logo

పట్టణంలో దాహం కేకలు

ఇచ్ఛాపురం పురపాలకసంఘ పరిధిలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. నాలుగు ట్యాంకర్లతో నీరు అవసరమైన చోటుకు తరలించాల్సిన అధికారులు రెండింటితోనే సరిపెడుతున్నారు.

Published : 21 May 2024 03:24 IST

అంతంతమాత్రంగా నీటి సరఫరా 
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు 
న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం

చ్ఛాపురం పురపాలకసంఘ పరిధిలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. నాలుగు ట్యాంకర్లతో నీరు అవసరమైన చోటుకు తరలించాల్సిన అధికారులు రెండింటితోనే సరిపెడుతున్నారు. దీంతో సరఫరా చేస్తున్న నీరు చాలక, నీటి వనరులు అడుగంటి ప్రజలు అల్లాడుతున్నారు. నీటి డబ్బాలు కొనుగోలు చేసుకుంటున్నారు. వేసవి దృష్ట్యా పట్టణంలో బాటసారుల కోసం రెండు చలివేంద్రాలకు రూ.70వేలు వెచ్చిస్తున్న పురపాలకసంఘం, పన్నులు చెల్లించే ప్రజల అవస్థలను పట్టించుకోవడం లేదని, ఎన్నికల నెపంతో అటు పాలకులు, ఇటు అధికారులు తప్పించుకుంటున్నారని సర్వత్రా ఆవేదన వ్యక్తం అవుతోంది.

రోజుకు 100 లీటర్ల నీరు ఇవ్వాలి

సుమారు 45 వేల జనాభా కలిగిన పురపాలకసంఘంలో ప్రతి వ్యక్తికి రోజుకు వంద లీటర్ల నీరు అవసరం. కానీ 40 లీటర్లకు మించి ఇవ్వడం లేదు. అడిగితే సరిపడా ట్యాంకర్లు లేవని, నీటి లభ్యత తక్కువగా ఉందని అధికారులు కారణాలు చెబుతున్నారు. పలువురు దాతలు ప్రజా శ్రేయస్సు కోరి సొంత డబ్బులతో ట్యాంకరు అందజేసినా.. వినియోగించకపోవడంతో మూలకు చేరి నిరుపయోగంగా మారింది.


చాలా  ఇబ్బందిగా ఉంది 

- జె.సంతోష్, ఇచ్ఛాపురం

వేసవి నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు ప్రజలు ఎక్కువగా లాలాపేట బావికి వచ్చి, మంచినీటిని తీసుకువెళ్తుండేవారు. ఈ ఏడాది ఇది కూడా ఎండిపోవడంతో, లాలాపేట ప్రాంతీయులు కూడా దూరప్రాంతాలకు వెళ్లి నీరు తెచ్చుకోవలసి వస్తోంది. ట్యాంకరు రావడం లేదు.  


నీటి డబ్బా కొనుగోలు చేస్తున్నాం 

- రవిశంకర్‌ మహాపాత్ర్, ఇచ్ఛాపురం 

కుళాయినీరు సక్రమంగా రాకపోవడంతో నీటివిక్రయ కేంద్రాల నుంచి నీటి డబ్బా కొనుగోలు చేస్తున్నాం. గతంలో వేసవి తీవ్రత రోజుల్లో రోజు విడిచి రోజు నీరు కుళాయిల ద్వారా ఇచ్చేవారు. ఇప్పుడు అలా ఇవ్వడం లేదు. 


ఆ ప్రాంతాలకు ప్రాధాన్యం 

- నల్లి రమేష్, పుర కమిషనర్‌ 

ప్రస్తుతం 5 వేల లీటర్ల ట్యాంకరుతో 1, 2, 3 వార్డులకు, 3 వేల లీటర్ల ట్యాంకరుతో పట్టణ పరిధిలో నీరు అందిస్తున్నాం. ప్రస్తుతం పట్టణానికి, రత్తకన్న ప్రాంతాలకు కుళాయి నీరు సరఫరా జరుగుతోంది. నీరు తక్కువగా వచ్చే ప్రాంతాలకు ప్రాధాన్యత ఇస్తున్నాం    

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని