logo

ఇంజినీరింగ్‌ విభాగంలో.. ఇంటి దొంగలు!

ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అనేందుకు పలాస- కాశీబుగ్గ పురపాలికలో జరిగిన ఘటనే ఉదాహరణ.. ఇక్కడ ఇంజినీరింగ్‌ శాఖలో కొందరు సిబ్బంది బోర్ల విడిభాగాలను వీధుల్లో వేస్తామని తీసుకెళ్లి దుకాణాలల్లో విక్రయిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది.

Published : 26 May 2024 02:23 IST

గుట్టుగా బోర్ల విడిభాగాలు తరలింపు

దుకాణంలోని పైపుల మధ్య దాచిన చేతిబోరు భాగాలు 

ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అనేందుకు పలాస- కాశీబుగ్గ పురపాలికలో జరిగిన ఘటనే ఉదాహరణ.. ఇక్కడ ఇంజినీరింగ్‌ శాఖలో కొందరు సిబ్బంది బోర్ల విడిభాగాలను వీధుల్లో వేస్తామని తీసుకెళ్లి దుకాణాలల్లో విక్రయిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై ఉన్నతాధికారులు చర్యలకు ప్రయత్నిస్తున్నా కిందిస్థాయి ఉద్యోగులు అడ్డుకుంటూ చక్రం తిప్పుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.

న్యూస్‌టుడే, పలాస: పలాస పురపాలక సంఘంలోని ఇంజినీరింగ్‌ విభాగంలో కొనుగోలు చేసే చేతిపంపులు, సిలిండర్లు, పైపులు, హెడ్‌లను టెండర్లు లేదా నామినేషన్‌ పద్ధతుల్లో రప్పిస్తుంటారు. ఇండెంట్‌ ప్రకారం వచ్చిన సామగ్రి పురపాలక సంఘం కమిషనర్, డీఈఈ, ఏఈ, ఇంజినీరింగ్‌ సిబ్బందితో పాటు ప్రజాప్రతినిధుల సమక్షంలో లెక్క పెట్టి దస్త్రాల్లో నమోదు చేయాలి. ఆయా వార్డుల్లో అవసరం మేరకు సిబ్బంది ఇండెంట్‌ పెడితే సంబంధిత ఇంజినీరింగ్‌ అధికారి దగ్గరుండి సామగ్రి లెక్కపెట్టి అప్పగించాలి. పలాస- కాశీబుగ్గ పురపాలక సంఘంలో సిబ్బంది చేతికే స్టోర్‌రూం తాళాలు ఇచ్చేస్తుండటంతో సామగ్రికి రెక్కలొస్తున్నాయి. కొంతమంది విడిభాగాలను పక్కదారి పట్టించి దుకాణాల్లో విక్రయిస్తున్నారు. ఇటీవల పురపాలక సంఘంలో ప్రజావసరాల మేరకు సుమారు రూ.8 లక్షల విలువైన మోటార్లు, పైపులు, ఇతర విడిభాగాలను కొనుగోలు చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో అధికారులు నిమగ్నమై ఉండగా.. 3 చేతిపంపు సిలిండర్లు, 5హెడ్‌లు పక్కదారి పట్టాయి. ఇవి పలాస కె.టి.రోడ్డులో ఉన్న ఓ దుకాణానికి చేరాయి. జాతీయ రహదారి సమీపంలో ఉన్న నాలుగో బావికి చెందిన కేబుల్‌ తీగలను కత్తిరించి పట్టుకుపోయారు. అధికారులకు తెలియటంతో విషయాన్ని గోప్యంగా ఉంచి విచారణ   చేపట్టారు. 

పలాసలోని ఓ దుకాణంలో ఉన్న బోరు సిలిండర్లు

సిబ్బంది చేతివాటం..

ఇంజినీరింగ్‌ శాఖలో అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో సిబ్బంది చేతివాటం చూపుతున్నారన్న విమర్శ వినిపిస్తోంది. ఇటీవల కొత్త డీఈ రాగా,  మరో ఏఈ శ్రీకాకుళం నుంచి డెప్యుటేషన్‌పై వచ్చి విధులు నిర్వహిస్తున్నారు. న్యూకాలనీ, బత్తుల వీధి, పద్మనాభపురం వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఇంజినీరింగ్‌ సహాయకులను పురపాలిక సంఘ కార్యాలయానికి కమిషనర్‌ రప్పించారు. వీరికి విద్యుత్తు, నీటి సరఫరా, పట్టణ పరిధిలోని సివిల్‌ పనులపై పర్యవేక్షణ బాధ్యత అప్పగించారు. వార్డుల్లో వీరు పనుల నిర్వహణను చూస్తూనే..  వాటికి అవసరమయ్యే సామగ్రిని స్టోర్‌ రూంలో తనిఖీ చేసి అప్పగించాలి. అయితే సిబ్బందికే నేరుగా తాళాలు అప్పగించడం, బాధ్యతగా పర్యవేక్షించకపోవడంతో గుట్టుగా సామగ్రి బయటకు వెళ్లిపోతోంది. బోర్ల విడిభాగాలు పక్కదారి పట్టడం, ఓ దుకాణంలో విక్రయించడంతో ఆ దుకాణదారునితో మాట్లాడి వాటిని వెనక్కి రప్పించినట్లు తెలుస్తోంది.

నా దృష్టికి వచ్చింది..

బోరు సామగ్రి తరలించారనే విషయం నా దృష్టికి వచ్చింది. సిబ్బందిని పిలిపించి విచారణ చేపట్టాం. దుకాణం నుంచి సామగ్రి అరువు తీసుకొచ్చామని, పురపాలక సంఘానికి సామగ్రి వచ్చిన తర్వాత వాటిని దుకాణానికి ఇచ్చేశామని చెప్పారు. తప్పు జరిగితే సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం. స్టోర్‌ రూం తాళాలు ఏఈకి అప్పగించి, సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాం.

పురపాలక కమిషనర్‌ టి.నాగేంద్రకుమార్‌ 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు