logo

కాలువ కప్పేసి..స్థలాలగా మార్చేసి..!

పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘంలోని పురుషోత్తపురం రెవెన్యూ పరిధి వరద నీటి కాలువ అక్రమణదారుల పాలవుతోంది.

Updated : 21 Mar 2023 07:12 IST

వంద గజాలు రూ.5 లక్షలకు విక్రయం

కాలువ స్థలాన్ని ఇలా ప్లాట్లుగా మార్చేస్తున్నారు..

న్యూస్‌టుడే, కాశీబుగ్గ

పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘంలోని పురుషోత్తపురం రెవెన్యూ పరిధి వరద నీటి కాలువ అక్రమణదారుల పాలవుతోంది. కొంతమంది అక్రమార్కులు తప్పుడు పత్రాలు తయారు చేసి తాజాగా రూ.1.50 కోట్ల విలువ చేసే కాలువను ఆక్రమించుకుని ఇంటి స్థలాలుగా మార్చేసి ఏకంగా విక్రయాలకు తెరతీశారు.

నాటి పట్టాలు కాదని..

సూదికొండ, నెమలికొండల నుంచి వచ్చే వరద నీరు ఈ కాలువ గుండా దిగువ భాగానికి వెళ్లాల్సి ఉంది. అందుకు సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలోని ఈ కాలువ ఎర్ర చెరువు వరకు ఉండేది. గతంలో నాలుగు ఎకరాలకు పైగా ఆక్రమణలకు గురైంది. మిగిలిన సుమారు ఎకరానూ తాజాగా ఇంటి స్థలాలుగా మార్చేసి కొందరు అమ్మేస్తున్నారు.

తహసీల్దారే స్వయంగా కేసు పెట్టినా...

ఈ కాలువ భాగంలో 2001లో పలువురికి అప్పటి రెవెన్యూ అధికారులు ఇంటి స్థలాలకు పట్టాలు మంజూరు చేశారు. కాగా మిగిలిన భాగానికి కొంతమంది డీ పట్టాలు సృష్టించి ఆక్రమణలకు పాల్పడుతున్నారని 2012-2013లో అప్పటి తహసీల్దారు పార్వతీశం పోలీస్‌ కేసులు సైతం పెట్టారు. తదనంతర కాలంలో అధికారులు దాన్ని పట్టించుకోకపోవడంతో అక్రమార్కులు మరోసారి విక్రయాలకు పాల్పడుతున్నారు. వంద గజాల చొప్పున ఇంటి స్థలాలుగా మార్చి ఒక్కోటి రూ.5 లక్షలకు విక్రయిస్తున్నారు. గతంలో ఇంటి స్థలాలకు పట్టాలు పొందిన లబ్ధిదారులు ప్రస్తుతం కనిపించకుండా పోవడం కూడా వీరికి కలిసొచ్చింది. ఇప్పటికే 20 సెంట్లకుపైగా విక్రయించేసినట్టు తెలుస్తోంది.

పక్క సర్వే నంబర్లతో రిజిస్ట్రేషన్‌

కాలువలో చేపడుతున్న అక్రమ విక్రయాలకు పక్కనున్న జిరాయితీ సర్వే నంబర్‌తో రిజిస్ట్రేషన్లు కూడా చేయించేస్తున్నారు. ఈ ప్రాంతంలో వంద గజాల జిరాయితీ స్థలం రూ.10 లక్షలు వరకు ధర ఉంది. కాలువ ప్రాంత స్థలం కావడంతో అందులో సగానికి అంటే రూ.5 లక్షలకు విక్రయిస్తున్నారు.


మా దృష్టికి రాలేదు

కాలువ ప్రాంతంలో ఇటీవల విక్రయాలు జరుగుతున్నట్లు మా దృష్టికి రాలేదు. పరిశీలించి చర్యలు తీసుకుంటాం. ఇటువంటి స్థలాలను ఎవరూ కొనుగోలు చేయవద్దు. కొంటే తర్వాత ఇబ్బందులు పడాల్సి వస్తుంది.


ఎల్‌.మధుసూదన్‌, తహసీల్దార్‌, పలాస

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని