logo

హద్దు మీరితే క్షమించేది లేదు..

‘ప్రజాస్వామ్యంలో ముఖ్యమైన ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియకు, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలి. ఓట్ల లెక్కింపు అనంతరం అనవసరంగా నేరాలకు పాల్పడి కేసులతో జీవితాంతం ఇబ్బందులు పడొద్దు’ అని జిల్లా ఎస్పీ జి.ఆర్‌. రాధిక పేర్కొన్నారు.

Updated : 26 May 2024 03:02 IST

కొట్లాటలు, కవ్వింపు చర్యలకు దిగితే రౌడీషీట్లు తెరుస్తాం  
కౌంటింగ్‌ ప్రక్రియకు పటిష్ఠ భద్రత
ఈనాడు ముఖాముఖిలో ఎస్పీ జి.ఆర్‌.రాధిక

‘ప్రజాస్వామ్యంలో ముఖ్యమైన ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియకు, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలి. ఓట్ల లెక్కింపు అనంతరం అనవసరంగా నేరాలకు పాల్పడి కేసులతో జీవితాంతం ఇబ్బందులు పడొద్దు’ అని జిల్లా ఎస్పీ జి.ఆర్‌. రాధిక పేర్కొన్నారు. జూన్‌ 4న జరిగే కౌంటింగ్‌కు సంబంధించి తీసుకునే భద్రతా వివరాలు, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే తీసుకునే చర్యలు, ఇతర అంశాలను ‘ఈనాడు’ ముఖాముఖిలో ఇలా వివరించారు..

ఈనాడు డిజిటల్‌ శ్రీకాకుళం, న్యూస్‌టుడే శ్రీకాకుళం నేరవార్తా విభాగం

జైలు పాలు కావొద్దు..

కౌంటింగ్‌ జరుగుతున్న సమయంలో ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా చట్టపరంగా పరిష్కరించుకోవాలే తప్ప బెదిరింపులు, కవ్వింపు చర్యలకు పాల్పడటం, కొట్లాటలు వంటి హింసాత్మక ఘటనలకు దిగితే కేసుల్లో ఇరుక్కోవడంతో పాటు రౌడీషీట్లు తెరుస్తాం. అవసరమైతే జిల్లా బహిష్కరణ వంటి చర్యలు ఉంటాయి. మరీ తీవ్రంగా నేరాలు చేసేవారు ఉంటే పీడీ చట్టం కింద కేసులు నమోదు చేయడంతో ఆరునెలలు జైల్లో ఉండాల్సి ఉంటుంది. 

మూడంచెల భద్రత

ఎచ్చెర్లలోని శివాని ఇంజినీరింగ్‌ కళాశాలలో కౌంటింగ్‌ రోజున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేస్తున్నాం. దీనికి వన్‌ టైర్, టూ టైర్, త్రీ టైర్‌ అని మూడంచెల భద్రత ఉంటుంది. అందులో కేంద్ర బలగాలు, పారా మిలటరీ, సివిల్‌ పోలీసులు ఉంటారు. కౌంటింగ్‌ కేంద్రంలో ప్రతి నియోజకవర్గం, అలాగే పార్లమెంట్‌ స్థానానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు సిబ్బందిని నియమించాం. వీటి పరిసరాల్లో ప్రత్యేక డ్రోన్లు ఏర్పాటు చేస్తున్నాం. కౌంటింగ్‌ సమీపంలో రిటర్నింగ్‌ అధికారులు జారీ చేసిన అనుమతి పత్రాలు ఉన్నవారినే లోపలకు అనుమతిస్తారు. ఇతరులు  కౌంటింగ్‌ కేంద్రం వద్దగానీ పరిసర ప్రాంతాల్లో ఉండకూడదు. 

జిల్లా అంతా 144 సెక్షన్‌

శాంతిభద్రతల దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్‌ అమల్లో ఉంది. ఎక్కడైనా ఘర్షణలు, కొట్లాటలు జరగకుండా ప్రతి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో స్ట్రైకింగ్‌ ఫోర్స్‌ కింద ఎస్సైతో పాటు కొంత మంది సిబ్బంది ఉంటారు. వీరంతా వారి పరిధిలో వాగ్వాదాలు చోటుచేసుకుంటే నివారణ చర్యలు చేపడతారు. మాట వినకపోతే స్టేషన్‌కి తీసుకొచ్చి కేసులు నమోదు చేస్తారు. గొడవలు చేసేవారు, నేర చరిత్ర కలిగినవారిని ముందస్తుగా అరెస్టు చేస్తాం. సమస్యాత్మక ప్రాంతాల్లో ఇప్పటికే ఆయా ప్రాంతాల వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చాం. 

ఫలితాల అనంతరం ప్రత్యేక నిఘా..

ఫలితాలు వెలువడిన అనంతరం జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పెట్రోలింగ్‌ నిర్వహిస్తాం. ముందుగా గుర్తించిన ప్రాంతాల్లో పికెట్లు ఏర్పాటు చేసి ప్రత్యేక నిఘా పెడుతున్నాం. ఇప్పటికే గుర్తించిన ట్రబుల్‌ మాంగర్స్‌లకు నోటీసులిస్తాం. సమస్యాత్మక ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేయనున్నాం. ఒకేచోట నలుగురు కన్నా ఎక్కువమంది గుమిగూడి ఆందోళనలు, హింసాత్మక ఘటనలు, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై లాఠీఛార్జి, ఫైరింగ్‌ చేసేందుకు వెనకాడబోం.

విజయోత్సవ ర్యాలీలు నిషేధం.. 

పెట్రోల్, డీజిల్‌ వంటివి బాటిళ్లలో అమ్మకం నిషేధం. విజయోత్సవ ర్యాలీలు, బాణసంచా పేలుళ్లకు ఎలాంటి అనుమతుల్లేవు. జూన్‌ 6వ తేదీ వరకు ఎన్నికల కోడ్‌ ఉన్న నేపథ్యంలో ఎలాంటి రాజకీయ ర్యాలీలు చేపట్టకూడదు. పండగలు ఇతర కార్యక్రమాలకు సంబంధించి వేదికలు ఏర్పాటు చేయకుండా నిర్వహించుకోవాలని ఇప్పటికే ఆదేశాలిచ్చాం.

రౌడీషీటర్ల బైండోవర్‌..

కేంద్ర బలగాలు, పారామిలటరీ, స్థానిక పోలీసుల సాయంతో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తాం. ఇందుకోసం ఇప్పటికే సిబ్బందికి పలు సూచనలు చేశాం. స్ట్రాంగ్‌ రూంలను నిత్యం పరిశీలిస్తున్నాం. కేంద్ర బలగాల పహారాలో ఉన్న స్ట్రాంగ్‌రూంల వద్ద భద్రత ఉంది. ఇప్పటికే జిల్లాలో రౌడీషీటర్లు, అనుమానితులను బైండోవర్‌ చేశాం. జిల్లాలోని ప్రతి పోలీసుస్టేషన్‌ పరిధిలో ఉన్న రౌడీషీటర్లు, అల్లరి మూకలకు కౌన్సెలింగ్‌ నిర్వహించాం.  


ఆకట్టుకున్న మాక్‌డ్రిల్‌

గాల్లోకి కాల్పులు జరుపుతున్న పోలీసులు

న్యూస్‌టుడే, శ్రీకాకుళం నేరవార్తావిభాగం: ఎన్నికల ఓట్ల లెక్కింపు రోజున ఎక్కడైనా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నా, అల్లరి మూకలు విధ్వంసానికి పాల్పడినా వాటిని ఎదుర్కొనే విధానం, తీసుకోనున్న చర్యలను పోలీసులు కళ్లకు కట్టారు. ఎస్పీ జి.ఆర్‌.రాధిక పర్యవేక్షణలో జిల్లా ఆర్మ్‌డ్‌ రిజర్వు పోలీసులు శ్రీకాకుళం నగరంలోని నగరంలో డే అండ్‌ నైట్‌ కూడలి వద్ద మాబ్‌ ఆపరేషన్, మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు. ఆందోళనకారులను హెచ్చరించడం, మాట వినకపోతే ఉన్నతాధికారుల అనుమతితో వారిపై భాష్పవాయువు ప్రయోగించడం, అనంతరం అగ్నిమాపక సిబ్బంది వాటర్‌ కెనాన్‌ వినియోగం, లాఠీఛార్జ్‌ చేపట్టడం, ప్లాస్టిక్‌ పెల్లెట్స్‌ ఫైరింగ్‌ చేయడం, అప్పటికి పరిస్థితి అదుపులోకి రాకపోతే ఫైరింగ్‌ చేయడం వంటివి అత్యంత నైపుణ్యంతో ప్రదర్శించారు. అల్లర్లు జరిగితే పోలీసులు తీసుకోనున్న చర్యలను వివరించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ జి.ప్రేమ్‌ కాజల్, దిశ డీఎస్పీ శ్రీనివాసరావు, ఎల్‌.శేషాద్రి నాయుడు, సీఐలు ఎల్‌.సన్యాసినాయుడు, ఉమామహేశ్వరరావు, ఆర్‌ఐలు సురేష్, రమేష్, కేవీ నర్సింగరావు, సిబ్బంది పాల్గొన్నారు.

గాయాలపాలైనవారిని ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు..

ఆందోళనకారులపై ఫోం వదులుతున్న అగ్నిమాపక సిబ్బంది 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని