logo

కుస్తీమే సవాల్‌!

కుస్తీ పోటీలకు శ్రీకాకుళం నగర పరిధిలోని పెద్దపాడు పెట్టింది పేరు. ఇక్కడి పేదింటి బిడ్డలు జిల్లా, రాష్ట్రస్థాయిలో అడుగుపెట్టిన ప్రతిసారీ పతకాల పంట పండిస్తున్నారు.

Published : 24 May 2024 04:57 IST

జాతీయస్థాయి పోటీలకు సన్నద్ధమవుతున్న పెద్దపాడు క్రీడాకారులు

సాధన చేస్తున్న క్రీడాకారులు

కుస్తీ పోటీలకు శ్రీకాకుళం నగర పరిధిలోని పెద్దపాడు పెట్టింది పేరు. ఇక్కడి పేదింటి బిడ్డలు జిల్లా, రాష్ట్రస్థాయిలో అడుగుపెట్టిన ప్రతిసారీ పతకాల పంట పండిస్తున్నారు. ఇటీవల చిత్తూరు జిల్లా క్రీడాప్రాధికార సంస్థలో జరిగిన రాష్ట్రస్థాయి కుస్తీ పోటీల్లో అండర్‌-17 విభాగంలో రెండు స్వర్ణాలు, రజతం, కాంస్యం, అండర్‌-23 విభాగంలో 3 స్వర్ణాలు, రెండు రజత పతకాలు సాధించి ఓవరాల్‌ ఛాంపియన్లుగా నిలిచారు. ఝార్ఖండ్‌లోని రాంచీలో జరగనున్న జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అందులో సత్తా చాటేందుకు శ్రమిస్తున్నారు. వారిపై ‘న్యూస్‌టుడే’ కథనం..

 న్యూస్‌టుడే, శ్రీకాకుళం అర్బన్‌

తాత, మామల స్ఫూర్తితో..

ఈ ఏడాది డిగ్రీ పూర్తి చేసిన కోరాడ సూర్య తల్లిదండ్రులు అప్పారావు, మంగమ్మ వ్యవసాయం చేస్తుంటారు. కుటుంబంలో తాతయ్య, మామయ్య కుస్తీ క్రీడాకారులే. వారిని ఆదర్శంగా తీసుకుని.. అంతకంటే మరింత రాణించాలని ఆరేళ్ల కిందట కుస్తీ సాధన ప్రారంభించాడు. ఇప్పటి వరకు రాష్ట్ర స్థాయిలో 5 స్వర్ణాలు, 5 రజతాలు, 3 కాంస్య పతకాలు, సౌత్‌జోన్‌ పోటీల్లో రజత పతకం కైవసం చేసుకున్నాడు.  జాతీయస్థాయి పోటీలో గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు ప్రభుత్వ కొలువు సాధించాలనే లక్ష్యంగా నిరంతరం శ్రమిస్తున్నానని చెబుతున్నాడు సూర్య.

తండ్రి కల నిజం చేయాలని..

డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతున్న తోణంగి జ్యోతి కుమార్‌ యాదవ్‌ ఆరేళ్లుగా కుస్తీ సాధన చేస్తున్నాడు. తండ్రి అప్పారావు మార్కెట్‌లో కళాసీ. తల్లి రామలక్ష్మి రైతు కూలీ. అప్పారావు కూడా కుస్తీ ఆడేవారు. కుటుంబ సమస్యల కారణంగా దాన్ని వదులుకున్నారు. తండ్రి కలను నిజం చేయాలనే లక్ష్యంతో జ్యోతికుమార్‌ ముందుకు సాగుతున్నాడు. ఇప్పటి వరకు రాష్ట్రస్థాయిలో 9 స్వర్ణాలు, 3 రజతాలు, 1 కాంస్య పతకాలు దక్కించుకున్నాడు. సైన్యంలో కొలువు సాధించి దేశ సేవ చేయాలనుకుంటున్నట్లు తెలిపాడు.

రైల్వే ఉద్యోగమే లక్ష్యంగా...

పదో తరగతి చదువుతున్న తోనంగి ధనుంజయ కుస్తీ పోటీల్లో సత్తా చూపుతున్నాడు. తండ్రి డొంకయ్య సిమెంటు గోదాములో జట్టు కళాసీ. తల్లి లక్ష్మి రైతు కూలీ. కుస్తీపై ఆసక్తితో రెండేళ్ల నుంచి మెలకువలు నేర్చుకున్నాడు. రాష్ట్రస్థాయి పోటీల్లో 3 స్వర్ణాలు, 1 కాంస్య పతకం సొంతం చేసుకుని ఇటీవల జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. అందులో పతకం సాధించి క్రీడాకోటాలో రైల్వే ఉద్యోగం సంపాదించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు ఈ క్రీడాకారుడు.

అదరగొడుతున్న ఆటో డ్రైవర్‌ కొడుకు..

పెద్దపాడుకు చెందిన తిరుపతిరావు ఆటో డ్రైవర్‌. ఈయన కుమారుడు ఈదు జయకృష్ణ ఇటీవల జాతీయస్థాయి కుస్తీపోటీలకు ఎంపికయ్యాడు. జయకృష్ణ తల్లి రమాదేవి గృహిణి. ఇటీవల జరిగిన పదో తరగతి పరీక్షల్లో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. మూడేళ్లుగా సాధన చేస్తున్నాడు. ఇప్పటి వరకు రాష్ట్రస్థాయిలో 2 స్వర్ణాలు, 1 రజత పతకం సాధించాడు. జాతీయస్థాయిలో పతకం సాధించాలనేది లక్ష్యంతో నిరంతరం సాధన చేస్తున్నానని తెలిపాడు జయకృష్ణ.

దాతలు ప్రోత్సహించాలి..

జిల్లాలో సామర్థ్యం కలిగిన క్రీడాకారులకు కొదవలేదు. అరకొర వసతుల మధ్యే నిరంరతం సాధన చేస్తూ రాష్ట్రస్థాయిలో సత్తాచాటుతున్నారు. దాతలు స్పందించి.. డమ్మీలు, జిమ్‌ పరికరాలతో పాటు క్రీడాకారులకు పోషకాహారం సమకూరిస్తే.. తక్కువ కాలంలోనే జాతీయస్థాయిలో పతకాలు సాధిస్తారు.

బొట్ట గోవిందరావు, డీఎస్‌ఏ కుస్తీ శిక్షకుడు
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని