logo

ఆగని దందా.. మారని పంథా..!

జిల్లాలో అనధికార ఇసుక తవ్వకాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ఇసుక తవ్వకాలపై నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో కొద్ది రోజులుగా ప్రతిమ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థ తవ్వకాలను నిలిపివేసింది.

Published : 26 May 2024 02:19 IST

సుప్రీంకోర్టు ఆదేశాలనూ లెక్కచేయని ఇసుకాసురులు

భైరి సమీపంలోని ఓ తోటలో పొక్లెయిన్‌తో లారీలోకి ఇసుక లోడ్‌ దృశ్యం

న్యూస్‌టుడే, శ్రీకాకుళం అర్బన్‌: జిల్లాలో అనధికార ఇసుక తవ్వకాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ఇసుక తవ్వకాలపై నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో కొద్ది రోజులుగా ప్రతిమ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థ తవ్వకాలను నిలిపివేసింది. వారి వెనకుండి దందా సాగించిన అధికార పార్టీ నాయకుల ఆకలి తీరలేదేమో.. రాత్రి వేళ నదిలో ఇసుక తోడేసి జిల్లా సరిహద్దులు దాటిస్తున్నారు. పోలీసులు పహారా ఉన్న సమయాల్లో నది నుంచి ఊరి బయట నిల్వలు పెట్టి వేకువజామున లారీలతో తరలించేస్తున్నారు. కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా అధికారులు సైతం అక్రమార్జనకు అలవాటు పడి అనధికార ఇసుక తవ్వకాలకు సాయం చేస్తున్నారనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. శ్రీకాకుళం నియోజకవర్గంలోని పొన్నాం, భైరి, కరజాడ, అంబళ్లవలస, బూరవల్లి గ్రామాల్లో వంశధార నది నుంచి గత నాలుగు రోజులుగా ఇసుక యథేచ్ఛగా తరలిపోతోందని గ్రామస్థులు చెబుతున్నారు. అడ్డుకట్ట వేయాల్సిన పోలీసులు రాత్రి వేళ ముడుపులు తీసుకొని లారీలు బయటకు వెళ్లేలా మార్గం సుగమం చేస్తున్నారని సమాచారం ఎస్‌ఈబీ సిబ్బంది, స్థానిక రెవెన్యూ అధికారులు ఎలాగో వీటిపై కన్నెత్తి చూడటం లేదు.


ఇసుక తవ్వకాలు జరగడం లేదట..!

జోగిపంతులుపేట ఇసుక రేవును పరిశీలిస్తున్న డీఎల్‌ఎస్‌సీ బృందం 

గార, న్యూస్‌టుడే: న్యాయస్థానం ఆదేశాల మేరకు గార మండలం జోగిపంతులుపేట, బూరవల్లి గ్రామాల పరిధిలో అనుమతులు ఉన్న రేవులను జిల్లాస్థాయి ఇసుక కమిటీ (డిఎల్‌ఎస్‌సీ) బృందం శనివారం పరిశీలించింది. ప్రాంతంలో మూడు హెక్టార్ల పరిధిలో మీటరు లోతున ఇసుక తవ్వకాలకు అనుమతులు ఉన్నాయని చెప్పారు. నామమాత్రంగా పరిశీలించి అక్కడ ఎటువంటి అక్రమ తవ్వకాలు జరగట్లేని తేల్చారు. బూరవల్లి, జోగిపంతులుపేట గ్రామాల మధ్య గుత్తేదారుకు అనుమతి ఉన్న విస్తీర్ణం మొత్తాన్ని చూశారు. యంత్రాల ద్వారా కాకుండా సాధారణ పద్ధతిలో (మనుషులతో) ఇసుక తవ్వకానికి ఈ ప్రాంతంలో గుత్తేదారుకు అనుమతి ఉందన్నారు. తాము పరిశీలించినప్పుడు నిబంధనలకు వ్యతిరేకంగా ఎలాంటి తవ్వకాలు జరగడం లేదని, ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదిస్తామని కమిటీ సభ్యులు స్పష్టం చేయడం గమనార్హం.

ఇవేమీ అక్రమం కాదట..

  • కమిటీ సభ్యుల పరిశీలనలో ఇసుక తవ్వకాలు జరుగుతున్నట్లు ఆనవాళ్లు గుర్తించినప్పటికీ ఈ ప్రాంతంలో అనధికారికంగా తవ్వకాలు జరగట్లేదని నిర్ధారించారు. 
  • తీరంలో ఎక్కడ చూసినా గుట్టలుగా ఇసుక పోగులు ఉన్నాయి. అవి కూడా అనధికార తవ్వకాల పరిధిలోకి రావంట.
  • గతంలో ఇక్కడే నదిలో నీటి ప్రవాహానికి అడ్డుగా గొట్టాలతో తాత్కాలిక రహదారులు ఏర్పాటు చేసి యథేచ్ఛగా యంత్రాలతో ఇసుక తవ్వేసి లారీలు ద్వారా తరలించేవారు. దీనిపై తెదేపా శ్రేణులు ఆందోళన చేయడంతో పొక్లెయిన్లతో తవ్వకాలు ఆపేశారు. అప్పటి నుంచి రాత్రి వేళ ట్రాక్టర్ల ద్వారా ఇసుకను ఒడ్డుకు తరలించి.. లారీల్లో ద్వారా రవాణా చేస్తున్నారు. అందుకు ఇక్కడ ఉన్న గుంతలు, ఇసుక పోగులే నిదర్శనం. 
  • వేసవి కావడంతో పంట పొలాలు పగుళ్లువారి ఉన్నారు. దీన్ని అదనుగా చేసుకుని అంబళ్లవలస, బూరవల్లి ఎస్సీ కాలనీ, తదితర ప్రాంతాల నుంచి రాత్రి వేళల్లో ట్రాక్టర్ల దీపాలు ఆర్పి వేసి పొలాలు మీదుగా ఇసుక తరలిస్తున్నారు. వాటికి సంబంధించి ఆనవాళ్లు కూడా అక్కడ కనిపిస్తున్నాయి. 
  • నిత్యం రాత్రి వేళ ఇసుక ట్రాక్టర్లు తిరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నా కమిటీ సభ్యులు ఆ విషయాలను పరిగణనలోకి తీసుకోలేదు. 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు