది ఉద్యోగులే. ఈ విషయాన్ని విస్మరించడం సరికాదు.


ప్రశ్నిస్తే కేసులు బనాయించారు..

- సంపతిరావు కిశోర్‌కుమార్‌, రాష్ట్ర కార్యదర్శి, యూటీఎఫ్‌, శ్రీకాకుళం

1982లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో పింఛను అనేది పాలకుల భిక్ష కాదు.. ఉద్యోగుల హక్కు అని పేర్కొన్నారు. ఆ హక్కుగానే ఓపీఎస్‌ అమలు చేయాలని అడుగుతుంటే స్పందించట్లేదు. ఉద్యమాల ద్వారా సాధించుకుందామని ముందుకెళ్తే అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకటి చెప్పి.. అధికారంలోకి రాగానే మరొకటి చేయడం ఉద్యోగులను మోసం చేయడమే. 30 ఏళ్ల పాటు సేవలందించిన ఉద్యోగుల సామాజిక భద్రతను చూడాల్సిన బాధ్యతను ప్రభుత్వం విస్మరించడం తగదు.

శాఖలవారీగా సీపీఎస్‌ ఉద్యోగులు ఇలా..

గ్రామ, వార్డు సచివాలయాలు:  5,240

 • విద్యా: 4,396
 • వైద్యఆరోగ్య: 2,256
 • పోలీసు: 830
 • రెవెన్యూ: 610
 • పురపాలక: 712
 • పంచాయతీరాజ్‌ : 472
 • ఖజానా: 71
 • రిజిస్ట్రేషన్‌: 69
 • ఇతర : 1,140
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని