logo

అత్యాశ మానుకో.. మోసం తెలుసుకో

‘నేను ఏ ఒక్క అవకాశాన్ని వదులుకునేందుకు సిద్ధంగా ఉండను. నాలో ఆశాభావం ఎక్కువ. డబ్బులు సంపాదించే దారుల కోసం శోధిస్తుంటా. కష్టపడకుండా డబ్బులొస్తాయంటే ముందూ.. వెనుకా చూడకుండా అడిగిన సమాచారం ఇచ్చేస్తా.

Updated : 29 Nov 2023 08:47 IST

సైబర్‌ కేటుగాళ్ల వలలో యువత
న్యూస్‌టుడే, శ్రీకాకుళం నేరవార్తావిభాగం, కాశీబుగ్గ  

‘నేను ఏ ఒక్క అవకాశాన్ని వదులుకునేందుకు సిద్ధంగా ఉండను. నాలో ఆశాభావం ఎక్కువ. డబ్బులు సంపాదించే దారుల కోసం శోధిస్తుంటా. కష్టపడకుండా డబ్బులొస్తాయంటే ముందూ.. వెనుకా చూడకుండా అడిగిన సమాచారం ఇచ్చేస్తా. తీరా అత్యాశకు పోయి సైబర్‌ కేటుగాళ్ల వలలో చిక్కి మోసపోతుంటా..’ ఇదీ సగటు జీవుల ప్రస్తుత పరిస్థితి. ప్రతిరోజు చుట్టుపక్కలే ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పటికీ ప్రజల్లో మార్పు రావట్లేదు. పెరిగిన సాంకేతికత  ఓ వైపు ప్రజలకు సులభతర సేవలందిస్తూనే.. మరోవైపు సైబర్‌ కేటుగాళ్ల మోసాలకు తావిస్తోంది. జిల్లాలో ఇలా ఏటా అనేక మంది బాధితులుగా మారుతూ.. రూ.లక్షల్లో పోగొట్టుకుంటున్నారు.      

కొన్ని ఉదాహరణలు ఇలా..

  • శ్రీకాకుళం నగరం ప్రధాన రహదారికి చెందిన ఓ యువతి తన చరవాణికి లోన్‌ పేరిట ఓ లింక్‌ వచ్చింది. అది ఓపెన్‌ చేసి అడిగిన వివరాలను నమోదు చేయడంతో వెంటనే ఖాతాలో డబ్బులు జమ చేశారు. అనంతరం మొత్తం నగదు చెల్లించినప్పటికీ, ఇంకా ఇవ్వాలని వేధించారు. లేదంటే నగ్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పెడతామని బెదిరించారు.
  • ఎచ్చెర్లకు చెందిన ఓ వ్యక్తికి తెలియని నంబరుతో ఫోన్‌ వచ్చింది. మీ పేరిట ఆర్డర్‌ వచ్చిందని, ఓటీపీ చెప్పమన్నారు. తానేమీ ఆర్డర్‌ చేయలేదని చెప్పినప్పటికీ.. ఎవరో మీ నంబరు ఇచ్చారని ఓటీపీ చెబితే వస్తువు మీకు అందజేస్తామని నమ్మించారు. తీరా ఓటీపీ చెప్పాక బాధితుడి ఖాతాలో డబ్బులను లూటీ చేశారు.
  • నరసన్నపేటకు చెందిన ఓ రైతు అవగాహన రాహిత్యంతో చరవాణిలో ఓ నకిలీ యాప్‌పై క్లిక్‌ చేశారు. దీంతో అది ఇన్‌స్టాల్‌ అయ్యింది. తన వ్యక్తిగత సమాచారం గుర్తుతెలియని వ్యక్తులకు వెళ్లిపోయింది. అనంతరం సైబర్‌ నేరగాళ్లు డబ్బులు పంపించాలంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో భయాందోళనకు గురై పోలీసులను ఆశ్రయించారు.
  • శ్రీకాకుళం నగరానికి చెందిన ఓ యువకుడికి కొత్త నంబరు నుంచి ఫోన్‌ వచ్చింది. ‘మీకు లాటరీ తగిలిందని, కొంత మొత్తం చెల్లిస్తే ఆ డబ్బులు పంపిస్తామని, ఆధార్‌ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు చెప్పమన్నారు. ఆశపడిన యువకుడు వివరాలు చెప్పగా.. క్షణాల్లో ఖాతాలో డబ్బులు మాయం చేశారు.
  • నరసన్నపేటకు చెందిన ఓ యువకుడు సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగి. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌, టెలిగ్రామ్‌ల ద్వారా అతడికి కొన్ని సమాచారాలొచ్చాయి. డిపాజిట్‌కు రెట్టింపు నగదు ఇస్తామని సైబర్‌ నేరగాళ్లు అతడిని నమ్మించారు. బాధితుడు తొలుత తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టగా రెట్టింపు డబ్బులు వేశారు. పెద్దమొత్తంలో వేస్తామని నమ్మించి రూ.9 లక్షలు కాజేశారు.

ఫిర్యాదు చేయడంలో అలసత్వం వద్దు..

లాటరీలు, రుణాలు, ఆఫర్లు, ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ ఇలా అనేక రూపాల్లో సైబర్‌ కేటుగాళ్లు ఎర వేస్తుంటారు. చరవాణులకు సందేశాలు, లింక్‌లు పంపించి వ్యక్తిగత సమాచారం తీసుకుంటారు. ఇలా ఖాతాల నుంచి క్షణాల్లో డబ్బులు మాయం చేస్తారు. మోసపోయామని గుర్తించిన వెంటనే 1930 నంబరుకు డయల్‌ చేసి ఫిర్యాదు చేయాలి. అనంతరం దగ్గర్లోని సైబర్‌ క్రైం విభాగానికి వెళ్లి సమాచారం ఇవ్వాలి. ఆలస్యం చేస్తే డబ్బుల్ని వివిధ ఖాతాల్లోకి మార్చేసే అవకాశం ఉంది. రికవరీ చేసేందుకు సైతం కష్టమవుతుంది. జిల్లాలో పోలీసు కార్యాలయంలో వీటికి సంబంధించి ప్రత్యేకంగా సైబర్‌ నేరాల విభాగం ఉంది. అందులో ఒక ఎస్సై, నలుగురు కానిస్టేబుళ్లు విధులు నిర్వర్తిస్తుంటారు. జిల్లాలోని వివిధ పోలీసుస్టేషన్లలో నమోదైన కేసులను వారు సాంకేతికతను ఉపయోగించి దర్యాప్తు చేస్తారు.


యాప్‌లపై అప్రమత్తంగా ఉండాలి..

- టి.పి.విఠలేశ్వర్‌, క్రైం విభాగం, ఏఎస్పీ, శ్రీకాకుళం

ఆన్‌లైన్‌ యాప్‌లపై అప్రమత్తంగా ఉండాలి. సైబర్‌ వలలో చిక్కుకుంటే అధిక మొత్తంలో నగదును కోల్పోతాం. అవసరం లేని చోట వ్యక్తిగత వివరాలను పొందుపరచకూడదు. బ్యాంకు ఖాతాకు ఆధార్‌ లింక్‌ అయి ఉండటంతో ఆధార్‌ సంఖ్య ఓటీపీ చెప్పడంతో ఖాతా ఖాళీ చేసేస్తారు.

జిల్లాలో సైబర్‌ నేరాల వివరాలిలా...

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని