logo

వేట లేదు.. భృతి అందలేదు

సముద్రంలో మర బోట్లతో చేపల వేట నిషేధం విధించి నెల రోజులు దాటినా ప్రభుత్వం నుంచి సాయం అందక   మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. ఉపాధి లేక జీవనం భారమై నరకయాతన అనుభవిస్తున్నామని వాపోతున్నారు.

Published : 21 May 2024 03:41 IST

నెల దాటినా అందని ప్రభుత్వ సాయం 
ఆందోళనలో మత్స్యకారులు 
న్యూస్‌టుడే, కవిటి గ్రామీణం  

సముద్రంలో మర బోట్లతో చేపల వేట నిషేధం విధించి నెల రోజులు దాటినా ప్రభుత్వం నుంచి సాయం అందక   మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. ఉపాధి లేక జీవనం భారమై నరకయాతన అనుభవిస్తున్నామని వాపోతున్నారు. ఎన్నికల నియమావళిని దృష్టిలో ఉంచుకుని రెండు నెలల ముందుగానే భృతి అందిస్తామన్న పాలకుల హామీలు నీటి మూటలుగానే మిగిలాయి. మరోవైపు అధికారులు ప్రతిపాదనలు పంపినా ఇప్పటి వరకు లబ్ధిదారుల ఖాతాల్లో మత్స్యకార భృతి జమకాలేదు. దిక్కు తోచని స్థితిలో మత్స్యకారులు అవస్థలు పడుతున్నారు. 
జిల్లాలో ఏప్రిల్‌ 14 నుంచి వేట నిషేధం అమలులోకి వచ్చింది. అప్పటి నుంచి మత్స్యకారులకు ఎలాంటి ఉపాధి లేదు. ఇటీవల మత్స్య శాఖ అధికారులు సర్వే ద్వారా వేటకు వెళ్తున్న మత్స్యకారులను గుర్తించారు. వారి వివరాలను ఈ-మత్స్యకార పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేశారు. 15 వేల మందికి పైగా ప్రభుత్వం నుంచి రూ.10 వేలు చొప్పున మత్స్యకార భృతి అందించాల్సి ఉంది. వేట నిషేధ సమయంలో మత్స్యకారులు బోట్లు, వలలకు మరమ్మతులు చేసుకుంటారు.  

అప్పులు చేసి జీవనం 

వేట నిషేధం విధించి నెల రోజులు దాటినా మత్స్యకార భృతి అందకపోవడంతో అప్పులు చేసి జీవనం సాగించాల్సిన పరిస్థితి నెలకొందని మత్స్యకారులు వాపోతున్నారు. కొందరు ఇంట్లో వస్తువులను తాకట్టు పెట్టినట్లు చెబుతున్నారు. మత్స్య సంపద లేక మహిళలకూ ఉపాధి లేకుండా పోయింది. ఎన్‌ఆర్‌ఈజీఎస్, వ్యవసాయ పనులు లేకపోవడం.. భృతి ఎప్పుడు వస్తుందో తెలియక నిస్సహాయ స్థితిలో ఉన్నారు.


బతుకు భారం..

- సూరాడ లవన్న, మత్స్యకారుడు, కవిటి మండలం 

వేట నిషేధ సమయంలో రెండు నెలల పాటు ఎలాంటి పనులు ఉండవు. ప్రభుత్వం ముందుగా భృతి ఇస్తే కుటుంబ పోషణకు ఇబ్బంది ఉండదు. ఇప్పటి వరకు సాయం అందకపోవడంతో జీవనం భారంగా మారింది. అప్పులు చేసి నిత్యావసర సరకులు కొనుగోలు చేస్తున్నాం.  


ఒక పూటే భోజనం..

- చీకటి ఎర్రయ్య, మత్స్యకారుడు, ఇచ్ఛాపురం మండలం 

మాకు వేట తప్ప మరో పని రాదు. నెల రోజులుగా వేట లేక కుటుంబ పోషణ కష్టంగా మారింది. ఒక పూట తిని మరో పూట పస్తులు ఉంటున్నాం. వేట నిషేధం నాటి నుంచి వలలు, పడవలు బాగు చేసుకుంటున్నాం. భృతి ముందుగా ఇచ్చి ఉంటే బాగుండేది. నిత్యావసర సరకులు తెచ్చుకోవడానికి ఇంట్లో వస్తువులు తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. 


అర్హులందరికీ లబ్ధి..

- శ్రీనివాసరావు, జేడీ, మత్స్య శాఖ, శ్రీకాకుళం 

జిల్లా వ్యాప్తంగా బోట్లు, మత్స్యకారుల వివరాలను ఈ-మత్స్యకార పోర్టల్‌లో నమోదు చేశాం. ప్రభుత్వం అనుమతించిన వెంటనే అర్హులందరికీ భృతి అందేలా చర్యలు తీసుకుంటున్నాం. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు