logo

ఎవరు అడ్డొచ్చినా ఆపేదేలే..!

మరికొద్ది రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అధికారం ఉంటుందో.. లేదోననే ఆలోచనతో వైకాపా నాయకులు ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారు. అధికారుల ఆదేశాలను సైతం లెక్క చేయకుండా చెలరేగిపోతున్నారు.

Updated : 26 May 2024 05:04 IST

షేర్‌మహ్మద్‌పురంలో అధికారుల ఆదేశాలు బేఖాతరు
హెచ్చరించినా పట్టించుకోని వైకాపా నేతలు 

గురుకుల పాఠశాల స్థలాన్ని ఆక్రమించి నిర్మిస్తున్న ఇంటిని పరిశీలిస్తున్న పోలీసులు, అధికారులు 

ఎచ్చెర్ల, న్యూస్‌టుడే: మరికొద్ది రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అధికారం ఉంటుందో.. లేదోననే ఆలోచనతో వైకాపా నాయకులు ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారు. అధికారుల ఆదేశాలను సైతం లెక్క చేయకుండా చెలరేగిపోతున్నారు. ఎచ్చెర్ల మండలం షేర్‌మహ్మద్‌పురం గ్రామంలో ఏపీ గురుకుల పాఠశాలకు కేటాయించిన స్థలంలో మూడు నెలల నుంచి సాగుతున్న అక్రమ నిర్మాణానికి అడ్డుకట్ట పడటం లేదు. 

గ్రామంలోని గురుకుల పాఠశాలకు 1985లో 635/2 సర్వే నంబరులో 40 ఎకరాల కొండ పోరంబోకు స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. ఈ స్థలానికి ఎలాంటి కంచె లేకపోవటంతో దానిపై అక్రమార్కుల కన్నుపడింది. ఆ ప్రాంతంలో వైకాపా సర్పంచి అనుచరులు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించారు. దీనిపై పాఠశాల ఉపాధ్యాయులు రెవెన్యూ, పోలీసులకు అప్పట్లోనే రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆ వెంటనే రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సర్వే చేసి అది పాఠశాలకు చెందిన స్థలంగా గుర్తించి పనులు ఆపాలని ఆదేశించారు. అయినా ఆక్రమణ దారుడు లెక్క చేయకుండా మూడు నెలలుగా అధికార అండతో సెలవు రోజుల్లో, అధికారులు లేని సమయాల్లో అదును చూసి పనులు చేపడుతూ పునాదాల స్థాయి దాటేశాడు. నేడో రేపో స్లాబ్‌ సైతం వేసేందుకు సిద్ధమవుతున్నాడు. 

మరోసారి సర్వే..

తాజాగా గ్రామానికి చెందిన తెదేపా మాజీ జిల్లా అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి ఆర్డీవోకు ఏపీ గురుకుల సొసైటీ స్థలం కబ్జాకు గురవుతోందని, పరిరక్షించాలని ఫిర్యాదు చేశారు. ఆర్డీవో ఆదేశాల మేరకు తహసీల్దార్‌ వి.శ్యామ్‌కుమార్‌ పోలీసులు సమక్షంలో రెవెన్యూ సిబ్బందితో శనివారం మరోసారి సర్వే చేయించి నివేదిక కోరారు. మండల సర్వేయర్‌ సుభాష్, ఆర్‌ఐ మధుప్రియ, వీఆర్‌వో పాలవలస శ్రీనివాసరావు, పలువురు సర్వేయర్లు మరోసారి సర్వే చేసి గురుకుల పాఠశాలకు చెందిన స్థలాన్నే ఆక్రమించి ఇల్లు నిర్మిస్తున్నట్లు గుర్తించారు. ఆ మేరకు ఉన్నతాధికారులకు నివేదికను అందించనున్నారు. 

యంత్రాంగం తీరుపై విమర్శలు..

మూడు నెలల నుంచి పనులు ఆపాలని చెబుతున్నా పట్టించుకోకుండా దౌర్జన్యంగా నిర్మాణం చేపడుతుంటే పోలీసులు, రెవెన్యూ సిబ్బంది చౌద్యం చూస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. గ్రామస్థులతో పాటు, పాఠశాల ఉపాధ్యాయులు పలుమార్లు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినా నామమాత్రపు చర్యలతో సరిపెడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆక్రమణలు అడ్డుకొని అక్రమ నిర్మాణం ఆపాలని, లేనిపక్షంలో రెవెన్యూ కార్యాలయం ముందు ఆందోళనకు దిగుతామని గ్రామస్థులు హెచ్చరిస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని