logo

పర్యవేక్షణ లోపం.. రోగులకు శాపం..!

శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజనాసుపత్రిలో పర్యవేక్షణ లోపం రోగుల పాలిట శాపంగా మారింది. పట్టించుకునేవారు లేకపోవడంతో డయాలసిస్‌ విభాగంలో కిడ్నీ వ్యాధిగ్రస్థులు సేవలు సక్రమంగా అందడం లేదు. ఏసీ, ఫ్యాన్లు పని చేయకపోవడంతో బాధితులు ఇబ్బంది పడుతున్నారు.

Updated : 26 May 2024 05:01 IST

సర్వజనాసుపత్రిలో డయాలసిస్‌ బాధితుల ఇక్కట్లు

సర్వజనాసుపత్రి డయాలసిస్‌ విభాగంలో రోగులు

శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజనాసుపత్రిలో పర్యవేక్షణ లోపం రోగుల పాలిట శాపంగా మారింది. పట్టించుకునేవారు లేకపోవడంతో డయాలసిస్‌ విభాగంలో కిడ్నీ వ్యాధిగ్రస్థులు సేవలు సక్రమంగా అందడం లేదు. ఏసీ, ఫ్యాన్లు పని చేయకపోవడంతో బాధితులు ఇబ్బంది పడుతున్నారు. కిడ్నీలు పాడైనవారికి డయాలసిస్‌ చేసేటప్పుడు కనీసం రెండు నుంచి మూడు గంటల పాటు ఆ యంత్రాల వద్ద ఉండాలి. ఆ సమయంలో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దీంతో పాటు డయాలసిస్‌ రోగులకు ఉచితంగా వేయాల్సిన ఇంజెక్షన్లను బయట నుంచి కొనిపిస్తున్నారని రోగులు, వారి బంధువులు 
ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

న్యూస్‌టుడే, గుజరాతీపేట (శ్రీకాకుళం): సర్వజనాసుపత్రిలో డయాలసిస్‌ చేసే యంత్రాలు 19 ఉన్నాయి. వాటి ద్వారా నెఫ్రోప్లస్‌ సంస్థ ఆధ్వర్యంలో రోజుకు సుమారు 60 మందికి పైగా డయాలసిస్‌ చేస్తుంటారు. ఆ రోగులకు డయాలసిస్‌ చేసేముందు ఎర్ర రక్తకణాలను ఉత్తేజ పరిచేందుకు ఎరిత్రోపోయిటిన్‌ ఇంజెక్షన్‌ చేస్తుంటారు. వాటిని సర్వజనాసుపత్రిలోని సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్సు (సీడీఎస్‌) నుంచి నెఫ్రోప్లస్‌కి ఉచితంగా ఇవ్వాలి. ఒకవేళ ఇంజెక్షన్ల నిల్వలు అందుబాటులో లేకపోతే నెఫ్రోప్లస్‌ సిబ్బంది వెంటనే సీడీఎస్‌కు ఇండెంట్‌ పెట్టి తీసుకోవాలి. ఇక్కడ అలాంటిదేమీ జరగట్లేదు. సుమారు రూ.2 వేలు ఖరీదు చేసే ఆ ఇంజెక్షన్ల సీడీఎస్‌లో 4 వేల వరకు ఉన్నప్పటికీ రప్పించకుండా ఆసుపత్రికి వచ్చే నిరుపేదలతో కొనిపిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులెవరూ పట్టించుకోకపోవడం గమనార్హం. ఈ విషయాన్ని డయాలసిస్‌ సెంటర్‌ మేనేజర్‌ రాజశేఖర్‌ వద్ద ప్రస్తావించగా ఎరిత్రోపోయిటిన్‌ ఇంజెక్షన్‌ కొనిపించడం లేదని చెప్పారు. 

పని చేయని ఫ్యాన్, ఏసీ  

ఏజెన్సీకి తెలియజేస్తాం..

ఆసుపత్రిలోని సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్సులో ఎరిత్రోపోయిటిన్‌ ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయి. డయాలసిస్‌ కోసం వచ్చే రోగులు ఆ ఇంజెక్షన్లు బయట కొనాల్సిన పనిలేదు. విషయాన్ని నెఫ్రోప్లస్‌ ఏజెన్సీకి తెలియజేసి చర్యలు చేపడతాం. పాడైన ఏసీ, ఫ్యాన్లు బాగు చేయిస్తాం. రోగులకు ఇబ్బందుల్లేకుండా చూస్తాం. 

ఎ.స్వామినాయుడు, సూపరింటెండెంట్, డాక్టర్‌ రమేష్‌నాయడు, డిప్యూటీ ఆర్‌ఎంవో, సర్వజనాసుపత్రి

మూడు నెలలుగా బయటే కొంటున్నా..

నేను మూడు నెలలుగా ఆసుపత్రికి వస్తున్నాను. ప్రతిసారి ఇంజెక్షన్‌ బయటే కొంటున్నాను. పేదలకు ఇంత ఖరీదైనా ఇంజెక్షన్‌ కొనడం ఎలా సాధ్యం. ఆసుపత్రిలో ఉన్నప్పటికీ ఇవ్వడం లేదని తెలిసింది. ఇది సరి కాదు. 

- టి.శ్రీనివాసరావు, గార 

ఉచితంగా ఇవ్వాలి..

డయాలసిస్‌ కోసం వచ్చేవారు ఇంజెక్షన్లు బయట నుంచి తెచ్చుకోవాలని చెప్పడం సరికాదు. ఆర్థిక భారం అవుతోంది. మా లాంటి పేదల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇంజెక్షన్లు, మందులు  ఉచితంగానే ఇవ్వాలి.

ఎస్‌.రామారావు, రణస్థలం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని