logo

దూసుకొస్తున్నాయ్‌.. మృత్యు వాహనాలు..!

మూలపేట పోర్టుతో అందరి బతుకుల్లో మార్పు వస్తుందని భావించిన అక్కడి ప్రజలకు తీరని శోకం మిగులుతోంది.. పోర్టు నిర్మాణానికి చేపడుతున్న కార్యకలాపాలు పరిసర గ్రామాల వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

Updated : 21 May 2024 06:00 IST

పోర్టుకెళ్లే లారీలతో జనం బెంబేలు.. 
ప్రాణాలు పోతున్నా పట్టించుకోని యాజమాన్యం 
న్యూస్‌టుడే, సంతబొమ్మాళి 

మూలపేట పోర్టుతో అందరి బతుకుల్లో మార్పు వస్తుందని భావించిన అక్కడి ప్రజలకు తీరని శోకం మిగులుతోంది.. పోర్టు నిర్మాణానికి చేపడుతున్న కార్యకలాపాలు పరిసర గ్రామాల వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ ప్రాంతానికి వెళ్లే  భారీ వాహనాల రాకపోకలతో  అనేకమంది క్షతగాత్రులుగా మిగులు తుండగా, పలువురి ప్రాణాలు సైతం పోతున్నాయి. రోజుకో ప్రమాదం కళ్ల ముందు కనిపిస్తున్నా ఎలాంటి చర్యలు లేవు.  రహదారులు ధ్వంసమవుతున్నాయి.. దుమ్ముధూళితో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. రోడ్డెక్కి ఆందోళనకు దిగుతున్నా పట్టించుకున్నవారే లేకుండా పోతున్నారు.

  

తప్పిన ప్రమాదం

సంతబొమ్మాళి మండలం కూర్మనాథపురం గ్రామంలో కోట రాజశేఖర్‌ ఇంట్లోకి పోర్టు వాహనం సోమవారం సాయంత్రం దూసుకెళ్లింది.. ఆ సమయంలో అక్కడెవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఈ ఘటనలో ఇంటి ముందు ఉన్న రేకులషెడ్డు పూర్తిగా ధ్వంసమైంది. దీనిపై బాధితులు నౌపడ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సామర్థ్యానికి మించి.. 

టన్నుల కొద్దీ రాళ్లను టిప్పర్లలో తరలిస్తున్న అధికారులు కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదు. వేగంగా వెళ్లే టిప్పర్లతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. 20 టన్నుల సామర్థ్యమున్న రోడ్లపై 80 టన్నుల బరువున్న వాహనాలను నడుపుతుండటంతో చాలాచోట్ల రహదారులు కుంగిపోయాయి. రాత్రిళ్లు ఈ మార్గాల్లో ప్రయాణం నరకంగా ఉంటుందని వాహన చోదకులు వాపోతున్నారు. పాలవానిపేట కూడలి మలుపు వద్ద భారీ వాహనాలు తిరిగే అవకాశం లేకపోయినా నడుపుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. 

రహదారులు ధ్వంసం.. 

పోర్టుకు వెళ్లే భారీ వాహనాల రాకపోకలతో  మెరుగ్గా ఉన్న రహదారులు ధ్వంసమవుతున్నాయి. సంతబొమ్మాళి-డీపీఎన్, నౌపడ-వెంకటాపురం, నౌపడ-టెక్కలి, డీపీఎన్‌-పాలనాయుడుపేట, మూలపేట-మేఘవరం రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. టెెక్కలి, సంతబొమ్మాళి కొండల నుంచి రాళ్లు, ఇతర సామగ్రిని భారీ టిప్పర్లు, లారీల ద్వారా తరలిస్తున్నారు. సంతబొమ్మాళి పెద్దకొండ నుంచి గ్రావెల్‌ను తీసుకెళ్లడంతో ఈ మార్గాలు రూపు కోల్పోయి తారురోడ్డు కాస్త మెటల్‌ రోడ్డుగా మారింది. 

దుమ్ముతో సతమతం..

తారురోడ్లు దెబ్బతిని మెటల్‌ రోడ్లలా మారడం, వాహనాల రాకపోకల కారణంగా దుమ్ముతో  తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పరిసర ప్రాంతాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు డ్రైవర్లు ఇష్టానుసారంగా వాహనాలను వేగంగా నడపడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. దెబ్బతిన్న రోడ్లతో స్థానికంగా తిరగలేని పరిస్థితి. ఏదైనా బండి వెళితే దుమ్ము లేస్తోంది. అలాంటివి రోజుకు వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలు చేస్తున్నా పోర్టు యాజమాన్యం కనీసం రోడ్డును నీళ్లతో తడపడం వంటి పనులు కూడా చేయడం లేదు. ఎగురుతున్న దుమ్ముతో శ్వాసకోస సమస్యలు వస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. 


ఇవిగో ప్రమాదాలు.. 

  • ఏడాది కిందట పాలవానిపేట-మూలపేట రహదారిలో రాళ్ల లోడుతో వెళ్తున్న టిప్పర్‌ హైటెన్షన్‌ విద్యుత్తు స్తంభాన్ని ఢీకొంది. స్తంభం పక్కకు ఒరిగి పెద్ద ప్రమాదం తప్పింది.
  • టెక్కలి-నౌపడ మార్గంలో చిన్ననారాయణపురం వద్ద లారీ నుంచి రాయి కిందపడి వెనుక వస్తున్న కారును ఢీకొంది. కారు ముందుభాగం దెబ్బతిన్నా అందులో ఉన్నవారు బయటపడ్డారు.
  • టెక్కలి పట్టణ నడిబొడ్డున వాహనం ఢీకొని స్థానిక శ్రీరామకాలనీకి చెందిన చంద్రశేఖర్‌ అనే యువకుడు మృతి చెందాడు. రాళ్ల తరలించే వాహనమే ఈ ఘటనకు కారణమైంది. 
  • తలగాం సమీపంలో ఆగి ఉన్న పోర్టు వాహనాన్ని ఢీకొనడంతో నౌపడకు చెందిన యువకుడు దుర్మరణం చెందాడు.
  • యామాలపేటలో లారీ నుంచి భారీ రాయి రోడ్డుపై పడిపోయింది. ఆ సమయంలో అక్కడెవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
  • కొత్త లింగూడు-మూలపేట గ్రామాల మధ్య పరిమితికి మించి లోడుతో వెళ్తున్న పోర్టు వాహనాలు ఐదుసార్లు బోల్తా పడ్డాయి. వీటిలో ఉన్న డ్రైవర్లు, సహాయకులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. దీనిపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
  • సంతబొమ్మాళిలో గ్రావెల్‌ తరలిస్తున్న లారీ సైకిల్‌పై వెళ్తున్న పాల వ్యాపారిని ఢీకొట్టడంతో గాయాలపాలయ్యాడు. ఆగ్రహించిన గ్రామస్థులు వాహనాలు నిలిపివేసి ఆందోళనకు దిగారు. 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని