logo

ఆశలు నీరుగార్చేశారు..!

రైతు ప్రభుత్వమని చెప్పుకోవడం తప్ప, అన్నదాతల మేలు కోసం ఒరగబెట్టిందేమీ లేదనేందుకు నారాయణపురం కుడి కాలువ పరిస్థితి చూస్తే ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

Published : 21 May 2024 03:29 IST

అటకెక్కిన నారాయణపురం కాలువ ఆధునికీకరణ
న్యూస్‌టుడే, ఎచ్చెర్ల, పొందూరు  

రైతు ప్రభుత్వమని చెప్పుకోవడం తప్ప, అన్నదాతల మేలు కోసం ఒరగబెట్టిందేమీ లేదనేందుకు నారాయణపురం కుడి కాలువ పరిస్థితి చూస్తే ఇట్టే అర్థం చేసుకోవచ్చు.. గత ఐదేళ్ల వైకాపా పాలనలో ఎచ్చెర్ల, పొందూరు మండలాలకు సాగునీరు అందించే ఈ కాలువ ఆధునికీకరణ పనులు ముందుకు సాగడం లేదు.. 2018లో అప్పటి తెదేపా ప్రభుత్వం జపాన్‌ ఇంటర్నేషనల్‌ కో ఆపరేటివ్‌ ఏజెన్సీ (జైకా) నిధులు రూ.49 కోట్లు మంజూరు చేసి పనులను సైతం పట్టాలెక్కించింది. ప్రభుత్వం మారిన తర్వాత కనీసం చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఖరీఫ్‌కు అన్నదాతలు ఇబ్బందులు పడాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నత్తనడకన పనులు.. 

ఆరేళ్ల కిందట జైకా నిధులు రూ.49 కోట్లతో ప్రారంభించిన ఆధునికీకరణ పనులు కనీసం 30శాతం కూడా పూర్తికాలేదు. వైకాపా పాలనలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. గుత్తేదారుకు రూ.10 కోట్ల వరకు బిల్లులు బకాయిలు ఉండటంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. ఎచ్చెర్ల మండలంలోని ఫరీదుపేట, తోటపాలెం, దుప్పలవలస, కొత్తపేట, పొన్నాడ, ధర్మవరం, కొంగరాం, కొంగరాం, ముద్దాడ, రామజోగిపేట, భగీరధపురం తదితర గ్రామాల్లో వేల ఎకరాల్లో ఖరీఫ్‌కు వరి సాగు చేపట్టే అవకాశం ఉంది. కాలువ పూడికతీత పనులు చేపట్టక పోవటం గుర్రపుడెక్క పేరుకుపోయి శివారు గ్రామాలకు సాగునీరందుతుందో లేదో ప్రశ్నార్థకంగానే చెప్పొచ్చు.  

పూడిక తీయలేదు.. 

నారాయణపురం కుడి కాలువ ద్వారా సంతకవిటి, పొందూరు, ఎచ్చెర్ల మండలాల్లో దాదాపు 30 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. దశాబ్ధాల కిందట నిర్మించిన ఈ కాలువకు ఇప్పటి వరకు ఆధునికీకరణ పనులు చేయలేదు. దీంతో కాలువ శివారు ప్రాంత రైతులకు సాగునీటి కష్టాలు తప్పడం లేదు. ఏటా జూన్‌ రెండో వారంలో కాలువల ద్వారా చెరువులు నింపితే రైతులకు సాగునీటి ఇబ్బందులు ఉండవు. కొన్ని కారణాలతో జులై వరకూ ఆలస్యం అవుతోంది. అప్పటికీ రైతులు ఊబాలకు సమాయత్తం అవుతుండటంతో ఒకేసారి అందరికీ నీరు అవసరం అవుతుంది. శివారు మండలం ఎచ్చెర్లకు నీరందక రైతులు అవస్థలు పడుతున్నారు. నారాయణపురం కుడికాలువ ద్వారా ఖరీఫ్‌కు నీటి సరఫరా చేయాలంటే కాలువలో పూడిక తొలగించాల్సి ఉన్నా ఇప్పటి వరకు ఆ పనులు ప్రారంభించలేదు. 


గుత్తేదారు ముందుకు రాలేదు..

 - మురళీమోహన్‌రావు, డీఈ, జలవనరులశాఖ

జైకా నిధుల్లో రూ.17 కోట్లతో ఆధునికీకరణ పనులు చేపట్టాం. అందులో గుత్తేదారుకు రూ.10 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉండటంతో మిగిలినవి చేసేందుకు ముందుకు రావట్లేదు. రైతులకు సాగునీటి ఇబ్బందుల్లేకుండా ఉండేందుకు ఈ నెలాఖరులోగా పూడికతీత పనులు చేయిస్తాం. పనులు పూర్తిచేసే దిశగా చర్యలు తీసుకుంటాం.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని