logo

పీఠమెక్కారు.. పేదల పొట్టకొట్టారు..!

వైకాపా అన్న క్యాంటీన్లను మూసివేయడంతో పేదలు ఇబ్బందులు పడుతుండేవారు. వాటిని గుర్తించి జిల్లాలో పలువురు తెదేపా నేతలు స్వచ్ఛందంగా వారి ఆకలి తీరుస్తున్నారు

Updated : 19 Apr 2024 06:31 IST

 అన్న క్యాంటీన్ల ద్వారా రూ.5కే భోజనం

 అధికారంలోకి రాగానే ఎత్తేసిన వైకాపా ప్రభుత్వం

నిరుపేదల ఆకలి తీర్చిన అన్న క్యాంటీన్లపై జగనన్న అక్కసు చూపారు. అధికారంలోకి రాగానే బడుగుల కడుపునింపిన పథకాన్ని నిర్దయగా నిలిపేశారు. రూ.5 పేదల పొట్ట నింపిన కార్యక్రమానికి స్వస్తి పలికి కడుపు మంట చల్లార్చుకున్నారు. గద్దెనెక్కగానే నిత్యం వందలాది మందికి ఉపయోగపడిన అన్న క్యాంటీన్లను మూసేశారు. ఆ నిర్మాణాలను సైతం పలు చోట్ల నిరుపయోగంగా వదిలేశారు.

న్యూస్‌టుడే, శ్రీకాకుళం నగరం, ఇచ్ఛాపురం, పలాస, ఆమదాలవలస పట్టణం: తెదేపా హయాంలో జిల్లాలోని శ్రీకాకుళం నగరంలో 2, ఆమదాలవలస 1, కాశీబుగ్గలో 1 చొప్పున రూ.లక్షలు వెచ్చించి 2018లో అత్యాధునిక హంగులతో అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేశారు. ఆయా చోట్ల రూ.5కే ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నం, రాత్రి భోజనం పెట్టేవారు. నిరుపేదలతో పాటు సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఇవి ఎంతగానో ఉపయోగపడేవి. తక్కువ ధరకే శుచిగా.. రుచికరమైన ఆహారం అందించేవారు. 2019లో వైకాపా అధికారం వచ్చిన వెంటనే వాటిని మూసేయడంతో ఆ నిర్మాణాలు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారాయి. కొన్ని చోట్ల వేర్వేరు అవసరాల కోసం వినియోగించుకుంటున్నారు. అక్కడి సామగ్రిని సైతం వదిలేయడంతో ప్రజాధనం వృథాగా పోయింది. కనీసం పేరు మార్చి అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం కూడా చేయకుండా పేదలకు అన్యాయం చేశారు.


ఒకటి నిరుపయోగం.. మరొకటి సచివాలయం..

ఏడు రోడ్ల కూడలి వద్ద నిరుపయోగంగా అన్న క్యాంటీన్‌ భవనం

జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం నగరానికి సమీప ప్రాంతాల నుంచి నిత్యం వేల సంఖ్యలో ప్రజలు ఉపాధి, ఇతర వ్యక్తిగత పనుల నిమిత్తం వస్తుంటారు. శ్రీకాకుళం నగరంలో ఏడు రోడ్ల కూడలి, పాత బస్టాండ్‌ వద్ద చల్లా వీధిలో ఏర్పాటు చేసిన రెండు అన్న క్యాంటీన్లు వారికి ఎంతో ఉపయోగపడేవి. ఇస్కాన్‌ సంస్థ ద్వారా నిత్యం వందల సంఖ్యలో ప్రజలకు ఇక్కడ రూ.5కే భోజనం, అల్పాహారం పెట్టేవారు. వైకాపా సర్కారు వాటిని మూసివేయడంతో ఏడు రోడ్ల కూడలి వద్ద ఉన్న భవనాన్ని అధికార పార్టీకి చెందిన ఓ నాయకురాలి బంధువు హోటల్‌ పెట్టుకునేందుకు టెండరు విధానంలో కేటాయించారు. కొంత కాలం నడిపిన తర్వాత ఆ హోటల్‌ను మూసివేశారు. నగరపాలక సంస్థకు భవన లీజు డబ్బులు సైతం నేటికీ కొంత మేర చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం ఆ భవనం నిరుపయోగంగా ఉంది. చల్లావీధిలోని భవనాన్ని వార్డు సచివాలయంగా మార్చారు. అందులోని అన్న క్యాంటీన్‌ ఫర్నీచర్‌ను బలగ ప్రధాన నీటి సరఫరా కేంద్రం వద్ద ఉన్న ఓ గదిలో పడేశారు.


తెరుచుకోని తాళాలు

కాశీబుగ్గలో ప్రధాన రహదారిపై అన్న క్యాంటీన్‌ నడిచేది. అది నిత్యం సుమారు 500 మంది కడుపునింపేది. పలాస సమీప మండలాల నుంచి నిత్యం వివిధ పనులపై పేదలు, కార్మికులు వస్తుంటారు. వారికి ఈ క్యాంటీన్‌ ఎంతగానో ఉపయోగపడేది. జగన్‌ సర్కార్‌ మూసేయడంతో ప్రస్తుతం బయట హోటళ్లలో భోజనానికి రూ.60 నుంచి రూ.100 వరకు ఖర్చు పెట్టాల్సి వస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్న క్యాంటీన్‌ భవనాన్ని సైతం నిరుపయోగంగా వదిలేశారు. వేసిన తాళాలు తీసే ప్రయత్నం కూడా చేయలేదు.


అన్యాయంగా మూసేశారు..

అన్న క్యాంటీన్లలో పేదలు, మధ్యతరగతి ప్రజలకు రూ.5కే భోజనం పెట్టేవారు. వైకాపా అధికారంలోకి రాగానే అన్యాయంగా వాటిని మూసేయడం సరైన నిర్ణయం కాదు. వాటిని మళ్లీ అందుబాటులోకి తీసుకువస్తే ఎంతో మందికి మేలు జరుగుతుంది.

- కె.రాధిక, శివాజీనగర్‌, పలాస


అలాగే వదిలేశారు..

ఆమదాలవలస పట్టణంలో రైతు బజారు సమీపంలో అన్న క్యాంటీన్‌ నిర్వహించేవారు. ఆర్టీసీ కాంప్లెక్సు, రైతు బజారు, ఆటో, రిక్షా స్టాండుకు సమీపంలో ఉండటంతో ప్రతి రోజూ సుమారు 500 మందికిపైగా ప్రయాణికులు, కార్మికులు వివిధ సమయాల్లో ఆకలి తీర్చుకునేవారు. దాన్ని వైకాపా ప్రభుత్వం మూసివేసింది. ఆ నిర్మాణాన్ని సైతం నిరుపయోగంగా వదిలేసింది. శాసన సభాపతి తమ్మినేని సీతారాం అటు వైపు నుంచే ప్రయాణం సాగిస్తున్నా అయిదేళ్లలో ఒక్కసారి కూడా పేదలకు పట్టెడన్నం పెట్టే ఆలోచన చేయలేకపోయారని పట్టణవాసులు విమర్శిస్తున్నారు.


అక్కడే తినేవాళ్లం..

ఏటా ఏప్రిల్‌, మే నెలలో వేట నిషేధం కారణంగా మత్య్సకారులంతా ఇంటి వద్దనే ఉండిపోతాం. ఆ సమయంలో ఉపాధి లేక కుటుంబాన్ని నెట్టుకురావడం కష్టంగా ఉంటుంది. అన్న క్యాంటీన్‌ ఉన్నప్పుడు ఆ రెండు నెలలు అక్కడే తినేవాళ్లం. వైకాపా ప్రభుత్వం వాటిని మూసేసి.. మాలాంటి వాళ్ల పొట్ట కొట్టింది.  
- కె.నీలయ్య, మంచినీళ్లపేట, వజ్రపుకొత్తూరు మండలం


శిథిలావస్థకు భవనం

ఇచ్ఛాపురం పట్టణంలో గాంధీ పార్కు వద్ద తెదేపా హయాంలో అన్న క్యాంటీన్‌ నిర్మించారు. బల్లలు, ఇతర ఖరీదైన సామగ్రిని సైతం అప్పట్లోనే ప్రభుత్వం పంపింది. వివిధ కారణాల రీత్యా క్యాంటీన్‌ ప్రారంభానికి నోచుకోకపోవడంతో ఆ సామగ్రిని పురపాలక సంఘ కార్యాలయంలో పడేశారు. ప్రస్తుతం ఆ భవనం శిథిలావస్థకు చేరుకుంటోంది. పనికిరాని మొక్కలతో పరిసరాలు సైతం అధ్వానంగా మారాయి. తలుపులు, కిటికీలూ పాడైపోతున్నాయి.


నిరుపేదల ఆకలి తీరుస్తున్న తెదేపా నేతలు

శ్రీకాకుళం నగరంలో గొండు శంకర్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్‌

వైకాపా అన్న క్యాంటీన్లను మూసివేయడంతో పేదలు ఇబ్బందులు పడుతుండేవారు. వాటిని గుర్తించి జిల్లాలో పలువురు తెదేపా నేతలు స్వచ్ఛందంగా వారి ఆకలి తీరుస్తున్నారు. టెక్కలి నియోజకవర్గం కోటబొమ్మాళి మండలం కొత్తపేటలోని ఎన్టీఆర్‌ భవన్‌లో గతేడాది జూన్‌ నుంచి రూ.5కే కడుపునిండా భోజనం పెడుతున్నారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపు మేరకు ఈ క్యాంటీన్‌లో భోజనం పెట్టేందుకు ఎన్‌ఆర్‌ఐలతో, పార్టీ నాయకులు విరాళాలు అందిస్తూ భాగస్వాములవున్నారు. ఇక్కడ ప్రతిరోజూ 600 మందికి భోజనాలు పెడుతున్నారు.
శ్రీకాకుళం నగరంలో తెదేపా నియోజకవర్గ అభ్యర్థి గొండు శంకర్‌ ఆధ్వర్యంలో గతేడాది ఏప్రిల్‌ నుంచి పేదలకు ఉచితంగా భోజనం పెడుతున్నారు. సంచార వాహనాల ద్వారా నగరంలోని ప్రధాన కూడళ్లలో నిత్యం 500 మందికిపైగా పట్టెడన్నం పెడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని