logo

పొంచి ఉన్న ముప్పు..పాలకులకు కలగని కనువిప్పు

ప్రజా సంక్షేమం కోసం పాలకులు పాటు పడాలి. వారు ఇబ్బందులు పడకుండా అవసరమైన చర్యలు ఎప్పటికప్పుడు తీసుకోవాలి. వైకాపా ఐదేళ్ల పాలనలో ఇవేవీ కనిపించ లేదు.

Published : 19 Apr 2024 04:42 IST

డైక్‌ నిర్మాణ పనులను గాలికొదిలేసిన వైకాపా సర్కారు
వర్షాకాలం వస్తే భయాందోళనలో నగర వాసులు

కొత్తవంతెన వద్ద శిథిలావస్థకు చేరుకున్న డైక్‌

శ్రీకాకుళం నగరం, న్యూస్‌టుడే: ప్రజా సంక్షేమం కోసం పాలకులు పాటు పడాలి. వారు ఇబ్బందులు పడకుండా అవసరమైన చర్యలు ఎప్పటికప్పుడు తీసుకోవాలి. వైకాపా ఐదేళ్ల పాలనలో ఇవేవీ కనిపించ లేదు. పాలకుల నిర్లక్ష్య వైఖరితో శ్రీకాకుళం నగర ప్రజలకు వరద ముప్పు పొంచి ఉంది. నగరంలోని కొత్త వంతెన సమీపంలో నాగావళి నదిలో గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన డైక్‌ పనులను వైకాపా ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. ఈ నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాల్సిన స్థానిక శాసన సభ్యుడు, మంత్రి ధర్మాన ప్రసాదరావు సైతం పట్టనట్లు వ్యవహరించడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పరిస్థితి మారింది.

అసంపూర్తి పనులతో అవస్థలు

పనులు మధ్యలో నిలిచి పోవడంతో ఆ ప్రాంతంలో కొండలను తలపించేలా నగరానికి రక్షణ కవచంలా ఉండే ఇసుక మేటలు, దానికి ఆనుకుని ఉండే నది గట్టు, చెట్లు, ఓ ప్రైవేటు పాఠశాల ప్రహరీ ఇలా పలు నిర్మాణాలు గత నాలుగేళ్లుగా వరదల ధాటికి నది గర్భంలో కలిసిపోయాయి. కోతకు గురైన రక్షణ గోడ పనులు చేపట్టక పోవడంతో ఈ ఏడాది వరదలు వస్తే నగరంలోని డే అండ్‌ నైట్‌ ప్రాంతం ముంపు బారిన పడే ప్రమాదం ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రూ.4.95 కోట్ల అంచనాతో పనులు

నగర ప్రజలకు బలగ, ఆదివారంపేట ప్రధాన నీటి సరఫరా కేంద్రాల ద్వారా మండు వేసవిలో సైతం పూర్తిస్థాయిలో తాగునీరందించే లక్ష్యంతో ఆకర్షణీయ నగరం పథకం (స్మార్ట్‌సిటీ) ద్వారా రూ.4.95 కోట్ల అంచనా వ్యయంతో డైక్‌ నిర్మాణ పనులు గత ప్రభుత్వ హయాంలో చేపట్టారు. దాదాపు 50 శాతం మేర పనులు పూర్తయ్యాయి. గుత్తేదారునికి బిల్లులు సైతం చెల్లించారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం పనులు విస్మరించడం నగర ప్రజలకు శాపంగా మారింది.

ప్రజల ప్రాణాలంటే లెక్కలేదా..?

కోతకు గురైన ప్రాంతంలో కాంక్రీటుతో రక్షణ గోడ నిర్మించి నగరాన్ని వరద ముంపు నుంచి కాపాడాల్సిన ప్రభుత్వానికి ప్రజల ప్రాణాలంటే లెక్కలేకుండా పోయిందని నగర వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడేళ్ల క్రితం నదికి భారీగా వరద వచ్చిన సమయంలో గట్టు తీవ్రంగా కోతకు గురైంది. అప్పట్లో కలెక్టర్‌, శ్రీకాకుళం శాసనసభ్యుడు ధర్మాన ప్రసాదరావు సమాలోచనలు జరిపి రాష్ట్ర నీటి పారుదలశాఖ ముఖ్య సలహాదారుడు రౌతు సత్యనారాయణను అమరావతి నుంచి ఇక్కడకు రప్పించి ఆయన సూచన మేరకు ఈ ప్రాంతంలో శాశ్వత ప్రాతిపదికన కాంక్రీటు రక్షణ గోడ నిర్మించాలని నిర్ణయించారు. నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన ఈ పనులకు ఆ శాఖ అధికారులు రూ.5.5 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేసి కలెక్టర్‌ ద్వారా ప్రభుత్వానికి నివేదించారు. ఇంతవరకు దాని గురించి స్పందన లేకపోవడం గమనార్హం.

నగరపాలక సంస్థపై రూ.1.2 కోట్ల భారం

రక్షణ గోడ పనులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయక పోవడంతో నగరపాలక సంస్థ తాత్కాలిక పనులు చేపట్టాల్సి వచ్చింది. అందులో భాగంగా రూ.1.2 కోట్ల మేర ఖర్చు చేసింది. బలగ ప్రధాన నీటి సరఫరా ప్రాంతంలో రూ.70 లక్షలు వరకు వెచ్చించి భవన నిర్మాణ వ్యర్థాలతో, మరో రూ.52 లక్షలతో కొత్తవంతెన ప్రాంతంలో ఇసుక బస్తాలతో తాత్కాలికంగా రక్షణ గోడ ఏర్పాటు చేశారు. ఇసుక బస్తాల రక్షణ గోడ శిథిలావస్థకు చేరుకుంది. దీంతో ఈ ఏడాది వరదలకు ఈ రక్షణ గోడ సైతం కొట్టుకు పోయే ప్రమాదం ఉందని నీటిపారుదల ఇంజినీరింగ్‌ నిపుణులు చెబుతున్నారు.

మారిన నది గమనం

మధ్యలో నిలిచిన పనులతో 40 శాతం మేర డైక్‌ శిథిలావస్థకు చేరుకుంది. రక్షణ గోడ పనులు పూర్తయితే తప్ప వీటిని పునరుద్ధరించే అవకాశం లేదు. బలగ ప్రధాన నీటి సరఫరా కేంద్రం వైపు నదికి అడ్డంగా నిర్మించిన డైక్‌తో ఫాజుల్‌బేగ్‌పేటలోని దత్తాత్రేయ గుడి వైపు నది గమనం మారి పోయింది. దీంతో డైక్‌కు లోపల వైపు ఇసుక మేటలు పేరుకుపోయాయి. ఫలితంగా నదిలో ఉన్న బలగ, ఆదివారంపేట ప్రధాన నీటి సరఫరా కేంద్రాల ఊట బావులకు పూర్తిస్థాయిలో నీరందని పరిస్థితి నెలకొంది.


పనులు పూర్తిచేస్తాం

మొదట రక్షణ గోడ నిర్మించాల్సిన అవసరం ఉంది. ఈ పనులు పూర్తయిన తరువాత అసంపూర్తిగా ఉన్న డైక్‌ నిర్మాణాన్ని చేపడతాం. త్వరితగతిన పనులు పూర్తిచేసి ప్రజల ఇబ్బందులు తీరుస్తాం.    
- పి.గంగాధరరావు, శ్రీకాకుళం నగరపాలక సంస్థ ఇంజినీర్‌


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని