logo

అప్పు పుట్టక.. కౌలు సాగక..

సరుబుజ్జిలి మండలం సింధువాడ గ్రామానికి చెందిన ఎస్‌.రాజారావు మూడెకరాల భూమి కౌలుకు తీసుకొని గత ఖరీఫ్‌లో వరి సాగు చేశాడు.

Published : 24 May 2024 05:13 IST

అర్హత ఉన్నా అందని సాగుదారు హక్కుపత్రాలు
ప్రభుత్వ సాయానికి నోచుకోలేకపోతున్న అన్నదాతలు

సరుబుజ్జిలి మండలం సింధువాడ గ్రామానికి చెందిన ఎస్‌.రాజారావు మూడెకరాల భూమి కౌలుకు తీసుకొని గత ఖరీఫ్‌లో వరి సాగు చేశాడు. ఈయనకు సీసీఆర్‌సీ లేకపోవడంతో ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదు. పంటను అమ్ముకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చివరికి దళారులకు విక్రయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.


జి.సిగడాం మండలం నక్కపేట గ్రామానికి చెందిన మక్క అసిరినాయుడు అయిదెకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నారు. ఈయన సైతం సీసీఆర్‌సీ అందకపోవడంతో ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయానికి నోచుకోలేదు. పంట విక్రయానికి సైతం ఏటా నానా ఇబ్బందులు పడుతున్నారు.  

 న్యూస్‌టుడే, పొందూరు, సరుబుజ్జిలి

నేల తల్లినే నమ్ముకుని పొట్టకూటి కోసం కష్టపడే కర్షకులు ఎంతో మంది ఉన్నారు. సొంత భూమి లేకపోయినా వ్యవసాయమే ఆధారంగా బతుకుబండిని నడిపిస్తున్నారు. పొలాల్లో ఆరుగాలం కష్టపడుతూ యజమానుల నుంచి కొంత భూమిని కౌలుకు తీసుకొని సాగు చేసుకుంటున్నారు. వీరి కోసం ప్రభుత్వం రాయితీలు, పథకాలు, బ్యాంకు రుణాలు కల్పిస్తున్నా చాలామంది అందుకోలేకపోతున్నారు. కొందరు భూ యజమానులు పంట సాగుదారు హక్కు పత్రం (సీసీఆర్‌సీ) మంజూరుకు సహకరించకపోవడంతో ప్రభుత్వం అందించే సాయానికి దూరమవుతున్నారు. ఓ వైపు చేసిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతుంటే, మరోవైపు ప్రకృతి విపత్తులు ఆశలను నీరుగారుస్తుండటంతో ఏం చేయాలో దిక్కుతోచక కౌలు రైతులు సతమతమవుతున్నారు.

జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతుల్లో దాదాపు 13 వేల మంది భూమిని కౌలుకు తీసుకునే పంటలు సాగు చేస్తున్నారు. వీరిలో 7,632 మందికి మాత్రమే అధికారులు సీసీఆర్‌ కార్డులు మంజూరు చేశారు. వీరందరినీ 619 గ్రూపులుగా ఏర్పాటు చేశారు. 166 గ్రూపుల్లో 1,592 మందికి రూ.203.94 లక్షలు బ్యాంకుల నుంచి రుణం ఇప్పించారు. అర్హులందరికీ రుణాలందే అవకాశం లేదు. ఈ-క్రాప్‌లో నమోదైన వారికి పెట్టుబడి రాయితీ అందుతున్నా గుర్తింపు లేని వారికి ఈ రాయితీ కూడా దక్కని పరిస్థితి నెలకొంది. కొందరిని సాంకేతిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి

మారిపోతున్న సాగుదారులు..

ప్రభుత్వం చైతన్యపరుస్తున్నా కౌలు కార్డులకు కొందరు యజమానులు సహకరించట్లేదు. ఖరీఫ్, రబీ పంటలకుగాను యజమాని రైతుకు ఎకరాకు సుమారు 25 బస్తాల శిస్తును చెల్లిస్తున్నారు. ఖరీఫ్‌ పంట బాగుంటే ఇందులో వచ్చే ధాన్యాన్ని రైతుకు చెల్లించి, రబీలో పండిన ధాన్యాన్ని కౌలు రైతు తీసుకుంటారు. యజమాని రైతుకు కిస్తీ చెల్లించడంతో పాటు రెండు పంటలకు అయ్యే పెట్టుబడిని కౌలు రైతే భరిస్తాడు. ఆయన పేరున కౌలు కార్డు రాయడానికి ఇష్టపడని యజమాని రైతుల్లో చాలా మంది నష్టపరిహారం అడ్డదారిన వారే పొందుతున్నారు. గతంలో ఒక రైతు పొలాన్ని కౌలుకు తీసుకుంటే ఏళ్ల తరబడి అతనే భూమి సాగు చేసేవాడు. క్రమేణా కౌలు సాగు గిట్టుబాటు కాక ఏడాదికి.. రెండేళ్లకు కౌలు రైతులు మారిపోతున్నారు.

  • జిల్లాలో పంటలు సాగు చేసేవారు: 3,84,216 
  • కౌలు రైతులు: సుమారు 13 వేలు  
  • సీసీఆర్‌సీలు పొందినవారు: 7,632 
  • రుణ గ్రహీతలు: 1,592మంది
  • పొందిన రుణం: రూ.203.94 లక్షలు

అపోహలు తొలగిస్తున్నాం..

కౌలు రైతులకు సీసీఆర్‌ కార్డులు పూర్తి స్థాయిలో అందించేందుకు కృషి చేస్తున్నాం. ఇప్పటి వరకు 7,632 మందికి ఇచ్చాం. భూయజమానులు సహకరించకపోవడంతో పూర్తిస్థాయిలో ఇవ్వలేకపోతున్నాం. గ్రామస్థాయిలో రైతులతో అవగాహన సదస్సులు నిర్వహించి అపోహలను తొలగిస్తున్నాం. గుర్తించిన వారందరికీ బ్యాంకు రుణాలు అందజేసేందుకు చర్యలు చేపడుతున్నాం. ఆన్‌లైన్‌లో వివరాలను నమోదు చేసి పత్రాలను అందజేస్తున్నాం.

 కె.శ్రీధర్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి, శ్రీకాకుళం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని