logo

రేవుల్లోకి అధికారుల బృందం

రాష్ట్రంలో ఇసుక తవ్వకాలపై నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఇటీవల ఆదేశించడంతో జిల్లా అధికారులు ఎట్టకేలకు కదిలారు. కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్, కమిటీ సభ్యులు సోమవారం రెండు రీచ్‌లను పరిశీలించారు.

Published : 21 May 2024 03:36 IST

సుప్రీంకోర్టు ఆదేశాలతో స్పందించిన కలెక్టర్‌
తొలిరోజు రెండు రీచ్‌ల పరిశీలన
న్యూస్‌టుడే, శ్రీకాకుళం అర్బన్‌

రాష్ట్రంలో ఇసుక తవ్వకాలపై నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఇటీవల ఆదేశించడంతో జిల్లా అధికారులు ఎట్టకేలకు కదిలారు. కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్, కమిటీ సభ్యులు సోమవారం రెండు రీచ్‌లను పరిశీలించారు. ఈ ప్రక్రియ మొక్కుబడిగా సాగినట్లు విమర్శలు వస్తున్నాయి. వంశధార, నాగావళి నదుల్లో ఓ సంస్థ అనుమతులతో సంబంధం లేకుండా తవ్వకాలు చేస్తూనే ఉంది. కమిటీ పరిశీలనకు రానుందనే సమాచారంతో రెండు, మూడు రోజుల కిందట పనులు నిలిపివేసింది. తీరం వద్ద పొక్లెయిన్లు, ట్రాక్టర్లు దర్శనమిస్తున్నాయి. తవ్వకాలను తాత్కాలికంగానే నిలిపివేశామని గుత్తేదారు సంస్థ సిబ్బంది బహిరంగంగానే చెబుతున్నారు. 

అంతా గుట్టుగానే..

జిల్లాలో ఏయే రేవులను పరిశీలించాలనే అంశంపై జిల్లా గనుల శాఖ ఓ ప్రణాళిక రూపొందించి కలెక్టర్‌కు నివేదిక అందించినట్లు సమాచారం. కమిటీలోని ఇతర శాఖలకు ఈ వివరాలు తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిసింది. కమిటీ పరిశీలన పూర్తికాగానే గుత్తేదారులు యంత్రాలతో తవ్వకాలు పునఃప్రారంభించడానికి సిద్ధమవుతున్నారని తెలిసింది. పొక్లెయిన్లకు సంబంధించిన సమస్యలను పరిష్కరించే పనుల్లో సిబ్బంది ప్రస్తుతం నిమగ్నమై ఉన్నారని సమాచారం. మహేంద్రతనయ, బహుదా నదీ తీరాల్లో వైకాపా నాయకులు ఇసుక అక్రమంగా తవ్వేస్తున్నారు. ఈ వ్యవహారంలో కీలక ప్రజాప్రతినిధికి వాటాలు ఉండటంతో అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. మందస మండలంలో అధికారులను ఇసుకాసురులు మచ్చిక చేసుకుని దందాకు మార్గం సుగమం చేసుకున్నారని తెలిసింది. 


ప్రభుత్వానికి నివేదిస్తాం..

- మన్‌జీర్‌ జిలానీ సామూన్, కలెక్టర్‌  

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సోమవారం ఇసుక రీచ్‌లను పరిశీలించాం. రీచ్‌లను పరిశీలించేందుకు బృందం ఏర్పాటు చేశాం. క్షేత్రస్థాయిలో గుర్తించిన అంశాలను ప్రభుత్వానికి నివేదిస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని