logo

కడగండి.. పూర్తి చేసేదెప్పుడండి..?

పదిహేనేళ్ల కిందట ఎల్‌ఎన్‌పేట మండలంలో కడగండి జలాశయాన్ని నిర్మించారు. సుమారు రూ.5 కోట్లు వరకు నిధులు ఖర్చు చేశారు. కానీ దానికి అనుసంధానంగా కాలువల నిర్మాణం చేపట్టకపోవడంతో అందుబాటులోకి రాలేదు.

Published : 01 Dec 2023 03:58 IST

15 ఏళ్లుగా ముందుకు సాగని కాలువల నిర్మాణం
న్యూస్‌టుడే, ఎల్‌ఎన్‌పేట

దిహేనేళ్ల కిందట ఎల్‌ఎన్‌పేట మండలంలో కడగండి జలాశయాన్ని నిర్మించారు. సుమారు రూ.5 కోట్లు వరకు నిధులు ఖర్చు చేశారు. కానీ దానికి అనుసంధానంగా కాలువల నిర్మాణం చేపట్టకపోవడంతో అందుబాటులోకి రాలేదు. ఫలితంగా రిజర్వాయరులో సాగునీరు ఉన్నా రైతులకు అక్కరకు రావట్లేదు. ప్రభుత్వాలు మారుతున్నా ఆ పనులకు మోక్షం కలగడం లేదని ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత కాలువల నిర్మాణానికి ఒక్క రూపాయి నిధులు కూడా మంజూరు చేయలేదు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి జలశయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని రైతులు కోరుతున్నారు.


ఎల్‌ఎన్‌పేట మండలంలోని జంబాడ వద్ద 2005లో కడగండిగెడ్డ జలాశయం నిర్మాణానికి అప్పటి ఆమదాలవలస ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతి శంకుస్థాపన చేశారు. రెండు కొండల మధ్య గట్టు నిర్మాణం, కుడి, ఎడమ కాలువలకు సంబంధించిన తూములు పనులు రెండేళ్లులో పూర్తి చేశారు. ఆ తరువాత కుడి, ఎడమ కాలువల నిర్మాణం ఏళ్ల పాటు నిలిచిపోయింది.

2016లో కాలువల నిర్మాణానికి తెదేపా ప్రభుత్వం నీరు-ప్రగతి కార్యక్రమంలో భాగంగా రూ.4.06 కోట్లు మంజూరు చేసింది. వాటితో భూసేకరణ చేశారు. కానీ చాలా మంది రైతు ఖాతాల్లో పరిహారం జమ కాలేదు. ఎడమ కాలువ వద్ద చేపట్టిన వయోడెక్ట్‌ పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. వైకాపా ప్రభుత్వం వచ్చిన తరువాత మిగిలిన పనుల సంగతి పట్టించుకోలేదు.


రెండు మండలాలకు ప్రయోజనం..

కడగండి జలాశయం పూర్తయితే ఎల్‌ఎన్‌పేట, సరుబుజ్జిలి మండలాల్లోని పలు గ్రామాలు ప్రయోజనం కలుగుతుంది. ఎడమ కాలువ అందుబాటులోకి వస్తే ఎల్‌ఎన్‌పేట మండలంలోని వలసపాడు, బొర్రంపేట, జంబాడ, ముంగెన్నపాడు, కరకవలస, మల్లికార్జునపురం, శ్యామలాపురం, కుసుమలపాడు గ్రామాలు, కుడి కాలువ పూర్తయితే ఎల్‌ఎన్‌పేట మండలంలో జంబాడ, సరుబుజ్జిలి మండలంలో అమృత లింగానగరం, గోనెపాడు, బప్పడాం, కూనజమ్మన్నపేట, సరుబుజ్జిలి గ్రామాలకు సాగునీటి కష్టాలు తీరుతాయి. కానీ పనులు జరగకపోవడంతో ప్రస్తుతం జలాశయంలోని నీరు వృథాగా పోతోంది. తూములు సైతం మరమ్మతులకు గురయ్యాయి.


ఉన్నతాధికారులకు తెలియజేశాం...

- జనార్ధనరావు, డీఈఈ, జలవనరులశాఖ, శ్రీకాకుళం

కాలువల నిర్మాణానికి టెండర్‌ దక్కించుకున్న గుత్తేదారు 38 శాతం పనులు చేశారు. ఆ తరువాత పనులు ఆపేశారు. దీంతో ఆయనకు నోటీసులిచ్చినా స్పందించ లేదు. విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశాం. వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. తూముల మరమ్మతులకు ప్రతిపాదనలు పంపించాం.          

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని