logo

జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు

జిల్లాలో ముఖ్యమంత్రి జగన్‌ బుధవారం ‘మేమంతా సిద్ధం’ పేరిట నిర్వహించిన బస్సు యాత్ర జనాలకు చుక్కలు చూపించింది.

Updated : 25 Apr 2024 07:03 IST

బస్సు యాత్రకు ఆదరణ కరవు
అడుగడుగునా ఆంక్షలతో తప్పని అవస్థలు

ఈనాడు డిజిటల్‌, శ్రీకాకుళం, టెక్కలి, శ్రీకాకుళం అర్బన్‌, పలాస గ్రామీణం, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి, నరసన్నపేట: జిల్లాలో ముఖ్యమంత్రి జగన్‌ బుధవారం ‘మేమంతా సిద్ధం’ పేరిట నిర్వహించిన బస్సు యాత్ర జనాలకు చుక్కలు చూపించింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ ఆంక్షలతో ప్రయాణికులు విసిగిపోయారు. బస్సులో నుంచే సీఎం జగన్‌ నమస్కారం పెడుతూ.. నవ్వులు చిందిస్తూ ముందుకుసాగారు.

దాదాపు రెండున్నర గంటల పాటు జాతీయ రహదారిపై నిలిచిన వాహనాలు

ఆయన కోసం ఎంతో మంది గంటల కొద్దీ మండుటెండలో నిరీక్షించలేక అల్లాడిపోయారు. టెక్కలి వద్ద అక్కవరం సమీపంలో సభ జరిగింది. మధ్యాహ్న భోజన విడిది పరశురాంపురం కూడలి నుంచి టెక్కలి కూడలి వరకు పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పోలీసులు బారికేడ్లు పెట్టి వాహనాల రాకపోకలను నియంత్రించారు. జాతీయ రహదారిపై గంటల కొద్దీ ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. దూర ప్రాంతాలకు వెళ్లాల్సినవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బహిరంగ సభకు జనాన్ని తరలించిన బస్సులను రోడ్డుపై నిలిపివేయడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొత్తూరు, హిరమండలం, మందస, ఇచ్ఛాపురం నుంచి తరలించిన మహిళలు, వృద్ధులు సామాజిక పింఛన్ల లబ్ధిదారుల్లో కొందరు బస్సులకే పరిమితమయ్యారు.

జాతీయ రహదారిపై నిలిపిన ఆర్టీసీ బస్సులు

పోలీసులు ఎక్కువ.. ప్రజలు తక్కువ..

శ్రీకాకుళం: పెద్దపాడు వద్ద జాతీయ రహదారిపై అడ్డంగా తాడు కట్టి వాహనాలను నిలిపివేసిన పోలీసులు

బస్సు యాత్రకు జనాదరణ కరవైంది. శ్రీకాకుళం నుంచి అక్కవరం వరకు రహదారి పొడవునా కార్యకర్తలు, నాయకులు జగన్‌కు పెద్ద ఎత్తున స్వాగతం పలకాలని వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేలు పిలుపునిచ్చినా శ్రేణులు పట్టించుకోలేదు. ఫలితంగా రోడ్డుపై ప్రజల కంటే పోలీసులే ఎక్కువ మంది కనిపించారు. మంత్రి ధర్మాన ఇలాకాలోని చాపురం, పాత్రునివలస, పెద్దపాడు ప్రాంతాల్లో కార్యకర్తల జాడే కానరాలేదు. రోడ్లపై కార్యకర్తల సందడి తగ్గడంతో యాత్ర బోసిపోయింది.

కోటబొమ్మాళి సమీపంలో రహదారికి అడ్డంగా నిలిపిన పోలీసు జీపు

ముందే వెనుదిరిగారు..

ముఖ్యమంత్రి ప్రసంగిస్తుండగా వెనుదిరుగుతున్న జనం

ఎండవేడి తాళలేక సభ ప్రారంభానికి గంట ముందే చాలా మంది వెనుదిరిగారు. కొందరు సీఎం ప్రసంగిస్తున్న సమయంలో జారుకున్నారు. టెక్కలికి చెందిన మహిళలు వారికి ఇచ్చిన కూపన్లు పట్టుకుని వెనక్కి వెళ్లారు. కొందరు మందుబాబులు మద్యం మత్తులో తూలుతూ పడి ఉండటం కనిపించింది. సభ ప్రారంభమయ్యే సమయానికి ఈదురు గాలులు వీయడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఓవైపు జీఎన్‌ పేట వద్ద.. మరోవైపు టెక్కలి జగతిమెట్ట కూడలి వద్ద వాహనాలను నిలిపివేశారు. జనాన్ని తరలించిన బస్సులను ఐదు కిలోమీటర్ల ముందే నిలిపివేయడంతో ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారు సభకు చేరుకోలేకపోయారు. వారంతా బస్సుల్లోనే ఉండిపోయి వెనుదిరిగారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని