logo

జగన్‌ రాజ్యంలో.. బస్సెక్కినా బాదుడే..!

ఆర్టీసీలో ప్రయాణం ‘సురక్షితం.. సుఖవంతం..’ ఇది ఒకప్పటి మాట. జగన్‌ జమానాలో అది ‘ప్రమాదకరం.. ఆర్థిక భారం..’గా మారిపోయింది. వైకాపా పాలనలో ప్రజల తప్పనిసరి అవసరాలను ఆదాయ వనరులుగా మార్చుకున్నారు.

Updated : 21 Apr 2024 08:02 IST

అయిదేళ్లలో మూడు సార్లు ఛార్జీలు పెంచిన వైకాపా ప్రభుత్వం

ఆర్టీసీలో ప్రయాణం ‘సురక్షితం.. సుఖవంతం..’ ఇది ఒకప్పటి మాట. జగన్‌ జమానాలో అది ‘ప్రమాదకరం.. ఆర్థిక భారం..’గా మారిపోయింది. వైకాపా పాలనలో ప్రజల తప్పనిసరి అవసరాలను ఆదాయ వనరులుగా మార్చుకున్నారు. పేద, మధ్యతరగతి ప్రజలు ప్రయాణ రథమైన ఆర్టీసీ బస్సులనూ వదల్లేదు. ఛార్జీలను మూడుసార్లు పెంచేశారు. పల్లెవెలుగు సర్వీసులతో పాటు ఎక్స్‌ప్రెస్‌, అల్ట్రా డీలక్స్‌ ఇలా అన్నింటా బాదేశారు. సామాన్యులకు తెలియకుండానే వారి జేబులకు చిల్లులు పెట్టారు. ఇంత ఆర్థిక భారం మోపినా కొత్త బస్సు ఒక్కటీ ఇవ్వలేదు. కాలంచెల్లిన డొక్కు బస్సులనే  తిప్పుతూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.

న్యూస్‌టుడే, అరసవల్లి: జిల్లాలో ఆర్టీసీ డిపోలు నాలుగు ఉన్నాయి. శ్రీకాకుళం ఒకటి, రెండుతో పాటు టెక్కలి, పలాస డిపోల పరిధిలో 329 బస్సులు ఉన్నాయి. వాటిలో సంస్థకు చెందినవి 220, అద్దె వాహనాలు 87, అదనంగా మరో 22 ఉన్నాయి. వాటిలో అధిక శాతం పల్లెవెలుగు బస్సులే. ఆయా రూట్లలో ప్రయాణించేవారిపై మూడు సార్లు ఛార్జీలు పెంచారు. దీంతో రోజువారీ కూలి పనులకు వెళ్లే వారికి వచ్చే కొద్దిపాటి ఆదాయంలో అధిక శాతం ప్రయాణాలకే వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొంది.

భారం మోపారిలా..

  • జగన్‌ అధికారం చేపట్టిన ఆరు నెలలకే ఇంధన ధరలు, బస్సుల విడిభాగాలు, టైర్ల రేట్లు పెరగడంతో పాటు సిబ్బంది వేతనాలు భారంగా మారాయని చెబుతూ 2019 డిసెంబరులో ఛార్జీలు పెంచారు.
  • డీజిల్‌ సెస్‌ పేరుతో 2022లో ఏప్రిల్‌ 14వ తేదీన మరోసారి ఆర్థిక భారం మోపారు. 20 కిలోమీటర్లకు రూ.5, 60 కి.మీ.కు రూ.10, 90 కి.మీలకు రూ.15 చొప్పున పెంచుతూ ఉత్తర్వులిచ్చారు. ఉదాహరణకు ఛార్జీ రూ.27, రూ.29గా ఉంటే చిల్లర సమస్యను సాకుగా చూపి దాన్ని రూ.30గా చేశారు.
  • అదే సంవత్సరం జులైలో మూడో సారి సామాన్యుల నడ్డి విరిచింది. 30 కిలోమీటర్లకు రూ.5, 70 కి.మీ.కు రూ.10, 70 కి.మీ నుంచి 500 కి.మీ. వరకు రూ.20 చొప్పున బాదేశారు.

ఈ నెల 12న పలాసలో ఓ ఆర్టీసీ బస్సు కాంప్లెక్స్‌ దాటక ముందే మొరాయించింది. ఎంత ప్రయత్నించినా ఇంజిన్‌ స్టార్ట్‌ కాకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఇలా అయిదేళ్లలో జిల్లాలో అనేక చోట్ల బస్సులు మొరాయించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.


ఒడిశాలో రూ.10కే ప్రయాణం..
- భీమారావు, దేవళభద్ర, నందిగాం మండలం

నందిగాం మండల కేంద్రం నుంచి మా ఊరికి ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తే రూ.10 చెల్లించేవాళ్లం. ప్రస్తుతం మేం రూ.20 చెల్లిస్తున్నాం. పిడిమందస వెళ్లాలంటే ఒక్కటే బస్సు ఉండటంతో గంటసేపు నుంచి వేచి చూస్తున్నాం. వేరే బస్సులో వెళ్తే కొర్రాయిగేటు కూడలి వద్ద దిగి నడుచుకుంటూ వెళ్లాల్సి వస్తోంది. ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నా సుఖం ఉండట్లేదు. ఒడిశా ప్రభుత్వం మాదిరిగా రూ.10కే ప్రయాణం సౌకర్యం కల్పిస్తే బాగుంటుంది.


రూ.40 పెంచేశారు...
- నాగరాజు, శ్రీకాకుళం

నేను రెండు, మూడు రోజులకొకసారి విశాఖపట్నం బస్సులోనే వెళ్లివస్తుంటాను. అయిదేళ్లలో ఛార్జీలు బాగా పెరిగాయి. ఒకప్పుడు అల్ట్రాడీలక్స్‌ ఛార్జీ రూ.135 ఉండేది. అది ఇప్పుడు రూ.175 అయింది. రూ.40 పెంచేశారు. అడిగితే టోల్‌, సెస్‌ అంటూ ఏవేవో లెక్కలు చెబుతున్నారు.


సామాన్యుల పరిస్థితి ఏంటి?
- జె.రామచంద్రరావు, గొర్రిబంద, సారవకోట మండలం

ఆర్టీసీ ఛార్జీలను విపరీతంగా పెంచేశారు. సారవకోట నుంచి నరసన్నపేట వెళ్లేందుకు ఒకప్పుడు రూ.20 ఛార్జీ ఉండేది. పలుమార్లు పెరగడంతో ఇప్పుడు రూ.35 తీసుకుంటున్నారు. ఇలా ఇష్టానుసారం పెంచుకుంటూ పోతే సామాన్య ప్రయాణికుల పరిస్థితి ఏంటి?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని