logo

అయ్యో.. అన్నదాత నమ్మి మోసపోయావా..!

పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లో సాగునీటి వనరులు పుష్కలంగా ఉన్నా వైకాపా ప్రభుత్వం అన్నదాతల నడ్డివిరిచింది. మహేంద్రతనయ, బాహుదా నదులపై నిర్మించిన ప్రాజెక్టులతో పాటు ఇతర చిన్ననీటి వనరులు రూపురేఖలు మారిపోతున్న తరుణంలోనే చక్కదిద్దాల్సిన జగన్‌ సర్కార్‌ విస్మరించడంతో సాగుభూమి

Published : 24 Apr 2024 05:01 IST

నీటి వనరులు ఉన్నా.. వ్యవసాయానికి దెబ్బ
వైకాపా ఐదేళ్ల పాలనలో తగ్గిన సాగు విస్తీర్ణం

పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లో సాగునీటి వనరులు పుష్కలంగా ఉన్నా వైకాపా ప్రభుత్వం అన్నదాతల నడ్డివిరిచింది. మహేంద్రతనయ, బాహుదా నదులపై నిర్మించిన ప్రాజెక్టులతో పాటు ఇతర చిన్ననీటి వనరులు రూపురేఖలు మారిపోతున్న తరుణంలోనే చక్కదిద్దాల్సిన జగన్‌ సర్కార్‌ విస్మరించడంతో సాగుభూమి విస్తీర్ణం తగ్గిపోయింది. అన్నొస్తే మేలు జరుగుతుందనుకున్న కర్షకుడికి శాపంగా మారింది. సాగునీటి కోసం సమరం చేయాల్సిన దుస్థితి నెలకొంది.

న్యూస్‌టుడే, సోంపేట, పలాస, పలాస గ్రామీణం, మందస  


పైడిగాం వద్ద మహేంద్రతనయ పరిస్థితి ఇలా...

జగనన్న ఐదేళ్ల పాలనలో సోంపేట, కంచిలి, మందస మండలాల సాగు భూములకు మహేంద్రతనయ నదిపై నిర్మించిన ప్రాజెక్టులు నామమాత్రంగా మారాయి. పైడిగాం ప్రాజెక్టు ఆనకట్ట ద్వారా శివారు భూముల వరకు సాగునీటిని అందించే అంశం హామీలకే పరిమితమైంది. నదిలో నిర్మించిన పొత్తంగి, ఏటిబట్టి, బారువ, మూలపొలం గ్రొయిన్‌ల పనితీరు క్షీణించింది. మహేంద్రతనయకు 12 వేలు, బాహుదా నదికి 58 వేలకు పైగా  క్యూసెక్కుల నీరు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ నిర్వహణ లేకపోవడంతో వరదనీరు సముద్రం పాలవుతుంది.

మైదానాలుగా మారాయి

సోంపేట మండలంలో బెంకిలి, రుషికుద్ద, కంచిలి మండలంలో కుత్తుమ, ఇచ్ఛాపురం మండలంలో ఈదుపురం ఎత్తిపోతల పథకాలు తిత్లీ తుపానుకు ధ్వంసమయ్యాయి. మోటార్లు, ఇతర మరమ్మతుల కోసం ఒక్కో పథకానికి రూ.నాలుగైదు లక్షలు వ్యయం చేసి ఉంటే 2 వేల ఎకరాలకు పైగా భూములకు సాగునీరు అందేది. కానీ ప్రభుత్వం ఆసక్తి చూపలేదు. గంగాసాగరం మినీరిజర్వాయర్‌ పనులు నిలిచి నీటికి ఇబ్బందులు నెలకొన్నాయి. కంచిలి మండలంలో ముకుందసాగరం, నారాయణసాగరం, సుంకిలి సాగరంతో పాటు మరో నాలుగు సాగరాలు అభివృద్ధికి నోచుకోక మైదానాలుగా మారుతున్నాయి.

నీరు వృథా

మందస మండల పరిధిలో వ్యవసాయ విస్తీర్ణం 13,600 ఎకరాలు.  కళింగదళ్‌, డబార్శింగి, దామోదర్‌ సాగర్‌, గోపాలసాగర్‌ జలాశయాలతో పాటు సునాముధి గెడ్డ పరిధిలో పదివేలకు పైగా ఎకరాలు సాగవుతుంది. గత ఐదేళ్లలో వీటికి మరమ్మతులు లేవు. కళింగదళ్‌ పరుపు, మదుములకు రంధ్రాలు పడి సాగునీరు వృథా అవుతోంది. భూములకు నీరందని పరిస్థితి నెలకొంది.

 6 వేల ఎకరాలకు అన్యాయం

పలాస మండలం టెక్కలిపట్నం సమీపంలో వంశధార కాలువ దుస్థితి

పలాస మండలంలో మొత్తం ఆయకట్టు సుమారు 14 వేల ఎకరాలుండగా.. సాగు నీరు లేకపోవడంతో ఈ ఏడాది సుమారు ఆరు వేల ఎకరాల్లో రైతులు ఎలాంటి పంటలు పండించలేకపోయారు. గతంలో ప్రతి ఏడాది వరి తరువాత పెసర, మినుము పంటలు పండించుకునేవారు. నాలుగేళ్లుగా వంశధార కాలువ ద్వారా సాగునీరు రాకపోవడంతో సాగు చేయలేకపోయారు. వరి పండించడానికే నీరు లేకపోతే ఇంకా పైరు పంటలు ఏం పండిస్తామని, ఈ ఏడాదైనా వంశధార కాలువ ద్వారా సాగునీరు అందించాలని మోదుగులపుట్టికి చెందిన రైతు అవుగాన షణ్ముఖరావు తెలిపారు.

నష్టపోతున్నాం

బెంకిలి ఎత్తిపోతల పథకం మూలన పడింది. పైడిగాం ప్రాజెక్టు ద్వారా శివారు భూములకు నీరందే పరిస్థితి ఎప్పటి నుంచో లేదు. దీంతో ఖరీప్‌లో కూడా పంటలు వేయలేని పరిస్థితి ఏర్పడింది. వరిసాగు ద్వారా ఏటా నష్టపోతున్నాం. 

సింహాచలం, కౌలురైతు, బెంకిలి.

రెండేళ్లుగా ఇబ్బందులు

వంశధార జలాల మళ్లింపు కోసం గత ప్రభుత్వం చేపట్టిన చర్యలు ముందుకు సాగకపోవడం దురదృష్టకరం. వ్యవసాయం ఆధారంగానే ఉమ్మడి కుటుంబం బతుకుతున్నాం. 

దామోదరం, రైతు ప్రతినిధి, మండపల్లి

హామీలు తప్ప పనులు జరగలేదు

బాహుదానదికి వర్షాకాలంలో పెద్ద ఎత్తున వరదనీరు చేరినా పక్కనే ఉన్న పంటపొలాలకు మాత్రం అందే పరిస్థితి లేదు ఛానెల్స్‌ వ్యవస్థ పునరుద్ధరణ హామీలు తప్పిస్తే ఇప్పటి వరకు పనులు చేపట్టలేదు. ఖరీఫ్‌లో సాగు చేయలేని పరిస్థితి తలెత్తింది.

డి.రాజయ్య, రైతు, కొఠారి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు