logo

‘సన్న’గిల్లుతున్న ఆశలు..!

ఖరీఫ్‌లో ధాన్యం అమ్ముకోలేక అవస్థలు పడిన అన్నదాతలు.. ఇప్పుడు రబీలో సరైన ధర లేక సన్నరకాలను పండించినవారంతా తీవ్ర నష్టానికి గురవుతున్నారు. ఎండ తీవ్రత, సాగునీటి కొరత వంటి సమస్యలను అధిగమించి జిల్లాలో చాలా మంది సన్నధాన్యం పండించారు.

Published : 19 Apr 2024 04:45 IST

దళారుల చేతిలో మోసపోతున్న రైతులు

రహదారిపై ఆరబెట్టిన సన్నరకం ధాన్యం

న్యూస్‌టుడే, నరసన్నపేట: ఖరీఫ్‌లో ధాన్యం అమ్ముకోలేక అవస్థలు పడిన అన్నదాతలు.. ఇప్పుడు రబీలో సరైన ధర లేక సన్నరకాలను పండించినవారంతా తీవ్ర నష్టానికి గురవుతున్నారు. ఎండ తీవ్రత, సాగునీటి కొరత వంటి సమస్యలను అధిగమించి జిల్లాలో చాలా మంది సన్నధాన్యం పండించారు. ప్రస్తుతం రబీ వరి పైర్లు కోతల దశలో ఉండగా.. ధరలపై రైతులు పెట్టుకున్న ఆశలు నీరుగారాయి. ధర విషయంలో కోతలు పెడుతూ దళారులు మోసగిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు మద్దతు ధర కంటే కాస్త ఎక్కువకే కొనుగోలు చేస్తున్నా.. సన్నరకాల ధాన్యం గిరాకీ మేరకు ధరలు పలకడం లేదని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం జిల్లావ్యాప్తంగా రబీ కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడం, సన్నరకం ధాన్యంపై అధికారుల నిఘా లేకపోవడం దళారులకు కలిసొచ్చినట్లయింది.

 జిల్లావ్యాప్తంగా రబీలో 12,334 ఎకరాల్లో వరి సాగు చేయగా.. అందులో దాదాపు ఆర్‌ఎన్‌ఆర్‌, 1010 వంటి సన్నరకాలనే పండించారు. ప్రస్తుతం చాలా చోట్ల కోతలు చురుగ్గా సాగుతున్నాయి. ఎచ్చెర్ల, గార, జలుమూరు, టెక్కలి, నరసన్నపేట, తదితర మండలాల్లో 1,000 ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో పంట వేశారు. మొత్తం 29 మండలాల్లో వరి సాగు జరుగుతోంది. రబీలో దాదాపు 35 వేల టన్నుల ధాన్యం దిగుమతి అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఏటా రబీలో సాధారణ రకం ధాన్యం అమ్మేందుకు తంటాలు పడాల్సి వస్తుండటంతో పాటు విపణిలో సన్నరకాలకు గిరాకీ ఉన్నందున అన్నదాతలు రబీలో ఆర్‌ఎన్‌ఆర్‌ వంటి రకాల సాగుపై దృష్టి సారించారు. ఇప్పుడు వాటికి సరైన ధర లేక దిగులు చెందుతున్నారు.


రోజురోజుకూ క్షీణిస్తూ..

జిల్లాలో వరి సాగు ప్రారంభం నాటికి 80 కిలోల బస్తా ధర రూ.2,600 వరకు పలికేది. కోతలు ఆరంభమైన తరుణంలో వ్యాపారులు ఒక్కసారిగా ధరలు తగ్గించి.. రూ.2 వేల వంతున కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు సన్నాల రకం 80 కిలోల బస్తా ధర రూ.1,762 కాగా.. 83 కిలోల బస్తా ధాన్యాన్ని రూ.2 వేలకు కొంటున్నారు. మద్దతు ధర కంటే ఎక్కువకే పంట అమ్ముడుపోతున్నా.. అది కూడా రైతులకు గిట్టుబాటు కాదు. దీన్ని అవకాశంగా తీసుకుని దళారులు ధరలను ఇష్టారాజ్యంగా నిర్ణయిస్తున్నారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు ముగిసే వరకు సన్నరకాల ధరలు రోజురోజుకూ క్షీణిస్తున్నాయి. నెల రోజుల నుంచి  సన్నరకాలపై బస్తాకు రూ.600 వరకు తగ్గిపోయింది.


వ్యాపారులదే హవా..

నేను 7 ఎకరాల్లో ఆర్‌ఎన్‌ఆర్‌ వరి సాగు చేస్తున్నాను. ఇప్పటికే కొంత మేర కోత కోసి నూర్పిడి చేశాను. సన్నరకాల ధాన్యం ధరలను దళారులు ఇష్టారాజ్యంగా నిర్ణయిస్తున్నారు. ధరలపై ప్రభుత్వ ప్రమేయం లేకపోవడంతో వ్యాపారులదే హవాగా మారింది. తూకంలోనూ 3 కిలోల వంతున అదనంగా తీసుకుంటున్నారు.
- నేతింటి విశ్వేశ్వరరావు, నరసన్నపేట


కష్టపడినా ఫలితం లేదు..

ఎన్నో కష్టాలు పడి రబీలో వరి సాగు చేసినా ఫలితం లేదు. సాగునీరు అందుబాటులో లేక ఎక్కువ ఖర్చు చేసి దూరం నుంచి నీటిని రప్పించాం. తీరా పంట చేతికొచ్చిన తర్వాత ధరలు కుంగదీస్తున్నాయి. ప్రస్తుతం మా ఊరిలో 83 కిలోల ధాన్యం బస్తా రూ.1,950కు కొనుగోలు చేస్తున్నారు.

- పాగోటి అప్పలనాయుడు, కంబకాయ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని