logo

సిక్కోలు గడ్డన.. జగనన్న వంచన..!

మీ కష్టాలు చూశాను.. ఒక్క ఏడాది ఓపిక పట్టండి.. మన ప్రభుత్వం వస్తుంది.. సమస్యలన్నీ పరిష్కరిస్తాను.’ అన్న జగన్‌ మాటలు నమ్మిన జనం ఒక్క అవకాశం ఇచ్చారు.

Updated : 24 Apr 2024 06:07 IST

హామీలను తుంగలో తొక్కిన సీఎం
అయిదేళ్లలో జిల్లాకు చేసింది శూన్యం

‘మీ కష్టాలు చూశాను.. ఒక్క ఏడాది ఓపిక పట్టండి.. మన ప్రభుత్వం వస్తుంది.. సమస్యలన్నీ పరిష్కరిస్తాను.’ అన్న జగన్‌ మాటలు నమ్మిన జనం ఒక్క అవకాశం ఇచ్చారు. అధికారంలోకి రాగానే అన్న ఇచ్చిన హామీలన్నీ మరిచిపోయారు.. పాదయాత్రలో, ముఖ్యమంత్రిగా జిల్లాకు వచ్చినప్పుడు అభివృద్ధికి చిరునామాగా మారుస్తానని గొప్పలకు పోయారు. ఇక్కడి నేతలు అడిగిందే తడవుగా రూ.కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటనలు చేశారు.. వైకాపా అధికారంలోకి వచ్చి అయిదేళ్ల గడిచినా పూర్తిస్థాయిలో నిధులూ ఇవ్వలేదు.. ఏ ఒక్క పనీ పూర్తి చేయలేకపోయారు.. అన్ని వర్గాల ప్రజలకు మొండిచేయి చూపిన ఘనత సొంతం చేసుకున్నారు.. ఎన్నికల వేళ మరోసారి మభ్యపెట్టేందుకు నేడు పర్యటిస్తున్నారని సిక్కోలు వాసులు విమర్శిస్తున్నారు.

ఈనాడు డిజిటల్‌ శ్రీకాకుళం, న్యూస్‌టుడే, టెక్కలి


సాగునీటికి సెలవిచ్చేశారు..

హామీ: ‘వంశధార కరకట్టల నిర్మాణం పూర్తి చేస్తాం. కాలువలను ఆధునికీకరిస్తాం. ఆఫ్‌షోర్‌ పూర్తి చేస్తాం. రంగసాగరం ఎత్తిపోతల పథకం నిర్మిస్తాం.’ 2022 జూన్‌ 27న జిల్లా కేంద్రంలో నిర్వహించిన సభలో చేసిన ప్రకటన ఇది.

ప్రస్తుతం : వంశధార స్టేజ్‌-2 ఫేజ్‌-2 ప్రాజెక్టులకు తెదేపా హయాంలోనే భూసేకరణకు అవసరమైన రూ.422 కోట్లు మంజూరు చేశారు. 85.5 శాతం పనులు పూర్తి చేసి ట్రయల్‌రన్‌ నిర్వహించారు. మిగిలిన పనులను వైకాపా ప్రభుత్వం పూర్తి చేయలేకపోయింది. కరకట్ట పనులను పూర్తిగా గాలికొదిలేసింది. రూ.వెయ్యి కోట్లతో వంశధార ఎడమ ప్రధాన కాలువ ఆధునికీకరణకు అధికారులు పంపిన ప్రతిపాదనలు ఎక్కడున్నాయో తెలియని పరిస్థితి. గత ప్రభుత్వ హయాంలో రూ.400 కోట్లు మంజూరు చేసి ఆఫ్‌షోర్‌ ప్రాజెక్టుకు భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌ పనులు పూర్తి చేశారు. ప్రాజెక్టు పనులు కొంతమేర జరిగాయి. ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత మృత ప్రాజెక్టుల జాబితాలో చేర్చి ఐదేళ్ల పాటు ఎలాంటి పనులు చేయకూడదని జీవో విడుదల చేసింది. రాజకీయ లబ్ధి కోసం ఎన్నికలకు ముందు టెక్కలి, పలాస నియోజకవర్గాల్లో మరలా పనులు ప్రారంభిస్తున్నట్లు నాటకానికి తెర లేపారు. రంగసాగరం ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయలేదు. వంశధార ఎడమ ప్రధాన కాలువపై పదుల సంఖ్యలో ఎత్తిపోతల పథకాలకు నీరు నిలిపివేసి ఆయకట్టును ప్రశ్నార్థకంగా మార్చేశారు.

మణిహారానికి మొండిచేయి..

హామీ: ‘మంత్రి ధర్మాన ప్రసాదరావు కోరిక మేరకు శ్రీకాకుళం నగరంలోని కోడి రామ్మూర్తి మైదానం పునర్నిర్మాణానికి రూ.10 కోట్లు మంజూరు చేస్తున్నా.’ అని 2022 జూన్‌ 27న అమ్మఒడి మూడో విడత నగదు బదిలీ సందర్భంగా జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రకటించారు.
ప్రస్తుత పరిస్థితి: ఆయన చెప్పిన మాట అమలుకు నోచుకోలేదు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఇండోర్‌ స్టేడియం పనులు సైతం పూర్తి చేయలేకపోయారు. తాజాగా రన్నింగ్‌ ట్రాక్‌ కోసం మట్టి వేయడం తప్ప అభివృద్ధి చేయలేదు. ‘ఆడుదాం ఆంధ్ర’ ఆటల పోటీలు సైతం కనీస వసతులు లేని ప్రాంతాల్లో నిర్వహించారు. ఒలింపిక్‌ పతక విజేతను అందించిన జిల్లాకు క్రీడా ప్రాంగణ నిర్మాణానికి అవసరమైన నిధుల మంజూరు చేయడానికి జగన్‌కు చేతులు రాలేదు.

గంగపుత్రులకు పంగనామాలు

హామీ: బుడగట్లపాలెంలో ఫిషింగ్‌ హార్బర్‌, మంచినీళ్లపేటలో జెట్టీ ఏర్పాటు

ప్రస్తుత పరిస్థితి: ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి జిల్లాకు వచ్చిన జగన్‌ హార్బర్‌, జెట్టీ నిర్మాణానికి హామీ ఇచ్చారు. మత్స్యకార సామాజికవర్గానికి చెందిన రాష్ట్ర మంత్రి అప్పలరాజు ప్రాతినిధ్యం వహిస్తున్న పలాస నియోజకవర్గం పరిధిలోకి వచ్చే మంచినీళ్లపేట హార్బర్‌కు, జెట్టీ నిర్మాణానికి శంకుస్థాపన చేసినా పనులు మాత్రం ముందుకు సాగలేదు. ప్రహరీ కట్టి వదిలేశారు. గతేడాది ఏప్రిల్‌లో మూలపేట పోర్టు పనుల శంకుస్థాపనకు వచ్చిన జగన్‌ బుడగట్లపాలెం హార్బరు నిర్మాణానికి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఎన్నికల వేళ హడావుడిగా పనులు చేపట్టినా ఎప్పటికి పూర్తవుతాయో తెలియదు.    

పింఛను ఎక్కడా.. ?

ప్రస్తుత పరిస్థితి: సీరం క్రియేటినిన్‌ ఐదు పాయింట్లు ఉన్న కిడ్నీ రోగులకు రూ.5 వేలు పింఛను ఇస్తామన్న ముఖ్యమంత్రి హామీ నామమాత్రంగానే అమలవుతోంది. వాస్తవంగా జిల్లాలో దాదాపు పదివేల మంది వరకు ఈ కేటగిరీలో రోగులు ఉన్నారు. కేవలం 1,500 మంది లోపు మాత్రమే ఈ పింఛను అందుకుంటున్నారు. సవాలక్ష నిబంధనలతో పాటు వీటికి సంబంధించి అన్ని పరీక్షలు జిల్లా కేంద్రంలో చేసుకోవాలని చెప్పడంతో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఈ పింఛను కొంతమందికే పరిమితమైంది.

రహదారిని గాలికొదిలేశారు..

హామీ: ‘శ్రీకాకుళం-ఆమదాలవలస రహదారి నిర్మాణానికి అదనంగా రూ.18 కోట్లు మంజూరు చేస్తాం.’ అని 2022 జూన్‌ 27న అమ్మఒడి మూడో విడత నగదు బదిలీ సందర్భంగా జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రకటించారు.

ప్రస్తుత పరిస్థితి: శ్రీకాకుళం-ఆమదాలవలస ప్రధాన రహదారి పనులు నిలిచి ఏళ్లు గడిచాయి. దారంతా గుంతలతో ప్రమాదకరంగా మారి ఐదేళ్లలో 24 మంది మృత్యువాత పడ్డారు. 81 మంది క్షతగాత్రులయ్యారు. ఒప్పందం ప్రకారం ఈ రహదారిని 2021 డిసెంబరు నాటికి పూర్తి చేయాలి. రూ.14 కోట్ల వరకు బకాయిల కారణంగా పనులు నిలిచిపోయాయి. ఆయా నియోజకవర్గాలకు సభాపతి, రెవెన్యూ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నా కొలిక్కి తీసుకురాలేకపోయారు. ఫలితంగా రాకపోకల సమయంలో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు.  

రూ.10 కోట్లన్నారు.. రూపాయి ఇవ్వలేదు..  

హామీ: నరసన్నపేట ప్రధాన రహదారి ఆధునికీకరణకు ముఖ్యమంత్రి జగన్‌ రూ.10 కోట్లు విడుదల చేస్తున్నట్లు 2022 నవంబరు 23న నరసన్నపేటలో జరిగిన సభలో ప్రకటించారు.
ప్రస్తుత పరిస్థితి: ఇప్పటి వరకు రూపాయి కూడా నిధులు విడుదల చేయలేదు. దీంతో విస్తరణ, ఆధునికీకరణ మధ్యలోనే నిలిచిపోయింది.

ఉద్యమానికి నిలువెత్తు మోసం

హామీ: సంతబొమ్మాళి మండలం వడ్డితాండ్రలో మత్స్యకారులు 2010 నుంచి థర్మల్‌ ప్లాంట్‌ నిర్మాణానికి వ్యతిరేకంగా నిరసన దీక్ష నిర్వహిస్తున్నారు. పాదయాత్రలో శిబిరాన్ని సందర్శించిన జగన్‌ ప్లాంట్‌ నిర్మాణానికి సంబంధించిన 1108 జీవో రద్దుకు హామీ ఇచ్చారు.

ప్రస్తుత పరిస్థితి: జగన్‌ మాటను నమ్మిన మత్స్యకారులు తమ ఉద్యమానికి న్యాయం జరుగుతుందనుకున్నారు. ఆయన ప్రభుత్వం ఏర్పడి ఐదేళ్లయినా 1108 జీవో రద్దు కాలేదు. ఆందోళన కారులపై నమోదైన కేసులు మాఫీకాలేదు.

పరిశ్రమలు తెరుస్తామని మాయ..

హామీ: ఆమదాలవలలోని చక్కెర కర్మాగారాన్ని, టెక్కలి మండలం రావివలసలోని ఫెర్రో ఎల్లాయిస్‌ పరిశ్రమను తెరిపిస్తాం. ఉద్యోగాల్లో 75 శాతం స్థానికులకే ఇప్పిస్తాం. గ్రానెట్‌ పరిశ్రమలను ఆదుకుంటాం.

ప్రస్తుత పరిస్థితి: ఆమదాలవలస చక్కెర కర్మాగారం పరిశీలనకు త్రిసభ్య కమిటీని నియమించారు. కమిటీ పరిశీలన అనంతరం కర్మాగారం స్థలాన్ని అమ్మకానికి పెడుతున్నారన్న ప్రచారం జరిగింది. రైతులు తీవ్రంగా వ్యతిరేకించడంతో ఆ వ్యవహారం అక్కడికి ఆగిపోయింది. బీ టెక్కలి మండలం రావివలసలో మెట్కోర్‌ ఫెర్రో ఎల్లాయిస్‌ పరిశ్రమను తెరిపిస్తామని పాదయాత్రలో హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడ్డాక న్యాయస్థానం ద్వారా వేరే యాజమాన్యం పరిశ్రమను ప్రారంభించింది. కొన్ని రోజులు నడిపాక మూసేశారు.బీ జిల్లాలో గ్రానైట్‌ పరిశ్రమలను ఆదుకుంటానన్న జగన్‌ అధికారంలోకి వచ్చాక పన్నుల భారం పెంచారు. ప్రైవేటు సంస్థకు క్వారీల పర్యవేక్షణ బాధ్యత అప్పగించడంతో నిర్వహణ తడిసిమోపెడవుతోందని పరిశ్రమలను సైతం మూసివేస్తున్నారు. ఉద్యోగాలే లేకపోతే అందులో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకు ఎప్పుడిస్తారని యువత నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

పరిశోధనలు లేని కిడ్నీ కేంద్రం

హామీ: కిడ్నీ బాధితులకు పలాసలో 200 పడకలతో పరిశోధన కేంద్రం నిర్మిస్తాం. ఇక్కడే పరిశోధనలు జరిగేలా చర్యలు తీసుకుంటాం. 2019 సెప్టెంబరు 6న పలాసలో ఉద్దానం తాగునీటి ప్రాజెక్టు శంకుస్థాపన సందర్భంగా హామీ.

ప్రస్తుత పరిస్థితి: ఐదేళ్లలో ఆసుపత్రి భవనాన్ని నిర్మించారు. పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన డయాలసిస్‌ కేంద్రాన్ని నూతన భవనంలోకి తరలించి డయాలసిస్‌ చేస్తున్నారు. ఒక నెఫ్రాలజిస్ట్‌ను నియమించారు. కిడ్నీ వ్యాధిపై పరిశోధనలు చేసే నిపుణులు, సూపర్‌ స్పెషాలిటీ వైద్యులను నియమించలేదు. ఆర్‌ఎంవోగా ఉన్న వైద్యాధికారి స్థానికంగా ప్రైవేటు ప్రాక్టీసుకే పరిమితమయ్యారు. కిడ్నీ పరిశోధన కేంద్రం కేవలం డయాలసిస్‌ కేంద్రంగా మిగిలిపోయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు