logo

ఆఫ్‌షోర్‌ నిర్వాసితుల గోడు పట్టేనా

మెళియాపుట్టి మండలంలోని నిర్వాసిత గ్రామాల్లోని పునరావాస కాలనీల్లో సదుపాయాలు కొరవడటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా కొందరు నిర్వాసితులకు ఇప్పటికీ సరైన ప్యాకేజీ అందలేదు.

Published : 24 May 2024 04:57 IST

న్యూస్‌టుడే, మెళియాపుట్టి

సమస్యలను నాటి ఆర్‌అండ్‌ఆర్‌ కమిషనర్‌ శ్రీధర్‌కు వివరిస్తున్న నిర్వాసితులు

మెళియాపుట్టి మండలంలోని నిర్వాసిత గ్రామాల్లోని పునరావాస కాలనీల్లో సదుపాయాలు కొరవడటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా కొందరు నిర్వాసితులకు ఇప్పటికీ సరైన ప్యాకేజీ అందలేదు. దీంతో వారు ప్రభుత్వం తమకు అన్యాయం చేసిందని, ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అయిదేళ్లుగా తిరుగుతున్నా..

చీపురుపల్లి నిర్వాసిత గ్రామంలో అర్హులైన వంద మందికి పైగా యూత్‌ ప్యాకేజీకి సంబంధించి నిర్వాసితులు అయిదేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. మరో 20 మందికి డి-పట్టా భూముల వ్యవహారాలు, పరిహారాల్లో ఇబ్బందులు ఉన్నాయని, స్థలం చూపని బాధితులు ఉన్నారని గ్రామ సర్పంచి యవ్వారి ఈశ్వరరావు పేర్కొంటున్నారు.

నెరవేరని హామీలు

గతేడాది ఆగస్టు 21న పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి చీపురుపల్లి నిర్వాసితులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఆఫ్‌షోర్‌ నిర్వాసితుల సమస్యలను పరిష్కరిస్తామని, అదనపు పరిహారం కాని స్పెషల్‌ ప్యాకేజీ కాని ప్రభుత్వం చెల్లించే విధంగా చూసి న్యాయం చేస్తామన్నారు. మూలపేట నిర్వాసితులకు ఇచ్చిన ప్యాకేజీతో పోలిస్తే ఆఫ్‌షోర్‌ నిర్వాసితులకు అందిన ప్యాకేజీ చాలా తక్కువని నిర్వాసితులు ఆమె దృష్టికి తీసుకువెళ్లగా ఆమె స్పందించి హామీ ఇచ్చి నేటికి 8 నెలలు గడిచిపోయాయి. 2022 జూన్‌ 2న దాసుపురం పునరావాస కాలనీని సందర్శించిన అప్పటి ఆర్‌అండ్‌ఆర్‌ కమిషనర్‌ సీహెచ్‌.శ్రీధర్‌ నిర్వాసితులతో మాట్లాడుతూ పునరావాస కాలనీలో అసంపూర్తి పనులు పూర్తయ్యేలా చూస్తామన్నారు. నేటికీ కాలనీలో కాలువలు, ఇతర మౌలిక సదుపాయాలు ఏర్పాటు కాలేదు.

అసంపూర్తిగా నిర్మాణాలు: ఆఫ్‌షోర్‌ జలాశయం నిర్మాణంలో భాగంగా నిర్వాసిత గ్రామమైన దాసుపురం పునరావాస కాలనీలో సమస్యలు తిష్ఠ వేశాయి. 120 కుటుంబాలు ఉన్న కాలనీలో కనీస రహదారులు, కాలువలు నిర్మాణానికి నోచుకోలేదు. పాఠశాల, అంగన్‌వాడీ, సామాజిక భవనం, పంచాయతీ కార్యాలయం ఇలా పక్కా భవనాలనీ అసంపూర్తిగానే నిలిచాయి. కాలనీ నుంచి సుమారు 20 మంది చిన్నారులు నిత్యం కొండ ప్రాంతం దాటుకొంటూ దాసుపురంలో శిథిలావస్థకు చేరిన పాఠశాలకు వెళ్తున్నారు. ఎండ, వానలకు ఛిద్రమైన రహదారిపై ప్రయాణం ప్రమాదాలకు కారణంగా మారుతోంది.

ఎస్‌.మల్లేషు, ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ, దాసుపురం

 పనులు రద్దయ్యాయి: ఆర్‌అండ్‌ఆర్‌ దాసుపురం కాలనీలో అసంపూర్తి పనులు పూర్తిచేయాలని గతంలో కమిషనర్‌ ఇక్కడికి వచ్చిననప్పుడు ఆదేశించారు. చేసిన పనులకు బిల్లులు కాకపోవడంతో గుత్తేదారు నిలిపివేశారు. గడువు ముగియడంతో పనులు రద్దు చేశారు. కొత్తగా టెండర్‌ ప్రక్రియ చేపట్టి తిరిగి చేపట్టాల్సి ఉంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఉన్నతాధాకారులకు ఆదేశాలు రావాల్సి ఉంది.

 రామారావు, ఏఈ, ఏపీఈడబ్ల్యూఐడీఎస్, మెళియాపుట్టి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని