logo

రైతుకు లేదు మామిడి తీపి..!

మధుర ఫలం... ఏటా వేసవిలో అందుబాటులోకొచ్చే మామిడి పండ్లు రుచి చూడాలని సామాన్యుల నుంచి సంపన్నుల వరకూ, పిల్లల నుంచి పెద్దల వరకు తాపత్రయ పడతారు.

Published : 24 May 2024 05:18 IST

జిల్లాలో సగానికి పైగా తగ్గిన దిగుబడి
ధర ఉన్నా పంట లేక నష్టం  

విక్రయానికి సిద్ధం చేస్తున్న మామిడి పండ్లు

మధుర ఫలం... ఏటా వేసవిలో అందుబాటులోకొచ్చే మామిడి పండ్లు రుచి చూడాలని సామాన్యుల నుంచి సంపన్నుల వరకూ, పిల్లల నుంచి పెద్దల వరకు తాపత్రయ పడతారు.. ఈ ఏడాది దిగుబడులు తగ్గిపోవడంతో సామాన్యునికి అందుబాటులో ఉండే పరిస్థితి కనిపించడం లేదు. జిల్లాలో గతేడాది అధిక దిగుబడుల వల్ల మామిడి ధర తగ్గిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈసారి ఆశించినంత ధర ఉన్నా దిగుబడుల్లేక నిరాశ చెందుతున్నారు.. పంట దిగుబడి పెరిగినా, తగ్గినా నష్టమే చవిచూడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. గతేడాది మార్కెట్లో పోగులుగా ఉన్న మామిడి ఈసారి అంతగా కనిపించని పరిస్థితి నెలకొంది..

 న్యూస్‌టుడే, రణస్థలం

  •  జిల్లాలో 5,315 ఎకరాల్లో మామిడి సాగు చేస్తున్నారు. అధికంగా రణస్థలం, జి.సిగడాం, జలుమూరు, సారవకోట, పోలాకి, పొందూరు మండలాల్లో పంట విస్తీర్ణం ఉంది.. మెట్ట ప్రాంతమైన ఎచ్చెర్ల నియోజకవర్గంలోనే తోటలు అధికంగా ఉన్నాయి.

 మామిడి కాయలను దించుతున్న రైతులు

ఎకరాకు రూ. 25 వేల ఖర్చు..

కొన్నిచోట్ల స్థానిక రైతులే సాగు చేసుకుంటుండగా మరికొన్ని ప్రాంతాల్లో మూడు, నాలుగేళ్ల కాలానికి వ్యాపారులకు, ఇతర జిల్లాల రైతులకు లీజుకిచ్చేస్తున్నారు. వందల ఎకరాలను ఒప్పంద ప్రాతిపతికన రైతులు తీసుకుంటారు. ఇందులో భాగంగా నష్టాలతో సంబంధం లేకుండా ముందుగానే కొంత సొమ్ము సంబంధిత రైతుకి ఇస్తారు. గతేడాది అధిక దిగుబడులతో కుదేలవ్వగా ఈ ఏడాది దిగుబడులు తగ్గిపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. లీజు రైతులు, తోటల యజమానులకు ఎకరాకు రూ.10 వేలు చెల్లిస్తారు. తోటల్లో దుక్కులు, ఎరువులు, పురుగుమందులు ఇతర సాగు ఖర్చులు కలిపి ఏడాదికి రూ.25 వేలు వరకు ఖర్చు పెడుతుంటారు.

  •  గతేడాది జిల్లాలో సగటున దిగుబడి అంచనా 14,868 మెట్రిక్‌ టన్నులు కాగా ఈసారి ఎనిమిది నుంచి తొమ్మిది వేల టన్నులేనని ఉద్యాన అధికారులు పేర్కొంటున్నారు. గతంలో ఎకరాకు సరాసరి 2-3 టన్నుల దిగుబడి రాగా ఇప్పుడు అర టన్ను నుంచి టన్ను మాత్రమే వస్తుందని రైతులు చెబుతున్నారు. గత సంవత్సరం టన్ను ధర రూ.5 వేల నుంచి రూ.10 వేలు పలుకగా ప్రస్తుతం గరిష్ఠంగా రూ.30 వేలు  పలుకుతోంది.
  •  జిల్లా నుంచి పశ్చిమబెంగాల్, బిహార్, ఒడిశా రాష్ట్రాలకు సరకు వెళ్లేది. మన జిల్లాతో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు, విదేశాలకు సైతం ఎగుమతి చేసేవారు. ఈ ఏడాది ఆ పరిస్థితి కనిపించడం లేదని రైతులు పేర్కొంటున్నారు.  

సాగు తగ్గించేశాను..

గతేడాది 140 ఎకరాలు లీజుకు తీసుకొని సాగు చేశాను. తీవ్రంగా నష్టపోవడంతో ఈసారి 50 ఎకరాలు మాత్రమే తీసుకున్నాను. ఎకరాకు లీజుతో కలిసి రూ.25 వేలు ఖర్చవుతుంది. ఇప్పుడు ధర పలుకుతున్నా దిగుబడి తగ్గిపోవడంతో మళ్లీ నష్టాలు పాలవ్వాల్సి వస్తుంది. గతంలో రోజుకు పది మంది కాయలు కోసేవారు. ఇప్పుడు ఐదుగురే పని   చేస్తున్నారు.  

లంక రమణ, రైతు


ఆశాజనకంగా లేదు.. 

గతంతో పోలిస్తే దిగుబడి తక్కువగా ఉంది. పంట తీయక తోటల్లోనే వదిలేశాం. కనీసం రవాణా ఖర్చులు కూడా రాలేదు. ఈసారి ధర ఆశాజనకంగా ఉన్నప్పటికీ దిగుబడి రాలేదు. నేను 70 ఎకరాల్లో పంట సాగు చేశాను.

 మీసాల రమేష్, రైతు, దేవరాపల్లి

 ప్రతికూల వాతావరణం వల్లే..

ఈ ఏడాది మామిడికి ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఎదురయ్యాయి. పూత సమయానికి విపరీతమైన మంచు కురవడంతో మాడిపోయింది. మామిడిలో ప్రత్యామ్నాయ మార్పులు ఉంటాయి. ఒక ఏడాది విరివిగా దిగుబడి వస్తే, మరుసటి ఏడాది తగ్గిపోతుంది. పూతకు రసం పీల్చే పురుగు ఆశించడం వల్ల పంట ఆశాజనకంగా లేదు. 

 రత్నాల వరప్రసాద్, జిల్లా ఉద్యానశాఖ అధికారి, శ్రీకాకుళం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని